అక్టోబర్‌లో.. తిరుపతి సమరం!
తిరుపతి తుడా : తిరుపతి కార్పొరేషన్‌కు అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు, పురపాలికశాఖా మంత్రి నారాయణ సూచనప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాల యంలో మంగళవారం రాష్ట్రంలోని గ్రేటర్ విశాఖతోపాటు అన్ని మున్సిపల్, కార్పొరేషన్ల కమిషనర్లతో సీఎం, మంత్రి వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నాలుగేళ్లకు పైగా ఎన్నికలు జరగకుండా పలు సమస్యలతో పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై సుదీర్ఘంగా చర్చిం చినట్లు తెలిసింది. ఆయా మున్సిపాలిటీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ గ్రేటర్ విశాఖతోపాటు పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇదేమాట చెప్పడంతో ఎన్నికలు అక్టోబర్‌లో తధ్యమని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక కార్పొరేషన్ అధికారులు ఎన్నికల నగరాకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
అన్ని రంగాల్లో వ్యతిరేకత
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం ఎన్నికల్లో నిర్వహిస్తే అన్నివర్గాల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేసినట్టు సమాచారం. రీజనల్ డెరైక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను విజయవాడకు పిలిపించుకున్న ముఖ్యమంత్రి ప్రధానంగా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపైనే సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. అధికారులు ఏం చెప్పలేక నీళ్లు నమిలినా.. చివరకు చెప్పక తప్పని పరిస్థితిలో రుణమాఫీలు, నిరుద్యోగభృతి, ఇతర సంక్షేమ పథకాల అమలు తీరుపై జనం మండిపోతున్నారని తెలిపారని సమాచారం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలతో పాటు, బలిజ, కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెప్పుకొచ్చారని తెలిసింది. అయితే ఎన్నికలు నిర్వహించకుంటే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయనీ, అందువల్ల ఎన్నికలు పోవాల్సిందేనని చెప్పినట్లు తెలుస్తోంది.