- హుదూద్ దెబ్బకు నష్టపోయిన మత్స్యకారులు
- 20రోజులుగా సాగరానికి దూరం
- ఇప్పుడిప్పుడే కదులుతున్న బోట్లు
- రోజుకు స్వల్పస్థాయిలో ఉత్పత్తి
- పరిహారమందక అప్పులపాలు
జలపుత్రుల జీవన గమనంలో అడుగుడుగునా సుడి‘గండా’లే. వాటిని మెల్లగా దాటుకుంటూ బతుకు సయ్యాటలో భాగంగా గంగపుత్రులు మళ్లీ సాగరం బాట పట్టారు. హుదూద్ దెబ్బకు 20 రోజులుగా తీరానికి దూరంగా ఉన్న ఈ బడుగు జీవులు శనివారం నుంచి వేటకు ఉపక్రమించారు. అయినా మెజార్టీ మెకనైజ్డ్ బోట్లు లంగరేయడంతో రోజుకు నాలుగైదు టన్నులకు మించి మత్స్యసంపద దొరకని పరిస్థితి.
సాక్షి, విశాఖపట్నం: హుదూద్ దెబ్బకు కకావికలమైన జిల్లా తేరుకుంటున్నా తీరం వెంబడి సముద్రంతో సహజీవనంచేసే మత్స్యకారు లు మాత్రం ఇంకా కుదుట పడలేదు. జిల్లాలోని 11 మండలాల్లో 132 కిలోమీటర్ల తీరం ఉంది. 62 మత్స్యకార గ్రామాల్లోని 30 వేల మంది రోజూ వేటకు వెళతారు. వీరిలో 30శాతం మందికి వేటలేకుంటే పూట గడవదు. సుమారు లక్ష మంది వేట ఆధారంగా జీవిస్తున్నారు. మరో లక్ష మంది పరోక్షంగా అనుబంధ రంగాలపై ఆధారపడి బతుకుతున్నారు.
వీరందరికీ హుదూద్ వల్ల ఉపాధి లేకుండా పోయింది. తుఫాన్ వల్ల జిల్లాలో 40కి పైగా మత్స్యకార గ్రామాలు దెబ్బతిన్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో 670 మెకనైజ్డ్ బోట్లుంటే దాదాపు అన్నీ దెబ్బతిన్నాయి. సగానికి పైగా ధ్వంసమైతే మిగిలిన సగం బోట్లకు నష్టం వాటిల్లింది. వలలతో పాటు ఉన్న బోట్స్ 391 కొట్టుకుపోతే, వలలతో ఉన్న మరో 190 బోట్స్‌కు నష్టం వాటిల్లింది. ఇవి కాకుండా మరో 431బోట్స్, మరో 190 వలలు విడివిడిగా కొట్టుకుపోతే..మరో చిన్నా చితకా బోట్లు కలిపి 1301 వరకు దెబ్బ తిన్నాయి.
బోట్స్,వలలకు రూ. 24 కోట్ల 61లక్షల 14వేలుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పరిహారం అందలేదు. లైవ్లీ హుడ్ కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఇస్తామన్న పరిహారం కూడా ఏ ఒక్క మత్స్యకారునికి అందలేదు. దీంతో అప్పులతో బోట్లకు మరమ్మతులు చేసుకుంటున్నారు. స్వల్పంగా నష్టపోయిన బోట్లకు మరమ్మతులు చేయించుకున్న యజమానుల శనివారం నుంచి వేటకు వెళ్లడం మొదలు పెట్టారు. సుమారు 350కు పైగా బోట్లు వేటకు వెళ్లినట్టు అంచనా.
నావలు,నాటుపడవలు,చిన్న బోట్లన్నీ తీరంలోనే వేట సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ప్రతీరోజు వేట ద్వారా హార్బర్‌కు 150 నుంచి 200 మెట్రిక్ టన్నుల మత్స్యసంపద వచ్చేది. ప్రస్తుతం కేవలం నాలుగైదు టన్నులకు మించి మత్స్య సంపద రావడంలేదు. పైగా ఇదంతా స్థానిక మార్కెట్ల అవసరాలకే ఉపయోగ పడే రకాలేతప్ప ఎగుమతికి ఉపయోగపడే రకం ఒక్క కిలో కూడా దొరకని దుస్థితి. ఒక్కొక్క మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది వరకు పనిచేస్తుంటారు.
ఈ విధంగా చూస్తే వేటకు వెళ్లిన బోట్లపై సుమారు రెండున్నరవేల మంది ఉపాధి పొందుతుండగా తీరంలో ఎండుచేపలు, పచ్చిచేపల వ్యాపారం చేసే వారు మరో 500 మంది వరకు ఉపాధి లభిస్తోంది. ఫిషింగ్ హార్బర్‌పై ఆధారపడి జీవనం సాగించే వేలాది మత్స్యకారులతో పాటు భీమిలి నుంచి పాయకరావుపేట వరకు తీరం వెంబడి వేటే జీవనాధారంగా బతికే వారుసైతం ఉపాధి లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. పూర్తిస్థాయిలో వేట ఎప్పుడు ప్రారంభమవుతుందా? పూర్వ వైభవం వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.