- చేపలకు కరువే కారణం
- ఎగుమతి కేంద్రాలూ మూత
- మత్స్యకారుల కలత
విశాఖపట్నం, న్యూస్‌లైన్: మత్స్యకారులకు చేపల వేట నష్టాల బాటగా మారింది. తూర్పు తీరంలో చేపలకు కరువొచ్చి పడింది. ప్రాణాలొడ్డి నెలల తరబడి సంద్రంలో కష్టపడినా వారికి చేపల జాడే లేకుండా పోయింది. ఫలితంగా ఒక దఫా వేటకు రూ.20-30 వేల వరకు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మునుపెన్నడూ లేనంతగా ప్రస్తుత పరిస్థితులను చూసి మత్స్యకారులు, బోటు ఓనర్లు, మత్స్య కార్మికులు తీవ్రంగా కలత చెందుతున్నారు.
ఏటా ఏప్రిల్ 15 నుంచి 47 రోజుల పాటు చేపల వేటపై నిషేధం అమలవుతుంది. కానీ నిషేధం అమలుకు సుమారు నెలన్నర రోజుల ముందు నుంచే చేపల లభ్యత క్షీణించడం మొదలైంది. రానురాను మరింత దిగజారడంతో వేట గిట్టుబాటు కావడం లేదు. దీంతో గత్యంతరం లేక, నష్టాలను భరించలేక కొద్ది రోజుల నుంచి చేపల వేట మానేసి బోట్లను హార్బర్‌లో జట్టీలకే పరిమితం చేశారు. ఇప్పుడు విశాఖ ఫిషింగ్ హార్బర్ మరబోట్లతో నిండి ఉంది. విశాఖ నుంచి వేటకెళ్లే మరబోట్లు 750, 1500 వరకూ మోటారు బోట్లు వేట సాగిస్తుంటాయి. వీటిలో 90 శాతానికి పైగా బోట్లు వేటకు ఫుల్‌స్టాప్ పెట్టేసి హార్బర్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాయి.
వాస్తవానికి నెలన్నర రోజుల వేట విరామానికే మత్స్యకారులు కుటుం పోషణ సాగక అల్లాడుతుంటారు. అలాంటిది రెండు నెలలకు పైగానే చేపల వేట మానుకోవలసిన పరిస్థితి తలెత్తడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చేపల్లేకపోవడంతో హార్బర్లోని ఎగుమతి కేంద్రాలు కళతప్పాయి. విశాఖ హార్బర్‌లో పెద్ద ఎగుమతి కేంద్రాలు 24, చిన్నవి వందకు పైగా ఉన్నాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటే పెద్ద కేంద్రం పనిచేస్తుండగా, చిన్న ఎగుమతి కేంద్రాలు అర డజను మాత్రమే తెరచి ఉన్నాయి.
ఫలితంగా వేట నిలిచిపోవడంతో చేపలు లేక, ఎగుమతి కేంద్రాలు తెరచుకోక ఫిషింగ్ హార్బర్ బోసిపోయింది. అలాగే హోల్‌సేల్, రిటైల్ చేపల మార్కెట్లలో కూడా అమ్మకాలు, కొనుగోళ్లు సన్నగిల్లాయి. మత్స్యకారులు వేటకు స్వస్తి చెప్పి ఇంజన్లు, వలలు, ప్రొపెల్లర్లను బోట్ల నుంచి తీసి ఇంటికి పట్టుకుపోతున్నారు. ఈ ఏడాది సుమారు రెండు నెలల పాటు తమకు గడ్డుకాలమేనని వాపోతున్నారు.
సంక్రాంతి నుంచి ఇంతే..
సంక్రాంతి నుంచి చేపలవేట ఆశాజనకంగా లేదు. నెలల తరబడి వేట సాగించినా చేపలు పడడం లేదు. 30 శాతం బోట్లు వేటకెళితే అందులో మూడొంతులు బోట్లకు నష్టాలే వస్తున్నాయి. దీంతో బోటు ఓనర్లు సాహసం చేయలేకపోతున్నారు. బోట్లను హార్బర్‌కే పరిమితం చేస్తున్నారు.
- పి.సి.అప్పారావు, అధ్యక్షుడు, ఏపీ మరపడవల సంఘం