నుజ్జునుజైన కారు
వారంతా బంధువులు. తిరుమలశ్రీవారిని దర్శించుకోవాలనిఅనుకున్నారు. వెంటనే రెండు వాహనాల్లో బయలుదేరారు. శ్రీవారిని, కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని కన్నులారా దర్శించుకున్నారు. సంతోషంగా తిరిగి సొంత ఊరికి బయలుదేరారు. వారి సంతోషం ఎంతోసేపు నిలువ లేదు. విధి వక్రించింది. కారు బస్సునుఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడేదుర్మరణం చెందారు. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.
ఈ సంఘటన పులిచెర్ల మండలంలో సోమవారం జరిగింది.
చిత్తూరు, పులిచెర్ల(కల్లూరు): ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పులిచెర్ల మండలం చెఱుకువారిపల్లె వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన చావలి వెంకటశాస్త్రి (50), అతని భార్య చావలి రాజ్యలక్ష్మి (45), సౌమ్య (21) మరో ముగ్గురు బంధువులు మూడురోజుల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి రెండు కార్లలో వచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం సోమవారం కాణిపాకం వెళ్లారు. అక్కడ వినాయకున్ని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. కల్లూరులో ఒక కారు పీలేరు వైపు, మరొక కారు దారి గుర్తించక పుంగనూరు వైపు వెళ్లాయి. పీలేరు రోడ్డులో వెళుతున్న కారు చెఱుకువారిపల్లె బస్టాప్ వద్ద పీలేరు నుంచి చిత్తూరు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో అందులో ఉన్న దంపతులు చావలి రాజ్యలక్ష్మి, వెంకటశాస్త్రి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే కారులో వెనుక సీటులో కూర్చున్న సౌమ్య (21)కు స్వల్ప గాయాలయ్యాయి.
ఆమె వెంటనే పుంగనూరు వైపు వెళ్లిన తమ బంధువులకు సమాచారం అందించింది. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. దైవదర్శనానికి వచ్చి సంతోషంగా వెళుతున్న సమయంలో దేవుడు చిన్నచూపు చూశాడని, ఇద్దరిని పోగొట్టుకున్నామని కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో పక్కనే ఉన్న పీఎల్‌ఆర్ తారు ప్లాంటు మేనేజరు నాగిరెడ్డి తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా సమాచారం అందుకున్న కల్లూరు ఎస్‌ఐ విశ్వనాథనాయుడు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి కారులో ఇరుక్కున్న మృతులను జేసీబీ సహాయంతో అతికష్టం మీద బయటకు తీశారు. స్వల్ప గాయాలతో బయటపడిన సౌమ్యను పీలేరు ఆస్పత్రి తరలించారు. కారు ఢీకొనడంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు రెండు చక్రాలు విరిగిపోయి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉండగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందిన వారికి సంతానంలేదు. సమాచారం అందుకున్న పాకాల సీఐ రామలింగమయ్య అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment