కాణిపాకం(చిత్తూరు): తమ పాస్‌పోర్టు సమయం అయిపోతుందని రెన్యూవల్ కోసం ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చారు. కుమారుని పాస్ పోర్టు రెన్యూవల్‌కు సమయం ఉండడంతో దైవ దర్శనానికి బయలుదేరి అనుకోని ప్రమాదంలో అత్తకోడళ్లు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం మండలంలో విషాదం నింపింది. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన కుమారస్వామి, సుజాత భార్యాభర్తలు. వృతిరీత్యా యూ ఎస్‌ఏలో ఉద్యోగం చేస్తున్నారు.
వారి కుమారుడు ధను. ముగ్గురి పాస్‌పోర్టులు గడువు ముగియడంతో రెన్యూవల్ కోసం ఇండియాకు గత నెలలో వచ్చారు. తండ్రి, తల్లి పాస్‌పోర్టులు రెన్యూవల్ పూర్తికాగా.. కుమారుని పాస్ పోర్టు రెన్యూవల్ కాలేదు. సమయం ఉండడంతో తల్లిదండ్రులు సుబ్రమణ్యం, స్వర్ణలత, భార్య సుజాతతో కలసి కుమారస్వామి కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి మంగళవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు.
సాయంత్రం కాణిపాకం సమీపంలోని తిరువణంపల్లె సమీపంలో టైరు పేలింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు ను ఢీకొంది. ఈ ప్రమాదంతో స్వర్ణలత(65), సుజాత(31)కు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ స్వర్ణలత, సుజాత మృతి చెందారు. ఎస్‌ఐ మనోహర్ కేసు నమోదు చేశారు. కాగా రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆర్డీఓ రేణుక పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment