మీర్‌పేట: రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు వారివి. ఉన్నంతలోనే తమ ముగ్గురు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్న తరుణంలో ఓ కారు ఆ దంపతులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిని కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన చిన్న తిరుపతయ్య, బాల వెంకమ్మ దంపతులు బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం నగరానికి వచ్చి భూపేష్ గుప్తానగర్ వనపురి కాలనీ సమీపంలో గుడిసె వేసుకుని నివాసముంటున్నారు. తిరుపతయ్య ఇంటింటికి తిరిగి గ్యాస్‌స్టవ్ రిపేర్లు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. చిన్న కుమార్తె తిరుమల బాలమ్మ(2) సోమవారం సాయంత్రం స్థానికంగా ఉండే పిల్లలతో కలిసి ఇంటి ఎదుట ఆడుకుంటోంది.
అదే సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా కారుతో చిన్నారిని ఢీకొట్టి, తలపై నుంచి వెళ్లడంతో సంఘటనా స్థలిలోనే మృతి చెందింది. గమనించిన స్థానికులు కారు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమ్టారం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment