96 మంది డీఎస్పీల బదిలీ.. 57 మందికి పోస్టింగులివ్వని ప్రభుత్వం
డీఎస్పీల బదిలీల్లో కక్ష సాధింపు
డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని వారికి ఆదేశం
ఇప్పటికే 24 మంది ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వని ప్రభుత్వం
ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న పోలీసు వర్గాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసు శాఖలో మంత్రి నారా లోకేశ్ ‘రెడ్‌బుక్’ రాజ్యమేలుతోంది. కూటమి ప్రభుత్వం పోలీసు అధికారుల బదిలీలను ‘రెడ్‌బుక్’ను అనుసరించి కక్షపూరిత వైఖరితోనే చేపడుతోంది. సీఐ నుంచి ఐపీఎస్‌ల వరకు అధికారులపై వేధింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే 24 మంది ఐపీఎస్ అధికారులకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టిన సందర్భం లేదు. ఇదే అత్యంత వివాదాస్పద రీతిలో డీఎస్పీలను బదిలీ చేసింది.
బుధవారం భారీస్థాయిలో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఏకంగా 57 మంది డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం గమనార్హం. వీరందరినీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష పూరిత ధోరణికి ఇది మరో నిదర్శనమని స్పష్టమవుతోంది. తుళ్లూరు డీఎస్పీ ఇ. అశోక్ కుమార్ గౌడ్, రాజంపేట డీఎస్పీ చైతన్యను మంగళవారం బదిలీ చేసి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశించింది.
తుళ్లూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ బుధవారం రిటైర్ అయ్యారు. ఇలా రిటైర్మెంట్‌కు ఒక రోజు ముందు బదిలీ చేయడం, మరో చోట పోస్టింగ్ ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించడం నిబంధనలకు విరుద్ధం. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంపై డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ డీజీపీ ద్వారాకా తిరుమలరావును కలిసి తన అసంతృప్తిని తెలియజేసినట్లు సమాచారం. పోలీసు అధికారుల పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిపై పోలీసువర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment