Gangadhara Nellore
-
పల్లెల్లో సాఫ్ట్వేర్ కొలువులు.. 3.30 లక్షల ప్యాకేజీ
గంగాధరనెల్లూరు: పల్లెల్లోని విద్యావంతులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించడమే స్మార్ట్ డీవీ లక్ష్యమని.. తమ కంపెనీలో 4,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్‌కుమార్ తాళ్ల తెలిపారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని అగరమంగళంలో ఆయనతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఎస్ఆర్ పురం మండలం కొట్టార్లపల్లి వద్ద స్మార్ట్ డీవీ కంపెనీ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఎంవోయూ జరిగిందని, నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. దీనిలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు డిసెంబర్ 23న పరీక్షలు నిర్వహిస్తామని, తొలి విడతగా 600 మందిని తీసుకుంటామన్నారు. డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుతం చదువుతున్న వారూ అర్హులని తెలిపారు. ఎంపికైన ఫస్టియర్ డిప్లొమో, బీకాం, డిగ్రీ చేసిన వారికి రూ.2.70 లక్షలు, బీటెక్ చేసిన వారికి రూ.3.30 లక్షల ప్యాకేజీ ఉంటుందన్నారు. (క్లిక్ చేయండి: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు) -
భూకబ్జాపై సైనికుడి సెల్ఫీ వీడియో
సాక్షి, గంగాధరనెల్లూరు(చిత్తూరు) : మండలంలోని ఎల్లాపల్లెకు చెందిన సైనికుడు చంద్రబాబు తన తల్లికి ప్రాణభయం ఉంద ని సెల్ఫీ వీడియో తీసి పెట్టడంతో అధికారులు స్పందించారు. గ్రామానికి వెళ్లి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు.వివరాలు.. ఎల్లాపల్లెకు చెందిన కుప్పమ్మ కుమారులు చంద్రబాబు,మహేంద్ర ఆర్మీ లో పనిచేస్తున్నారు. అదేగ్రామానికి చెందిన శోభన్‌బాబు, సాంబశివనాయుడు తమ భూములు కబ్జా చేశారని, గ్రామంలో బెదిరింపులు ఎదురవుతున్నాయని చంద్రబాబు అప్లోడ్ చేసిన సెల్ఫీవీడియో మంగళవారం వైరల్ అయ్యింది. దీంతో తహసీల్దారు భవానీ, ఎస్ఐ నాగసౌజన్య ఆర్ఐ చంద్రశేఖర్, అడిషనల్ సర్వేయర్ బాబు, వీఆర్వో రవి గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. గ్రామంలో గ్రామకంఠం 6 ఎకరాల పైచిలుకు ఉందని గుర్తించారు. ఈ భూముల్లో గ్రామస్తులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇందులో చంద్రబాబు కుటుంబానికి అధికారులు రెండు ఇంటి పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఇందులో సాంబశివనాయుడుకు, చంద్రబాబు తల్లి కుప్పమ్మకు దారి సమస్య ఉండడాన్ని అధికారులు గుర్తించడంతో అసలు నిజం బయటపడింది. వెంటనే భూమిని సర్వేచేశారు. 15 అడుగుల వెడల్పుతో దారిని ఏర్పాటు చేసి, సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామస్తులు కలసి మెలసి ఉండాలని అధికారులు హితవు పలికారు. గొడవలు జరిగితే కేసులు నమోదు చేస్తామన్నారు. -
130 సీట్లతో వైఎస్సార్సీపీ విజయం ఖాయం
వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 120 నుంచి 130 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని విజయభేరి మోగించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి స్పష్టం చేశారు. వెదురుకుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగి వేసారిన ప్రజలు తమ అభిమానాన్ని వైఎస్ జగన్‌కు ఓట్ల రూపంలో చూపించారని చెప్పారు. త్వరలో రాజన్నరాజ్యం రాబోతోందని, ఐదేళ్లుగా అవస్థలు పడ్డ ప్రజలకు మంచి పాలన అందించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ఆంధ్ర ఆక్టోపస్‌గా పేరుపొందిన లగడపాటి రాజగోపాల్ టీడీపీ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు సర్వేలతో టీడీపీకి వంత పాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చంద్రగిరిలో రీపోలింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నికల కోడ్ నిబంధనలను ఖాతరు చేయకుండా టీడీపీకి అనుకూలంగా చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం తన సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకు ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లు మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ లగడపాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకుంటారా? చంద్రబాబు తన సొంత ఇలాకాలో దళితులను స్వేచ్ఛగా ఓట్లు వేయకుండా అడ్డుకోవడం విచారకరమన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం పెత్తనంతో ఎస్సీ, ఎస్టీలు ఓటు హక్కుకు దూరమైనట్లు చెప్పారు. నేటికీ ఇలాంటి దుస్థితి నెలకొనడంపై బాబు సిగ్గుతో తలదించుకోవాలని సూచించారు. ఇన్నేళ్లుగా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీలపై పెత్తనాన్ని చెలాయించినట్లు చెప్పారు. -
కన్నతండ్రి కర్కశత్వం
మద్యం రక్కసి మనుషుల్ని రాక్షసుల్ని చేస్తోంది. హంతకులుగా మారుస్తోంది. నేర సంస్కృతిని ప్రేరేపిస్తోంది. చిత్తూరు రూరల్ మండలంలో ఇటీవల మద్యం పూటుగా తాగి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను హతమార్చాడు. ఈ సంఘటన మరువకమునుపే తాగిన మైకంలో మరో కిరాతకుడు ముక్కుపచ్చలారని ముగ్గురు పసికందుల ప్రాణాలు తీశాడు. మత్తులో తానేం చేస్తున్నాడో తెలియక విచక్షణ కోల్పోయాడు. పేగు బంధాన్ని కూడా విస్మరించి పొట్టనబెట్టుకున్నాడు. చిత్తూరు, గంగాధరనెల్లూరు: జీడీనెల్లూరు మండలం బాలగంగానపల్లిలో ఆదివారం రాత్రి అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను ఓ తండ్రి చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది. గ్రామానికి చెందిన వెంకటేష్(30) డ్రైవరుగా పనిచేసేవాడు. చిత్తూరు రూరల్ మండలం శెట్టిగారిపల్లికి చెందిన అముద, అమరావతిని ప్రేమించాడు. వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఏడేళ్ల క్రితం అముదను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదిన్నరకే అము ద భర్తను విడిచిపెట్టి శెట్టిగారిపల్లిలోనే ఉంటోం ది. వీరికి ఓ కుమార్తె ఉంది. ఐదేళ్ల క్రితం అమరావతిని పెళ్లిచేసుకున్నాడు. వీరికి పునీత్(4), సంజయ్(3), రాహుల్(2) ఉన్నారు. ఇతడు మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల కాలంలో ఎక్కువయ్యింది. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడడం దినచర్యగా మార్చుకున్నాడు. శనివారం ఇదే మాదిరిగా భార్యతో గట్టిగా గొడవపడ్డాడు. దీంతో బిడ్డల్ని తీసుకుని ఆమె చిత్తూరు మండలంలోని కన్నవారింటికి వెళ్లిపోయింది. ఆదివారం సాయంత్రం వెంకటేష్ బాగా మద్యం తాగి అత్తవారింటికి వచ్చాడు. తనతో రావాలని గొడవ పడ్డాడు. ఈ మత్తులో నీతో రానని, మర్నాడు ఉదయం వస్తానని భార్య చెప్పింది. పిల్లల్నయినా తీసుకుపోతానంటూ నిద్రపోతున్నవారిని లేపి ద్విచక్రవాహనం ఎక్కించుకున్నాడు. దారిలో ఏమనుకున్నాడో ఏమోగాని ముగ్గురు పిల్లల్ని దారుణంగా పైనుంచి నీవానదిలోకి విసిరేశాడు. వారు మునిగి చనిపోయారు. ఇదేమీ పట్టనట్టుగా వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం భార్య ఫోన్ చేస్తే పిల్లలిద్దరినీ నదినీటిలో విసిరేశానని చెప్పాడు. అమరావతికి గుండె ఆగినంతపనైంది. నదివద్దకు వచ్చి చూసేసరికి పిల్లల శవాలు కనిపించాయి. స్థానికులు ఈ ఘటన చూసి చలించిపోయారు. మద్యం మత్తు దిగడంతో ఎస్ఆర్పురం మండలం కొల్లాగుంట వద్ద హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వెళ్తున్న నిందితుడ్ని బంధువులు గుర్తించి పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ రాజశేఖర్‌కు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అవార్డు తీసుకున్న నెలలోపే..
