నమ్మకాలు వుండొచ్చు, విశ్వాసాలతో మమేకం కావొచ్చు. కానీ ఆ నమ్మకాలు మూఢ నమ్మకాలుగా, ఆ విశ్వాసాలు అంధ విశ్వాసాలుగా మారితే... ఆ క్రమంలో విచక్షణ, వివేచన కోల్పోతే వ్యక్తికే కాదు, సమాజానికి కూడా ముప్పు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో తామే కని పెంచిన ఇద్దరు ఆడపిల్లల ఉసురుతీసిన తల్లిదండ్రుల ఉదంతం చాటుతున్నది ఇదే. ఆ తల్లిదండ్రులు సాధారణ వ్యక్తులు కాదు. ఉన్నత విద్యావంతులు. తండ్రి పురుషోత్తం నాయుడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్. ఆయన ఎమ్మెస్సీలో డాక్టరేట్ పొందారు. తల్లి పద్మజ మాస్టర్ మైండ్ స్కూల్ కరస్పాండెంటు, ప్రిన్సిపాల్.
ఆమె ఎమ్మెస్సీ గణితంలో స్వర్ణ పతక విజేత. ఈ ఉదంతం వెలుగులోకొచ్చేవరకూ స్థానికంగా, ఆ చుట్టుపట్ల ఉన్నత విద్యావంతులుగా, ఎందరో పిల్లల్ని తీర్చిదిద్దుతున్న స్ఫూర్తిమంతులుగా వారు సుపరిచితులు. వారి శిష్యులు అనేకులు ఇక్కడా, విదేశాల్లోనూ భిన్న రంగాల్లో స్థిరపడ్డారని స్థానికులు చెబుతున్నారు. కాస్త తీరిక దొరికితే వారిద్దరూ పిల్లల మధ్య గడపటానికి, చదువులో వారికి సలహాలివ్వటానికి ఆసక్తి చూపేవారని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. తమలాగే వారు కూడా భక్తివిశ్వాసాలతో వుంటారని తెలుసు తప్ప, క్షుద్రపూజ ల్లోకి పూర్తిగా జారుకున్నారని... వారిద్దరి కుమార్తెలు సైతం అందులో దిగబడిపోయి పరాకాష్టకు పోయారని కాస్తయినా అనుమానం రాలేదన్నది వారి సహచరుల మాట.
అందరికీ తెలిసిన పురుషోత్తం, పద్మజ ఆవిధంగానే ఎందుకుండలేకపోయారు? పిల్లలకు చిన్న సమస్య ఏర్పడితేనే తల్లడిల్లి, వారి కోసం ఆరాటపడే స్థానంలోవున్నవారు వారిని అంత దారుణంగా, క్రూరంగా ఎలా చంపేయగలిగారు? చంపాక కూడా వారిలో లేశమాత్ర పశ్చాత్తాపమైనా ఎందుకు కలగటం లేదు? పైపెచ్చు మళ్లీ బతికొస్తారంటూ ఎలా నమ్ముతున్నారు? వారి గురించి బాగా తెలిసిన వారినే కాదు... మీడియాలో వస్తున్న కథనాలద్వారా వారి గతం తెలుసుకున్నవారిని కూడా ఈ ప్రశ్నలు వేధిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి పంజా విసిరాక అమల్లోకొచ్చిన నియంత్రణలు, ముఖ్యంగా లాక్‌డౌన్ మనుషుల్ని ఏకాంత ద్వీపాలుగా మార్చాయి. ఇదంతా మానసిక రుగ్మతలకు దారితీయొచ్చని మానసిక వ్యాధుల నిపుణులు గత కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు. అలాంటివారు తమకు తాముగానీ, తమ దగ్గరున్నవారికిగానీ హాని తలపెట్టవచ్చునని కూడా చెప్పారు. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
అంతక్రితం పురుషోత్తం, పద్మజల్లో బీజప్రాయంగా వుండిన మానసిక రుగ్మత లాక్‌డౌన్‌కాలంలో ఏర్పడ్డ ఒంటరితనంలో మరింత పెరిగి, ఆ కుటుంబాన్ని ఇలా దిగజార్చిందా అన్నది మానసిక వ్యాధుల నిపుణులు తేల్చాలి. ఎందుకంటే లాక్‌డౌన్ సడలించాక విద్యాసంస్థకు ఆమె దాదాపు రావటం మానేశారని, ఇంతకు ముందు ఇలా వుండేవారు కాదని సన్నిహితులు చెబుతున్నారు. అసలు ఇతర రోగాల మాదిరి మానసిక అనారోగ్యాన్ని ఒక వ్యాధిగా చూసే ధోరణి మన దగ్గర తక్కువ. అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ మూడేళ్లక్రితం దీనిపై మన దేశాన్ని హెచ్చరించింది. వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ చుట్టుముడుతున్న ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వుండటం తగదని చెప్పింది. మానసిక రుగ్ముతను ప్రారంభ దశలో గుర్తించటం, సకాలంలో దానికి చికిత్స తీసుకోవటం మన దగ్గర చాలా తక్కువ. వ్యక్తులు తమ స్వాభావిక ధోరణికి భిన్నంగా... అసాధారణంగా లేదా విచిత్రంగా వుంటున్న వైనాన్ని పోల్చుకోవటం చుట్టూ వున్నవారికి కూడా అంత సులభం కాదు.
అలా పోల్చుకోగలిగినా ఆ క్షణంలో వారికెదురైన సమస్యపై వారినుంచి వచ్చిన తక్షణ స్పందనగానే దాన్ని పరిగణిస్తారు. ఎందుకో సహనం కోల్పోయాడని సరిపెట్టుకుంటారు. ఆత్మహత్యకు పాల్పడినవారి గురించి గుర్తుచేసుకునేటపుడు చాలామంది తరచు ఇలాగే చెబుతారు. తమకు కాస్తయినా అనుమానం కలగలేదని వాపోతారు. గత నెలలో ఎర్న్‌అప్ అనే సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన మాథ్యూ కూపర్ బాధ్యతల నుంచి వైదొలగుతూ తన ఉద్యోగులనుద్దేశించి ఒక లేఖ రాశారు. సంస్థ సీఈఓగా చాన్నాళ్లనుంచి ఆ కంపెనీ నిర్ణయాల్లో తలమునకలై కాలంతో పరుగెడుతున్న తనలో కొంతకాలంగా మానసిక రుగ్మత ఏర్పడిందని, దాన్ని దాచిపెట్టుకుని నిర్వాహకుడిగా కొనసాగటం మంచిదనుకోవటంలేదని అందులో రాశారు. ఈ సమస్యను అందరికీ వెల్లడించటమే సరైందని, అది అవసరమని భావించి లేఖ రాస్తున్నానని తెలిపారు. ఇప్పుడు తన భార్యతో పోలిస్తే అప్పుడప్పుడైనా కాస్త మెరుగ్గా మాట్లాడగలుగుతున్న పురుషోత్తం ఎవరి దృష్టికైనా సకాలంలో కుటుంబంలో ఏర్పడిన సమస్యను చెప్పగలిగివుంటే ఆ పిల్లల ప్రాణాలు దక్కేవి. వారు జైలుపాలయ్యే దుస్థితి తప్పేది. దగ్గరి బంధువులు కూడా వారు అతిగా ప్రవర్తిస్తున్నారనుకున్నారు తప్ప ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో పడతారని ఊహించలేక పోయారు.
తెలియనిది తెలుసుకోవటం, దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందటం, అది ఆవిష్కరణకు దారితీయటం అనేవి మాన వ జాతి ప్రస్థానానికి మూల ధాతువులని చెబుతారు. ఆకాశం ఉరమటం, మెరుపు మెరవటం, వర్షాలు ముంచెత్తటం, వెలుగుచీకట్లు... ఇవన్నీ మనిషిలో భయాందోళనలు కలిగించి తెలియని ఏవో శక్తులపట్ల విశ్వాసాన్ని ఏర్పరిచాయని విజ్ఞాన శాస్త్రవేత్తలు అంటారు. తెలియనిది తెలుసుకుంటే అన్ని రకాల భయాలూ పటాపంచలవుతాయని వివరిస్తారు. కానీ తెలియనిది తెలుసుకోవటం అనే ప్రక్రియకు రకరకాల రూపాల్లో అవరోధాలు ఎదురవుతాయి. మతాలు మానవతకూ, మానసిక ప్రశాంతతకూ దోహదం చేస్తే ఫర్వాలేదు. కానీ మౌఢ్యంలో కూరుకుపోయేలా చేస్తే మాత్రం చేటు కలుగుతుంది. ఇటీవలకాలంలో వాటిపై రాజకీయ రంగు కూడా పడుతోంది. ఇలాంటి పరిస్థితులున్నచోట విద్యావంతులు సైతం మానసిక రుగ్మతలబారిన పడటంలో వింతేముంది?
Comments
Please login to add a commentAdd a comment