విజృంభించిన విషజ్వరాలు
తిరుపతి కార్పొరేషన్: జిల్లాలో విషజ్వరాలు ప్రబలాయి. ముఖ్యంగా విష జ్వరాలతో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలోని స్విమ్స్, రుయాతో పాటు నగరంలోని ప్రయివేట్ చిన్న పిల్లల ఆసుపత్రులు జ్వరం సోకిన చిన్నారులతో కిటకిలాడుతున్నాయి. తిరుపతి నగరం, రూరల్, చంద్రగిరి, పాకాల, దామలచెరువు, పీలేరు, ఏర్పేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వడమాల పేట మండలాల్లో 15 రోజులుగా విష జ్వరాల బారిన పడుతున్నారు. ముఖం వాపులు రావడం, ఎర్రటి గుల్లలు ఏర్పడటం, విరేచనం నల్లగా కావడం వంటి లక్షణాలతో పెద్దాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి విష జ్వరాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలో...
ఒక్క రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలోనే వందకు పైగా విష జ్వరాల కేసులు నమోదయ్యాయి. అందులో 30కి పైగా డెంగీ లక్షణాలను గుర్తించిన వైద్యులు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మొత్తం నాలుగు యూనిట్లు ఉండగా వందకు పైగా పిల్లలు వెద్య సేవలు పొందుతున్నారు. ఇక్కడ వ్యాధి నిర్ధారణ కోసం చేస్తున్న పరీక్షలకు, వ్యాధి తగ్గడానికి కనీసం వారం రోజులైనా సమయం పడుతోంది. దీంతో కొందరు మెరుగైన వైద్యం కోసమని స్విమ్స్‌కు పరుగులు తీస్తున్నారు. దీనిపై రుయా చిన్నపిల్లల వైద్యాధికారి డాక్టర్ రవికుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా చిన్న పిల్లలకు విష జ్వరాలు సోకుతున్న మాట వాస్తవమే అన్నారు. కాని గతంతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగానే ఉందన్నారు. వచ్చిన వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
ప్రైవేటు దోపిడీ..
విషజ్వరాల బారిన పడిన పిల్లలను తీసుకుని చాలా మంది ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ప్రయివేట్ వైద్యులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా రక్తపరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రేలు అంటూ నానా హడావిడి చేస్తున్నారు. దీనికి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు బిల్లు చేతిలో పెడుతున్నారు. ఇంత చేసినా బిడ్డకు ఫలానా జ్వరం అని చెప్పడం లేదని సావిత్రి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి జిల్లాలో పిల్లలకు సోకుతున్న విషజ్వరాలను నివారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.