సాక్షి, గంగాధర నెల్లూరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారిగా కలెక్టరు నుంచి పురస్కారం అందుకున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు తహశీల్దారు సుశీల.. నెల రోజులు తిరక్కమునుపే అవినీతి ముద్ర వేసుకున్నారు. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పాలసముద్రం మండలానికి చెందిన రాజేంద్ర తిరుపతిలో ఉంటున్నారు. ఈయనకు గంగాధర నెల్లూరు మండలం పాతపాళ్యంలో 10.44 సెంట్ల భూమి ఉంది. దీనికి సంబంధించి పాస్‌పుస్తకం ఇచ్చారు. ఈ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఆయన గంగాధర నెల్లూరు తహశీల్దారు కార్యాలయంలో 3 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆన్లైన్లో నమోదుకు తహసీల్దార్ సుశీల రూ. 20 వేల డిమాండ్ చేశారు. రాజేంద్ర ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాజేంద్ర తహసీల్దారుకు రూ. 15 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో సీఐలు చంద్రశేఖర్, గిరిధర్, ప్రసాద్, ఎస్ఐ విష్ణువర్దన్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేను మగాడినే.. కోర్టులో నిరూపిస్తా..
సాక్షి, చిత్తూరు: ‘ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 45 రోజుల పాటు నా కన్నతల్లిని చూడకుండా చేశారు. పైగా నేను మగాడ్ని కాదంటూ, సంసారానికి పనికిరాడని నాపై అభాండాలు వేశారు. నేను మగాడ్నే. మెడికల్ బోర్డు కూడా నా లైంగిక పటుత్వ పరీక్షలు పరీక్షించి ఎలాంటి లోపం లేదని నివేదిక ఇచ్చింది..’ అంటూ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఉపాధ్యాయుడు రాజేష్ పేర్కొన్నాడు. గంగాధరనెల్లూరుకు చెందిన శైలజను వివాహమాడిని ఉపాధ్యాయుడు రాజేష్‌కు మగతనం లేదని గుర్తించి చెప్పడంతో దాడి చేశాడనే ఆరోపణలపై పోలీసులు నిందితుడితో పాటు అతని తండ్రిని సైతం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజేష్, అతని తండ్రికి న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో శుక్రవారం చిత్తూరు నగరంలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రాజేష్ మీడియాతో మాట్లాడుతూ తన నిర్దోషిత్వంపై న్యాయ పోరాటం చేసి నిరూపించుకుంటానన్నాడు. పోలీసుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానన్నాడు. శైలజ తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్దమన్నాడు. తనను శాడిస్ట్‌తో పోల్చొద్దంటూ కోరాడు. గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన రాజేష్.. వి.కోటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతడికి నవంబర్ 1న గంగాధర నెల్లూరు మండలం దామరగుంటకు చెందిన శైలజతో పెళ్లైంది. సంసార జీవితానికి పనికిరాడంటూ ఆరోపణలు చేయడంతో తొలిరాత్రి నాడే భార్యపై దాడిచేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.. ఈ ఉదంతంతో తమ ఊరి అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు భయపడుతున్నారని మోతరంగనపల్లి వాసులు అంటున్నారు. ఇప్పటికే మూడు పెళ్లి సంబంధాలు వెళ్లిపోయాయని తెలిపారు. సంసారానికి పనికిరాడంటూ రాజేష్‌పై నిందలు వేశారని, పటుత్వ పరీక్షలో అతడికి ఎటువంటి లోపం లేదని తేలిందన్నారు. పదేపదే పనికిరానివాడంటూ, శాడిస్టు మొగుడంటూ ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై నిందలు వేసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎవరో చేసిన పనికి తమ ఊరి పరువు తీయొద్దని కోరుతున్నారు. -
తొలిరాత్రే ఆమెకు నరకం చూపించాడు..
సాక్షి, చిత్తూరు : మూడు ముళ్లు వేసి... 24 గంటల గడవక ముందే ఓ శాడిస్ట్ భర్త చేతిలో నవ వధువు తీవ్రంగా గాయపడింది. తొలిరాత్రే... ఆ వధువు చేదు అనుభవాన్ని చవిచూసింది. దెబ్బలకు తాళలేక నవవధువు చేసిన ఆర్తనాదాలకు భయపడిన తండ్రి... తలుపులు తీయాలన్నాడు. దీంతో... తలుపులు తీసి భర్త పరారయ్యాడు. లైట్లు వేసిన తండ్రికి.. కూతురు తీవ్రగాయాలతో పడి వున్న విషయాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. భర్త వికృత చేష్టలతో ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లిలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌కు, చిన్నదామరగుంటకు చెందిన మునికృష్ణారెడ్డి కుమార్తె శైలజతో శుక్రవారం పెళ్లి జరిగింది. రాజేష్... వి.కోట మండలం ఆదినపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా.... శైలజ ఎంబీయే సెకండ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఉదయం జీడీ నెల్లూరు మండలం కొత్తపల్లిమిట్ట కళ్యాణమండపంలో వైభవంగా శైలజ పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత... కాణిపాకం వెళ్లి నవదంపతులు దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం పెద్దదామరగుంటలోని వధువు ఇంట శుక్రవారం మొదటిరాత్రి ఏర్పాటు చేశారు. అయితే రాజేష్ సంసార జీవితానికి పనికిరాడని తెలుసుకున్న శైలజ కాస్సేపటి తర్వాత బయటకు వచ్చేసింది. తల్లితండ్రులకు విషయాన్ని వివరించింది. అయినా తల్లితండ్రులు నచ్చజెప్పారు. తిరిగి గదిలోకి ఆమెను పంపారు. జీవితానికి పనికిరాననే విషయాన్ని తల్లితండ్రులకు చెప్పిందనే కోపంతో రాజేష్ రాక్షసంగా ప్రవర్తించాడు. నవ వధువును విచక్షణా రహితంగా కొట్టాడు. అంతేగాకుండా పంటితో విపరీతంగా కొరికి గాయపరిచాడు. నోట్లో గుడ్డలు కుక్కి కళ్లు, ముఖం వాచేలా చిత్రహింసలకు గురిచేశాడు. భర్త దెబ్బలు తట్టుకోలేక.. శైలజ కేకలు వేయటంతో ఆమె తండ్రి కంగారుపడిపోయాడు. గది తలుపులు తీయాలంటూ చెప్పాడు. దీంతో గది తలుపులు తీసిన భర్త రాజేష్.... శైలజ తండ్రిని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. మొదటిరాత్రి రోజే.. అల్లుడి శాడిజాన్ని చూసిన శైలజ తల్లిదండ్రులు గంగాధరనెల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా పెళ్లి నిమిత్తం రూ. 20లక్షల వరకూ కట్నకానుకలు ముట్టజెప్పినట్టు తెలిసింది. తనపై జరిగిన దారుణ ఘటనను తలచుకుని శైలజ భయంతో వణికిపోతోంది. కావాలనే రాజేష్ తనపై దాడి ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు ఆమె కన్నీటిపర్యంతమైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తొలిరాత్రే భార్యకు నరకం చూపించాడు..
-
చిత్తూరులో ఓ వృద్ధురాలికి స్వైన్‌ఫ్లూ
చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ఓ వృద్ధురాలికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. అనారోగ్యంతో వృద్ధురాలు శనివారం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమె రక్త నమూనాలను హైదరాబాద్‌కు పంపగా... స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు సోమవారం తేలింది. దీంతో ఆమెకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం : స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరు: జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లెలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్మగ్లర్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్మగ్లర్లు అంతా తమిళనాడు, కుప్పం చెందిన వారని పోలీసులు తెలిపారు.