డిప్యూటీ సీఈవోకు ఫిర్యాదును అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ బృందం
ఎన్నికల సంఘాన్ని కోరిన వైఎస్సార్‌సీపీ బృందం
టీడీపీ అధినేతకు ఓటమి భయం పట్టుకుంది
సజ్జలపై టీడీపీ లీగల్ సెల్ తప్పుడు కేసులు
సాక్షి,అమరావతి: కౌంటింగ్ రోజున అల్లర్లు సృష్టించేలా తెలుగుదేశం కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొడుతున్న చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ బృందం కోరింది. ఈ మేరకు శనివారం వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావును కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లకు ట్రైనింగ్ క్యాంపులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.
వైఎస్సార్‌సీపీ కౌంటింగ్ ఏజెంట్లను తరిమికొట్టాలని, కౌంటింగ్ ప్రాంతంలో లేకుండా చేయాలని రెచ్చగొట్టేలా బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల నియమావళిపై కనీస అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ అధినేతకు ఓటమి భయం పట్టుకుందని.. కనుకనే అల్లర్లు సృష్టించి ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసాలు, ఘర్షణలతో ప్రజా తీర్పును మార్చేందుకు ప్రయతి్నస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఎక్కడా దౌర్జన్యకాండ జరగకుండా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, కఠినంగా వ్యవహరించాలని ముందస్తుగా ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని మల్లాది విష్ణు మండిపడ్డారు. సజ్జల మాటలను తెలుగుదేశం లీగల్ సెల్ పూర్తిగా వక్రీకకరించి, ఆయనపై తప్పుడు కేసు బనాయించిందని నిప్పులు చెరిగారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నదెవరో ఓటర్లకు బాగా తెలుసన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సైకో అని, గొడ్డలి అని, ఘర్షణలు సృష్టించేలా నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, కూటమి టీడీపీ నేతలపై నేటికీ కనీస చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ ఇచ్చిన దాదాపు వందకి పైగా ఫిర్యాదులు ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ముఖ్యంగా కోడ్‌ను పదేపదే ఉల్లంఘిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని కోరినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్ డ్రా చేసుకోవాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్‌సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment