కన్నీరుమున్నీరవుతున్న ఎస్‌ఐ వెంకటరమణ భార్య ఎస్‌ఐ వెంకటరమణ మృతదేహం
‘ఏర్పేడు ఎస్‌ఐ వెంకటరమణ... వివాద రహితునిగా పేరు... పనిచేసిన చోటల్లా మంచి పేరును సంపాదించుకున్నారు. వివాదాలకు, రాజకీయ ఒత్తిళ్లకు కేంద్రబిందువైన ఏర్పేడు మండలంలో ఆయన చతురత తలకిందులైంది. ఇక్కడ ఆత్మవంచన చేసుకుని రాజకీయ నేతలు చెప్పిందానికల్లా తలాడించలేదు. ఫలితంగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.’
సాక్షి, చిత్తూరు,తిరుపతి/రేణిగుంట: ఇసుక లారీ ఘటన తర్వాత 2017, ఏప్రిల్ 22న ఏర్పేడు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. 40గ్రామ పంచాయతీలతో పెద్ద మండలమైన ఏర్పేడులో ఒక పోలీస్‌స్టేషన్ మాత్రమే ఉంది. ఇక్కడ కేసులు రికార్డు్డస్థాయిలో నమోదవుతున్నాయి. స్టేషన్‌లో సిబ్బంది కొరత... కేసు డాక్యుమెంట్లు, సీడీ ఫైళ్లు తయారుచేసే నైపుణ్యమున్న వారు అసలే లేరు. దీంతో ఆయన సకాలంలో కేసుకు సంబంధించిన ఫైళ్లను ఉన్నతాధికారులకు సమగ్రంగా అందించడంలో ఎన్నో వ్యయప్రయాసలకు, ఒత్తిళ్లకు గురయ్యేవారు. ఈ క్రమంలో రాత్రి 12 గంటల వరకూ స్టేషన్‌లోనే కూర్చొని కేసు తాలూకు ఫైళ్లను స్వయంగా టైపు చేసుకున్న సందర్భాలు అనేకమనే చెప్పాలి. విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న వెంకటరమణ సీఐగా పదోన్నతి జాబితాలో ఉన్నారు. అయితే స్థానిక టీడీపీ నేతలకుపంటికింద రాయిగా మారిన ఎస్‌ఐను బదిలీ చేయిం చాలని కొందరు నేతలు కొంతకాలం నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంజిమేడు చెరువులో మట్టిని టీడీపీ నేత ఒకరు ఇటుక చూల కోసం రూ.10లక్షలకు విక్రయించినట్లు తెలుస్తోంది.
చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తుండగా గతంలో ఉన్న తహసీల్దార్ ట్రాక్టర్‌ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఆ ట్రాక్టర్లను విడిచిపెట్టాలని టీడీపీ నేతలు ఎస్‌ఐ వెంకటరమణపై ఒత్తిళ్లు తెచ్చినా విడిచిపెట్టలేదు. ఎస్‌ఐ తమ మాట వినకపోవడంతో టీడీపీ నేతలు ఆయనను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు ఆయనతో పాటు తహసీల్దార్ సుబ్బన్నలను బదిలీ చేయాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మంత్రి కూడా ఈ విషయాన్ని పరిష్కరించాలని పక్కనే ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానికి సూచించి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలు స్తోంది. తనపై ఫిర్యాదు చేశారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన గురువారం రాత్రి మండలంలోని తన ఆప్తులతో పంచుకుని తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనకు త్వరలోనే సీఐగా ప్రమోషన్ రానున్న నేపథ్యంలో ఇలాంటి ఫిర్యాదులు ఆయనను మానసికంగా కుంగదీశాయి.
అనారోగ్యంతో ఉన్న ఆయన శుక్రవారం సెలవు అడిగినప్పటికీ ఉన్నతాధికారలు నిరాకరించడంతో ఆయన విధిలేని పరిస్థితుల్లో శుక్రవారం తెల్లవారుజామున ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ముభావంగా ఉన్న ఆయనను సహచరులు, కిందిస్థాయి సిబ్బంది పలకరించి బాధను పంచుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఎస్‌ఐ వెంకటరమణ హఠాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే విగతజీవిగా మారాడు. పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిళ్లే తన భర్త మరణానికి కారణమని మృతుని భార్య మహేశ్వరి బోరున విలపిస్తుంటే పోలీసు అధికారులు మౌనంగా రోధించడం కనిపించింది. పోలీసు శాఖలో నూ వారాంతపు సెలవులను అమలు చేసి పని ఒత్తిడిని తగ్గించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అధికారులకు కష్టతరమైన ఎయిర్‌పోర్ట్ డ్యూటీ..
