- జగన్ అండతో మరింత ముందుకెళ్దాం
- విరాళాలతోనైనా స్విమ్స్‌కు న్యాయం చేద్దాం
- జూ.డాల ఆందోళనలో భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి అర్బన్: ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలోని రుయా, మెటర్నిటీ ఆస్పత్రులు పూర్తిగా పేదలవనే భావనతోనే ప్రభుత్వం, వైద్య శాఖ ఉన్నతాధికారులు చిన్నచూపు చూస్తున్నారని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు.
మెటర్నిటీ హాస్పిటల్‌కు అనుబంధంగా నిర్మించిన 300 పడకల ఆస్పత్రి భవనాలను తిరిగి మెడికల్ కాలేజీ పరిధిలోకి తెచ్చే విధంగా భవన పరిరక్షణ జేఏసీ కన్వీనర్లు డాక్టర్ జీ.పార్థసారథిరెడ్డి, డాక్టర్ కిరీటి ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆందోళన శనివారం 11వ రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు నిరసనకారులు రుయా, మెటర్నిటీ ఆస్పత్రుల వద్దకు చేరుకుని అన్ని ఓపీలను బంద్ చేయించారు. రుయా పరిపాలనా భవనం ఎదుట జూనియర్ డాక్టర్ల (యూజీ, పీజీ) సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అక్కడికి చేరుకున్న కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి తమవంతు విరాళాలను అందజేశారు. వారు మాట్లాడుతూ స్విమ్స్‌కు కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీని మంజూరు చేస్తే కనీసం అందుకు అనువైన భవనాలను, సౌకర్యాలను కల్పించేందుకు కూడా నిధులు లేవంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో సంప్రదించి ఆయన అండతో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
చివరగా జూనియర్ డాక్టర్లు రుయా నుంచి ర్యాలీగా బయల్దేరి రుయా చిన్న పిల్లల ఆస్పత్రికి చేరుకుని ఉద్యమ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. జూడాల సంఘం(పీజీ) అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్, కార్యదర్శి డాక్టర్ సురేష్, ఉపాధ్యక్షుడు డాక్టర్ గోపీకృష్ణ, యూజీ అధ్యక్షుడు డాక్టర్ విష్ణుభరద్వాజ్, కార్యదర్శి డాక్టర్ సత్యవాణి, ఉపాధ్యక్షుడు డాక్టర్ భానుప్రకాష్, సభ్యులు డాక్టర్ కిరణ్‌రెడ్డి, డాక్టర్ సేతుమాధవ్, హౌస్ సర్జన్ల సంఘం నాయకులు డాక్టర్ ప్రమోద్, డాక్టర్ వినయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.