
వెంగళత్తూరు దళితవాడలో శరవణ(సర్కిల్లో ఉన్న వ్యక్తి)ను విచారిస్తున్న పోలీసులు, (ఇన్‌సెట్) మంచంపై సత్య మృతదేహం
చిత్తూరు, పిచ్చాటూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన బుధవారం మధ్యాహ్నం మండలంలోని వెంగళత్తూరు దళితవాడలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. నగరి మండలం నెత్తం గ్రామానికి చెందిన శరవణ(30) చిత్తూరుకు చెందిన సత్య (20)ను మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగకని మూడు రోజుల క్రితం శరవణ తన అక్క సుమతి గ్రామమైన వెంగళత్తూరు దళితవాడకు తన భార్యతో కలిసి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం సుమారు 3 సమయంలో సుమతి ఇంట్లో హఠాత్తుగా కేకలు వినిపించాయి. చుట్టు పక్కలవారు వెళ్లి చూడగా సత్య కత్తిపోట్లకు గురై, రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందారు.
క్షణాల వ్యవధిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. హతురాలి భర్త, అతని అక్క, బావ కలిసి రక్తపు మరకలను శుభ్రంగా కడిగేశారు. ఇంట్లోని నులక మంచంపై సత్య మృతదేహాన్ని పడుకోబెట్టిన స్థితిలో ఉంచి సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో పుత్తూరు డీఎస్పీ సౌమ్యలత, నగరి సీఐ మల్లిఖార్జున్, ఎస్‌ఐ రామాంజనేయులుతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హతురాలి భర్త, అతని బంధువులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ చేశారు. అయితే శరవణ పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. హత్యకు దారితీసిన కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సత్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment