అంతర్యామీ...అలసితిమీ....!
- నగరంలో 200కు పైగా పాతభవనాలు
- చర్యలు తీసుకోవడంలో అధికారుల వెనుకడుగు
- ప్రమాదం జరిగాక స్పందిస్తారా.. అని నిలదీస్తున్న ప్రజలు
‘‘తిరుమలేశా.. ఒకప్పుడు నీ పాదాల చెంత కొత్తూరుగా వెలసిన కుగ్రామం తిరుపతిగా మారింది. ఆ తర్వాత పట్టణమైంది.. ఇటీవల నగరంగా విస్తరించింది. నీ దర్శనానికి తిరుమల వచ్చే భక్తులకు సేవలందించే క్రమంలో మమ్మల్ని నిర్మించారు. టీటీడీ అధికారులు.. ఆధ్యాత్మిక గురువులు.. ప్రభుత్వ అధికారులు.. విద్యార్థులు.. వ్యాపారులకు వసతిగా ఉన్నాం. మా వయసు వందేళ్లు కావస్తోంది. సేవలందించే శక్తి సన్నగిల్లుతోంది. పటుత్వం తగ్గిపోయింది. మాకు ముక్తిని ప్రసాదించు స్వామీ’’ అంటూ తిరుపతిలోని పాత భవనాలు వేడుకుంటున్నాయి.
తిరుపతి కార్పొరేషన్: తిరుపతి నగరంలో ఏ ప్రధాన వీధిలో చూసినా శిథిలావస్థకు చేరిన భవనాలు భయపెడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు రెండు వందలకు పైగానే ఉన్నాయి. ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న గాంధీరోడ్డు, గోవిందరాజ తేరు వీధి, కర్నాల వీధి, తీర్థకట్ట వీధి, చిన్న బజారు వీధుల్లో శిథిలావస్థకు చేరిన కొన్ని భవనాలకు యజమానులు పైపైన మెరుగులు దిద్ది అద్దెలకు ఇస్తున్నారు. గాంధీరోడ్డులోని కర్ణాటక సత్రం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో మూసివేశారు.
గంగుండ్ర మండపానికి వెళ్లే వీధిలో ఉన్న ఓ పాత భవనంపై మొక్కలు పెరగడంతో గోడలు నెర్రెలు బారి ప్రమాదకరంగా మారింది. వీటి పక్కన వ్యా పారాలు చేస్తున్న దుకాణదారులు మాత్రం ఎప్పుడు కూలుతుందోనని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. యాదవ వీధిలోని ఓ పాత భవనంపై మొక్క ఏపుగా పెరగడంతో భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. వీటిపై పలుమార్లు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.
ప్రభుత్వ భవనాలదీ అదే పరిస్థితి
గోవిందరాజ స్వామి తేరువీధి లో ఉన్న సమాచార పౌర సం బంధాల శాఖకు చెందిన సహాయ సంచాలకుల కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడికి నిత్యం పాఠకులు వస్తూ, పోతుంటారు. గోవిందరా జస్వామి పుష్కరిణి సమీపంలోబాలతేజస్సు కేంద్రం నిర్వహిస్తున్న మున్సిపల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇందులోని సిబ్బం ది, వారి పర్యవేక్షణలో ఉండే పిల్లలు క్షణమొ క యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు. వెస్ట్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని రాములవారి ఆలయానికి చెందిన పుష్పతోట (భవనం) శిథిలావస్థకు చేరుకుంది.
ప్రస్తుతం ఈ భవనాన్ని ఎస్వీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులకు వసతి గృహంగా ఉపయోగిస్తున్నారు. భవనం గదులపై నుంచి పెచ్చులూడి పడుతుండడంతో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. టీటీడీ పాత పరిపాలనా భవనం, పాత ఆర్డీవో కా ర్యాలయ భవనంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయ భవనాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి.
200 భవనాలకు నోటీసులు
శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్న 200లకు పైగా పాత భవనాల యజమానులకు ఇదివరకే నోటీసులు ఇచ్చామని కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. అందులో గాంధీరోడ్డు, గోవిందరాజ స్వామి ఆలయ మాడ వీధులు, పాత టీటీడీ భవనంతో పాటు పలు ప్రాంతాలు ఉన్నా యి. వీటికి నోటీసులు జారీచేసిన అధికారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని చేతులు దులుపుకున్నట్టు ఆరోపణలు ఉన్నా యి. 60 ఏళ్లు నిండిన ప్రతి భవనమూ పటుత్వం కోల్పోతుందని అధికారులు చెబుతున్నారు.
అలాంటి భవనాల వయసు, పునాదుల తీరు, వాడిన నిర్మాణ సామగ్రి, గోడ లు, పైకప్పు వంటివి పరిశీలించి భవన పటుత్వంపై ఇంజనీరింగ్ అధికారులతో నిర్ధారిం చుకోవాలి. ప్రమాదమని భావించిన వాటిని వెంటనే తొలగించాలి. అయితే అలాంటి నిబంధనలు ఇక్కడ అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరి గాక స్పందించడంకన్నా ముందుగానే అధికారులు మేల్కొంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని ప్రజలు సూచిస్తున్నారు.