ఓ లేడీ కేడీ పనులు బయటపడ్డాయి.. మాయ మాటలతో పేదలను బురిడీ కొట్టించిన వైనం వెలుగుచూసింది.. ఇళ్లు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసింది.. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డర్ కాపీలంటూ మోసగించింది.. ఏడెనిమిది నెలలు అవుతున్నా ఇళ్లు రాకపోవడంతో బాధితులు కార్పొరేషన్ అధికారుల వద్దకు రాగా అసలు విషయం బయట పడింది... ఊహించని ఈ ఘటనతో కార్పొరేషన్ యంత్రాంగం ఉలిక్కి పడింది. విషయం తెలుసుకున్న కమిషనర్ విజయ్‌రామరాజు విచారణకు ఆదేశించారు. పోలీసులు రంగప్రవేశం చేసి హౌసింగ్ స్క్యామ్ కూపీ లాగుతున్నారు. విచారణలో కొందరి కార్పొరేషన్ సిబ్బంది పేర్లు బయటకు రావడంతో ఆ దిశగా కూడా విచారిస్తున్నారు.
తిరుపతి తుడా: తిరుపతి కర్నాలవీధి సమీపంలోని కస్తూరిబా వీధికి చెందిన ఓ మహిళ ఆది నుంచి పేదలను మోసం చేయడమే పనిగా పెట్టుకుంది. ప్రజావసరాలను తనకు అనుకూలంగా ఉపయోగిస్తూ మామూళ్లకు అలవాటు పడింది. ఆరు నెలల కిందటి వరకు ఆమె తిరుపతి తహశీల్దార్ కార్యాలయంలో బీఎల్‌వోగా పనిచేసేది. కార్యాలయానికి వచ్చే వారిని మాటల్లో పెట్టి సర్టిఫికెట్ ఇప్పిస్తానని, రేషన్ కార్డు, పెన్షన్, ఇళ్ల పట్టాలు.. ఇలా అవసరమయ్యేవాటిని తీసిస్తానని చెప్పి అందినకాడికి వసూలు చేసేదని తె లిసింది. వరుసగా ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికా రులు ఆమెను బీఎల్‌వో పోస్టు నుంచి తప్పించారు. అయినా ఆమె ఆగలేదు. మరింతగా ప్రజల్ని మోసగించే పనిలో పడ్డారు. ఇటీవల తిరుపతి కార్పొరేషన్ పరిధిలో పేదల ఇళ్లనిర్మాణ పనులు జోరుగా చేపట్టారు. ఈ హౌసింగ్ స్కీమ్‌ను స్కాంగా మలుచుకుంది. ఇళ్లు ఇప్పిస్తానని మోసం చేస్తూ కొందరి నుంచి లక్షలు వసూలు చేసింది. ఏడెనిమిది నెలలు అవుతున్నా ఇళ్లు రాకపోవడంతో బాధితులు కార్యాలయానికివచ్చారు. విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు.
మాయ మాటలతో మస్కా..కమిషనర్ సంతకం ఫోర్జరీ
మున్సిపల్ కార్పొరేషన్ పూర్వపు కమిషనర్, ప్రస్తుత వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ సంతకాన్ని ఆ మహిళ ఫోర్జరీ చేసింది. కమిషనర్ పేరుతో స్టాంపును తయారు చేసుకుంది. తిరుపతిలో గతంలో రెవెన్యూ వార్డులు 6–17 పరిధిలో బీఎల్‌ఓగా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసొచ్చింది. పాత పరిచయాలతో ఇళ్లు లేని పేదలను టార్గెట్ చేసుకుని ఇళ్లు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పింది. ఆమెతో పాటు మరికొందరు గ్రూపుగా ఏర్పడి హౌసింగ్ మాఫియాకు తెరలేపారు. గత కమిషనర్ హరికిరణ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, స్టాంపును సిద్ధం చేసుకుంది. దామి నేడు రూ.లక్ష, పాడిపేట రూ.2 లక్షలు చొప్పున బేరం కుదుర్చుకుంది. ముందు ఇళ్ల కేటాయింపు పత్రాలను ఇప్పించిన తర్వాతే డబ్బులు ఇవ్వండని ఆమెతోపాటు మిగిలినవారు నమ్మించారు. ఆమెపై నమ్మకంతో డబ్బులు కట్టేందుకు ముందుకొచ్చా రు. కమిషనర్ పేరుతో సొంతంగా డాక్యుమెంటును సిద్ధం చేసుకుని ఇళ్లు కేటాయిం చినట్టు ఆర్డర్ తయారు చేసుకున్నారు. ఆర్డర్‌ను చేతిలో పెట్టి రూ.1–2 లక్షల వరకు, మరీ నమ్మిన వాళ్ల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసింది. వసూలు చేసిన డబ్బును మరో వ్యక్తి హనుమంతు అకౌంట్‌లో జమచేసినట్లు గుర్తించారు. నాలుగు రోజుల నుంచి విషయం బయటకు పొ క్కుండా లోలోనవిచారణ చేపడుతున్నారు.
కమిషనర్ ఆగ్రహం..
హౌసింగ్ మాఫియాపై కమిషనర్ విజయ్‌రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశా రు. బాధితుల ఫిర్యాదులపై ఆరా తీస్తున్నా రు. తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతికి సమాచారం ఇచ్చారు. ఈస్ట్ పోలీసులను కలిసి బాధితులు గోడును వెల్లబోసుకున్నారు. 18 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. ఈస్ట్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, క్రైం బ్రాంచ్ పోలీసులు హౌసింగ్ మాఫి యాపై కూపీ లాగుతున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరోపణలెదుర్కొంటున్న మహిళను విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కొంతమంది పేర్లను ఆమె చెప్పడంతో పోలీసులు విచారించారు. ఇప్పటివరకూ రూ.25 లక్షలను వసూలు చేసినట్టు బయటపడింది. మరికొందరు బాధితులున్నట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment