
గణతంత్ర దినోత్సవం రోజున కలెక్టరు నుంచి పురస్కారం అందుకుంటున్న సుశీల
సాక్షి, గంగాధర నెల్లూరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారిగా కలెక్టరు నుంచి పురస్కారం అందుకున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు తహశీల్దారు సుశీల.. నెల రోజులు తిరక్కమునుపే అవినీతి ముద్ర వేసుకున్నారు. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.
ఏసీబీ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పాలసముద్రం మండలానికి చెందిన రాజేంద్ర తిరుపతిలో ఉంటున్నారు. ఈయనకు గంగాధర నెల్లూరు మండలం పాతపాళ్యంలో 10.44 సెంట్ల భూమి ఉంది. దీనికి సంబంధించి పాస్‌పుస్తకం ఇచ్చారు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఆయన గంగాధర నెల్లూరు తహశీల్దారు కార్యాలయంలో 3 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఆన్‌లైన్‌లో నమోదుకు తహసీల్దార్ సుశీల రూ. 20 వేల డిమాండ్ చేశారు. రాజేంద్ర ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాజేంద్ర తహసీల్దారుకు రూ. 15 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో సీఐలు చంద్రశేఖర్, గిరిధర్, ప్రసాద్, ఎస్‌ఐ విష్ణువర్దన్, సిబ్బంది పాల్గొన్నారు.