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో తరచూ వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రధానంగా దేశ, విదేశాల నుంచి వీవీఐపీలు తిరుమల దర్శనార్థం వస్తుంటారు. ఈ క్రమంలో రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఖాకీలు బందోబస్తు డ్యూటీలో నరకం అనుభవిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు ఎయిర్‌పోర్ట్ బందోబస్తు డ్యూటీ కత్తిమీద సాము లాంటిది. రెవెన్యూ అధికారులు వీఐపీలకు సకల సౌకర్యాలను కల్పించడం కోసం ఒక్కో పర్యటనకు కనీసం రూ.60వేలు చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. రేణిగుంట తహసీల్దార్ వీఆర్‌ఎస్‌కు ఇది కూడా ఓ కారణంగా రెవెన్యూ సిబ్బందే చర్చించుకుంటున్నారు. సీఎం వచ్చే ప్రత్యేక ప్రవేశమార్గంలో భద్రతాపరమైన విధులు నిర్వహించే పోలీసుల సౌకర్యార్థం షామియానా, కుర్చీలు, తాగునీటి సదుపాయాలు కల్పించేవారు. అయితే గురువారం సీఎం స్వాగత సమయంలో కనీసం షామియానా కూడా వేయకపోవడంతో పోలీసులు గంటల తరబడి ఎండలోనే ఇబ్బందిపడ్డారు. ఎస్‌ఐ వెంకటరమణ కూడా అక్కడే ఎండలోనే గంటల తరబడి వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశద్వారం వద్ద సౌకర్యాల లేమిపై కొందరు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఎస్‌ఐ వెంకటరమణ మృతి ఓ గుణపాఠంగా భావించి పోలీసు శాఖ ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే నిర్ణయాలు తీసుకోవాలని రక్షక భటులు కోరుతున్నారు.
అధికార చేష్టలే ఎస్‌ఐ ప్రాణం తీశాయి
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రక్షక భటులకే రక్షణ కరువు అయ్యిందని వైఎస్‌ఆర్‌సీపీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన ఇసుక నేతల ఒత్తిడితోనే ఏర్పేడు ఎస్‌ఐ వెంకటరమణ మృతి చెందారని ఆరోపించారు. ఏడాది క్రితం టీడీపీకి చెందిన ధనంజయులు నాయుడు, చిరంజీవుల నాయుడు ఇసుక అక్రమ వ్యాపారం నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో 16 మంది మృతి చెందారన్నారు. బెయిల్‌పై విడుదలైన వారి నుంచి ఎమ్మెల్యే కుమారుడు బొజ్జల సుధీర్‌రెడ్డి పెద్ద మొత్తంలో ముడుపులు పొంది పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. మళ్లీ వారు చేస్తున్న ఇసుక అక్రమాలకు ఎస్‌ఐ అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. దీంతో ఆయనపై కక్షగట్టి సస్పెండ్ చేయించాలని టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు తెలియజేశారు. ఎయిర్‌పోర్టులో మంత్రికి ఫిర్యాదు కూడా చేశారని పేర్కొన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న ఎస్‌ఐను మానసికంగా కుంగదీశారన్నారు. ఈ కారణంగా ఎస్‌ఐ ఒత్తిడికి గురై గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని ఆరోపిం చారు. కొత్తగా ఏర్పేడు స్టేషన్‌కు రావాలంటేనే అధికా రులు భయపడుతున్నారన్నారు. టీడీపీ నేతలు ఇసుక దాహానికి మరెంతమంది బలవుతారో తెలియ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుం బాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు కొట్టెడి మధుశేఖర్, నాగోలు శ్రీనివాసులురెడ్డి, ఊటా రమేష్‌యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment