మాలిక్ బంగారు నగలు ఇస్తానని వేసిన రూ.550ల చీటీ కార్డు మాలిక్, చీటీల నిర్వాహకుడు
చిత్తూరు, పిచ్చాటూరు: రూ.70 లక్షల చీటీ డబ్బులతో ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుల కథనం..స్థానిక బజారు వీధికి చెందిన మాలిక్ అనే యువకుడు ట్యూషన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ట్యూషన్‌కు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిగిన పరిచయాలతో ఐదేళ్ల క్రితం ‘ఎస్‌ఎస్. మార్కెటింగ్ దీపావళి సేవింగ్ ఫండ్’ పేరిట చీటీల వ్యాపారం మొదలు పెట్టాడు. ప్రతి నెల రూ.200, రూ.300, రూ.550 కట్టేలా మూడు చీటీలు నిర్వహించేవాడు. ఏదో ఒక చీటీని ఎన్నుకుని నెల నెలా డబ్బులు ఇచ్చేవాడు. ఇలా పోగు చేసిన డబ్బులతో మాలిక్ దీపావళి నాటికి అవసరమైన వంటనూనె, చక్కెర, పప్పు, పిండి, టపాసులు పంపిణీ చేసేవాడు.
ప్రతి నెలా రూ.550 కట్టే వారికి 2 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి కూడా ఇచ్చేవాడు. తీసుకున్న డబ్బులకు సక్రమంగా వస్తువులు పంపిణీ చేస్తుండడం, దీనికి తోడు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సొంత ఇల్లు కూడా ఉండటం, స్థానికుడు కావడంతో ప్రజలు మాలిక్‌ను నమ్మి చీటీలు వేశారు. పదుల సంఖ్య నుంచి చీటీ సభ్యుల సంఖ్య ఇటు ఆంధ్ర, తమిళనాడులో వెయ్యికి పైగా చేరింది. నమ్మకం కొద్దీ స్థానికులు తమతో పాటు తమిళనాడులోని తమ బంధువులతో కూడా చీటీలు కట్టించారు. సభ్యులు ఎక్కువ కావడంతో మాలిక్ కింద కొంత మందిని సబ్ ఏజెంట్లను నియమించుకున్నాడు. 10 చీటీలు కట్టించిన వారికి ఒక చీటీ ఉచితం అనే ఆఫర్ పెట్టాడు. ఈ ఆఫర్‌తో సబ్ ఏజెంట్లు ఎక్కువయ్యారు.
గత నెల 29 నుంచి అజ్ఞాతంలోకి..
మాలిక్ గుట్టుచప్పుడు కాకుండా గత నెల 29 నుంచి అదృశ్యమయ్యాడు. దీపావళి పండుగ ఉండటం వస్తువులు కొనుగోలు నిమిత్తం వెళ్ళి ఉంటాడని చీటీల సభ్యులు భావించారు. కానీ దీపావళి దాటినా అతని ఆచూకీ లేకపోవడం, మొబైల్ స్విచ్ఛాఫ్ అని వస్తుండడంతో అనుమానం రేకెత్తించింది. ఆరా తీస్తే చీటీ డబ్బులతో ఉడాయించిన సంగతి వెలుగులోకి రావడంతో లబోదిబోమంటున్నారు.
సబ్ ఏజెంట్లపై ఒత్తిడి
మాలిక్ చీటీ డబ్బులతో పరారవడంతో సబ్ ఏజెంట్లపై ఒత్తిడి పెరిగింది. చివరకు సబ్ ఏజెంట్లు, బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మాలిక్‌పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కుటుంబాన్నీ మోసం చేశాడు
మాలిక్‌కు ఏడాది క్రితం ఓ యువతితో వివాహమైంది. మాలిక్ తండ్రికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ముగ్గురికీ పెళ్లిళ్లయ్యాయి. అతని తండ్రి గత ఏడాది కుటుంబంలో భాగ పరిష్కారం చేసి ఆస్తులను పంపిణీ చేసినట్లు సమాచారం. తనకు తండ్రి పంచిన ఆస్తులన్నింటినీ ఇప్పటికే అమ్మేసినట్లు తెలిసింది. చివరికి కట్టుకున్న భార్యను, తల్లిదండ్రులను, సోదరుని కుటుంబాన్ని సైతం ఇక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. బాధితులు డబ్బులకోసం మాలిక్ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తుండడంతో వారికి దిక్కు తోచడం లేదు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న మాలిక్ తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించి ఆసుపత్రిపాలయ్యాడు.
దీపావళిని చీకటి చేశాడు
మాలిక్ ఫండ్ చీటీల పేరిట వెయ్యికి పైగా కుటుంబాల్లో చీకట్లు నింపాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతని మోసంపై పోలీసులకు తెలియజేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని వాపోతున్నారు. అంతేకాకుండా చాలా మంది మహిళలకు మాయమాటలు మాలిక్ నగలు, డబ్బు తీసుకెళ్లినట్లు సమాచారం. స్థానికంగా పూల వ్యాపారం చేసే ఓ వ్యక్తికి రూ.7 లక్షల వరకు చీటీ డబ్బులు మాలిక్ ఇవ్వాల్సి ఉందని తెలిసింది. ఇలా మాలిక్ సుమారు కోటి రూపాయల వరకు కాజేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
పేకాట ఆడుతూ పట్టుబడ్డ మాలిక్
అదృశ్యం కావడానికి రెండు రోజుల క్రితం స్థానిక సినిమా థియేటర్‌లో పేకాట స్థావరంపై స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మాలిక్‌తో పాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే రోజు రాత్రి వరకు మాలిక్‌తో పాటు పేకాటలో పాల్గొన్న మరో ఆరుగురిని స్టేషన్‌లో విచారణ చేసి పంపించినట్లు తెలిసింది. ఇలా పేకాట, మందు, ఇతర వ్యసనాలు మాలిక్‌కు ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment