
సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): వేరే జిల్లాకు బదిలీ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు సరస్వతికి కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు కన్నీటితో వీడ్కోలు పలికారు. భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో సోమవారం పోలీసు బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. సరస్వతి ఆత్మహత్య విషయం తెలిసి ఖతర్‌లో ఉంటున్న ఆమె భర్త భూమేశ్ హుటాహుటిన స్వగ్రామానికి వచ్చారు. రాజకీయ నాయకులు రాకుండా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఇతర పార్టీల నాయకులు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో గ్రామానికి వచ్చే అన్ని దారుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్, తపస్, డీటీఎఫ్ తదితర సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరస్వతి ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, ఆమె ఆశయాలను సాధించడానికి, జీవో నెం.317 జీవో రద్దు చేసే వరకు పోరాడతామని హెచ్చరించారు.
సరస్వతి అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు
మంత్రి పర్యటన రద్దు..
రైతుబంధు పెట్టుబడి సహాయం రూ.50 వేల కోట్లకు చేరిన నేపథ్యంలో నిర్వహిస్తున్న సంబురాల్లో పాల్గొనడానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే, సరస్వతి ఆత్మహత్య అనంతరం ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయోననే సందేహంతో మంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
చదవండి: (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. అదే కారణమా..?)
‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’
‘గాంధారిలో ఉద్యోగం చేయడం ఇష్టం లేకుంటే రాజీనామా చేయు అని చెప్పానుగా సరస్వతి.. ఉద్యోగం మానేస్తే మరో నాలుగేళ్లు ఎక్కువ కష్టపడతా అన్నానుగా.. రామ్‌లక్ష్మణ్‌లను మంచిగా చదివించుకోవడమే ముఖ్యం అంటే సరే అన్నావు.. మరి ఎందుకిలా చేశావు సరస్వతి.. నా ముఖం, పిల్లల ముఖం చూసైనా బతుకుదామనిపించలేదా సరస్వతి... నీ దారిన నీవు పోయి మా అందరి దారి మూసేసావు సరస్వతి..’ అంటూ భర్త భూమేశ్ విలపించడం అక్కడున్న వారిని కలిచి వేసింది. పదేళ్ల నుంచి ఖతర్‌లో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న భూమేష్ ఏడాది కిందనే సెలవుపై వచ్చి వెళ్లాడు. మరో ఏడా ది తరువాత ఇంటికి రావాల్సి ఉండగా భార్య సరస్వతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పా ల్పడిన విషయం తెలుసుకుని సోమవారం హుటాహుటిని ఇంటికి చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment