వాణ్ని లేపేస్తా.. వీణ్ని లేపేస్తా అని చివరికి దారుణ హత్య | Man Assassinates His Unnecessary Talking Behaviour Chittoor District | Sakshi
Sakshi News home page

వాణ్ని లేపేస్తా.. వీణ్ని లేపేస్తా అని చివరికి దారుణ హత్య

Published Tue, Feb 8 2022 9:40 AM | Last Updated on Tue, Feb 8 2022 9:47 AM

Man Assassinates His Unnecessary Talking Behaviour Chittoor District - Sakshi

ఘటనను పరిశీలిస్తున్న పోలీసులు

తిరుపతి క్రైం: నోరు హద్దుల్లో ఉంటేనే ముద్దు– అని ఓ సామెత. హద్దు దాటితే పరువూ మర్యాద పోవడం మాటేమోగానీ ఓ యువకుడి నోటిదూల చివరకు అతడి దారుణ హత్యకు కారణమైంది. అందరిలో గొప్పగా అనిపించుకోవాలని మద్యం మత్తులో ఎవరైనా అవాకులూ చెవాకులూ పేలుతున్నారా?  అయితే మీరూ ఓ లుక్కేసి, నోరు కట్టేసుకోండి. వివరాలు.. ఈ ఏడాది జనవరి 3న రేణిగుంట రోడ్డులోని ఒక లాడ్జి సమీపంలో బొజ్జ అలియాస్‌ ప్రసన్నకుమార్‌ దారుణ హత్యకు గురవడం విదితమే. ఆ హత్య తానే చేయించానంటూ బ్లిస్‌ సమీపంలో నివాసం ఉంటున్న  సుబ్రహ్మణ్యం, రత్నమ్మ కుమారుడు లక్ష్మీపతి(30) మద్యం మత్తులో వాగేవాడు.

అంతేకాకుండా వాణ్ని లేపేస్తా..వీణ్ని లేపేస్తా– అంటూ మాటలు తూలేవాడు. వాస్తవానికి ఇతడు కాస్త వికలాంగుడు. అయితే లక్ష్మీపతి తరచూ ప్రసన్న హత్యోదంతం గురించి వాగుతూండడంతో హతుడికి ఆప్తమిత్రుడైన వంశీ నమ్మాడు. ఉప్పొంగి దళితవాడకు చెందిన అతడు లక్ష్మీపతిని హతమార్చాలని స్కెచ్‌ వేశాడు. ఇంటి వద్ద ఉన్న లక్ష్మీపతిని నమ్మించి సోమవారం చింతలచేను వద్దకు తీసుకెళ్లాడు.

ఎక్కడైతే తన మిత్రుడు హత్యకు గురయ్యాడో అదే ప్రాంతంలో లక్ష్మీపతిని వంశీ కత్తితో పొడిచి హత్యచేసి పారిపోయాడు. ఇది తెలుసుకుని లక్ష్మీపతి తల్లి, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న ఈస్ట్‌ సబ్‌ డివిజనల్‌ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శివప్రసాద్‌రెడ్డి తమ సిబ్బందితో వెళ్లి  పరిశీలించారు. హత్య గల కారణాలను తెలుసుకున్నారు.

వాస్తవానికి ప్రసన్నకుమార్‌ హత్యతో ఇతడికి ఏమాత్రమూ సంబంధం లేదని తెలియవచ్చింది. అయితే పాత కక్షలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. వారం వ్యవధిలో నగరంలో నాలుగు హత్యలు చోటుచేసుకోవడం..తాజాగా పెద్దకాపు లేఔట్‌లో వృద్ధుడి హత్యోదంతాన్ని మరవకముందే మరో హత్య చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement