
పిల్లల మృతదేహాలను చూస్తున్న గ్రామస్తులు (ఇన్‌సెట్‌లో)నిందితుడు వెంకటేష్ రాహుల్ (ఫైల్)
మద్యం రక్కసి మనుషుల్ని రాక్షసుల్ని చేస్తోంది. హంతకులుగా మారుస్తోంది. నేర సంస్కృతిని ప్రేరేపిస్తోంది. చిత్తూరు రూరల్ మండలంలో ఇటీవల మద్యం పూటుగా తాగి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను హతమార్చాడు. ఈ సంఘటన మరువకమునుపే తాగిన మైకంలో మరో కిరాతకుడు ముక్కుపచ్చలారని ముగ్గురు పసికందుల ప్రాణాలు తీశాడు. మత్తులో తానేం చేస్తున్నాడో తెలియక విచక్షణ కోల్పోయాడు. పేగు బంధాన్ని కూడా విస్మరించి పొట్టనబెట్టుకున్నాడు.
చిత్తూరు, గంగాధరనెల్లూరు: జీడీనెల్లూరు మండలం బాలగంగానపల్లిలో ఆదివారం రాత్రి అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను ఓ తండ్రి చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది. గ్రామానికి చెందిన వెంకటేష్(30) డ్రైవరుగా పనిచేసేవాడు. చిత్తూరు రూరల్ మండలం శెట్టిగారిపల్లికి చెందిన అముద, అమరావతిని ప్రేమించాడు. వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఏడేళ్ల క్రితం అముదను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదిన్నరకే అము ద భర్తను విడిచిపెట్టి శెట్టిగారిపల్లిలోనే ఉంటోం ది. వీరికి ఓ కుమార్తె ఉంది. ఐదేళ్ల క్రితం అమరావతిని పెళ్లిచేసుకున్నాడు. వీరికి పునీత్(4), సంజయ్(3), రాహుల్(2) ఉన్నారు. ఇతడు మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల కాలంలో ఎక్కువయ్యింది. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడడం దినచర్యగా మార్చుకున్నాడు.
శనివారం ఇదే మాదిరిగా భార్యతో గట్టిగా గొడవపడ్డాడు. దీంతో బిడ్డల్ని తీసుకుని ఆమె చిత్తూరు మండలంలోని కన్నవారింటికి వెళ్లిపోయింది. ఆదివారం సాయంత్రం వెంకటేష్ బాగా మద్యం తాగి అత్తవారింటికి వచ్చాడు. తనతో రావాలని గొడవ పడ్డాడు. ఈ మత్తులో నీతో రానని, మర్నాడు ఉదయం వస్తానని భార్య చెప్పింది. పిల్లల్నయినా తీసుకుపోతానంటూ నిద్రపోతున్నవారిని లేపి ద్విచక్రవాహనం ఎక్కించుకున్నాడు. దారిలో ఏమనుకున్నాడో ఏమోగాని ముగ్గురు పిల్లల్ని దారుణంగా పైనుంచి నీవానదిలోకి విసిరేశాడు. వారు మునిగి చనిపోయారు. ఇదేమీ పట్టనట్టుగా వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం భార్య ఫోన్ చేస్తే పిల్లలిద్దరినీ నదినీటిలో విసిరేశానని చెప్పాడు. అమరావతికి గుండె ఆగినంతపనైంది. నదివద్దకు వచ్చి చూసేసరికి పిల్లల శవాలు కనిపించాయి. స్థానికులు ఈ ఘటన చూసి చలించిపోయారు. మద్యం మత్తు దిగడంతో ఎస్‌ఆర్‌పురం మండలం కొల్లాగుంట వద్ద హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వెళ్తున్న నిందితుడ్ని బంధువులు గుర్తించి పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ రాజశేఖర్‌కు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment