ఇరువర్గాల వారిని విచారిస్తున్న అధికారులు
సాక్షి, గంగాధరనెల్లూరు(చిత్తూరు) : మండలంలోని ఎల్లాపల్లెకు చెందిన సైనికుడు చంద్రబాబు తన తల్లికి ప్రాణభయం ఉంద ని సెల్ఫీ వీడియో తీసి పెట్టడంతో అధికారులు స్పందించారు. గ్రామానికి వెళ్లి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు.వివరాలు.. ఎల్లాపల్లెకు చెందిన కుప్పమ్మ కుమారులు చంద్రబాబు,మహేంద్ర ఆర్మీ లో పనిచేస్తున్నారు. అదేగ్రామానికి చెందిన శోభన్‌బాబు, సాంబశివనాయుడు తమ భూములు కబ్జా చేశారని, గ్రామంలో బెదిరింపులు ఎదురవుతున్నాయని చంద్రబాబు అప్‌లోడ్ చేసిన సెల్ఫీవీడియో మంగళవారం వైరల్ అయ్యింది. దీంతో తహసీల్దారు భవానీ, ఎస్‌ఐ నాగసౌజన్య ఆర్‌ఐ చంద్రశేఖర్, అడిషనల్ సర్వేయర్ బాబు, వీఆర్వో రవి గ్రామానికి వెళ్లి విచారణ చేశారు.
గ్రామంలో గ్రామకంఠం 6 ఎకరాల పైచిలుకు ఉందని గుర్తించారు. ఈ భూముల్లో గ్రామస్తులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇందులో చంద్రబాబు కుటుంబానికి అధికారులు రెండు ఇంటి పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఇందులో సాంబశివనాయుడుకు, చంద్రబాబు తల్లి కుప్పమ్మకు దారి సమస్య ఉండడాన్ని అధికారులు గుర్తించడంతో అసలు నిజం బయటపడింది. వెంటనే భూమిని సర్వేచేశారు. 15 అడుగుల వెడల్పుతో దారిని ఏర్పాటు చేసి, సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామస్తులు కలసి మెలసి ఉండాలని అధికారులు హితవు పలికారు. గొడవలు జరిగితే కేసులు నమోదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment