బాబు మృతదేహం , జయచంద్ర మృతదేశం
చిత్తూరు, యాదమరి : మండల పరిధిలోని కొటాల అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను గొర్రెలు కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులు వేపనపల్లె ఆది ఆంధ్రవాడకు చెందిన బాబు, అతని బావ జయచంద్రగా గుర్తించారు. వీరిని ఎక్కడో చంపి, మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సై మనోహర్ కథనం మేరకు.. మండలంలోని తమిళనాడు సరిహద్దులో ఉన్న కొటాల అటవీ ప్రాంతంలోని వేపనపల్లె ఆదిఆంధ్రవాడకు చెందిన బాబు(30) తాపీమేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు, తిరుపతిలో నివాసముంటున్న అతని బావ జయచంద్ర(33) అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం బాబు మేస్త్రీపని చేశారు. రాత్రి అతని బావ జయచంద్ర తిరుపతి నుంచి వచ్చాడు. ఇద్దరూ కలసి భోజనం చేసి బాబు ఇంటిలోనే పడుకున్నారు. అయితే ఉదయం వీరిరువురు కన్పించలేదు. సాయంత్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో శవాలై కన్నించారు.
తమిళనాడులో హత్య..?
బావ, బావమరిదిలను తమిళనాడులో హత్య చేసి ఆంధ్రలోని కొటాల అటవీ ప్రాంతంలో పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు పడివున్న ప్రాంతంలో ఎలాంటి రక్తపు మరకలు లేకపోగా, ఇద్దరి ముఖం, గొంతు వద్ద గాయాలున్నాయి. ఒకరికి మర్మాంగంపై కాల్చి ఉన్నారు. దీన్నిబట్టి అక్రమ సంబ«ంధం కారణమై ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతుని ఇంటివద్దకు వెళ్లిన పోలీసు జాగిలాలు..
కొటాల అటవీ ప్రాంతంలో డాగ్‌స్క్వాడ్ తనిఖీ చేపట్టారు. ఇక్కడ్నుంచి పోలీసు జాగిలం నేరుగా వేపనపల్లె ఆది ఆంధ్రవాడలో మృతుడు బాబు ఇంటి వద్దకు వెళ్లాయి. దీంతో గ్రామంలోనే ఎవరోఎ వారిని హత్య చేసి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ..
కొటాల అడవీ ప్రాంతంలో హత్య విషయం తెలియగానే ఎస్పీ రాజశేఖర్ బాబు, డీఎస్పీ సుబ్బారావు, చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీనివాసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉందని, త్వరలో దుండగలను పట్టుకుంటామని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment