Visakhapatnam fishing harbor
-
ఫిషింగ్ హార్బర్‌పై వైఎస్సార్సీపీ జెండా
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌పై వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. 32 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధీనంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరపడవల సంఘాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా వైఎస్సార్సీపీకి చెందిన వాసుపల్లి జానకీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని ఆంధ్రప్రదేశ్ మరపడవల సంఘంలో 300 మంది సభ్యులున్నారు. వీరికి 680 బోట్లున్నాయి. ఈ సంఘానికి అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పి.సి.అప్పారావు కొన్నేళ్లుగా ఎన్నికవుతున్నారు. ఎప్పుడూ ఓటింగ్ నిర్వహించకుండా చేతులు ఎత్తే పద్ధతినే అనుసరిస్తూ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న అప్పారావు మరపడవల సంఘం అధ్యక్షుడిగాను కొనసాగుతుండేవారు. ఈ నేపథ్యంలో దివంగత మాజీ కార్పొరేటర్ బి.నీలకంఠం అల్లుడు వాసుపల్లి జానకీరామ్ సంఘంలో చేరడానికి చేసిన ప్రయత్నాలను అప్పారావు అడ్డుకునేవారు. ఏపీ మరపడవల సంఘంలోని అవకతవకలను పలుమార్లు లేవనెత్తిన వాసుపల్లి జానకీరామ్ ఎన్నికలు నిర్వహించాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సంఘం కార్యవర్గానికి కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సోమవారం పోలీసు బందోబస్తు మధ్య జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు వద్దని అప్పారావు వర్గం, నిర్వహించాలని జానకీరామ్ వర్గం ఈ సమావేశంలో పట్టుబట్టాయి. రెండువర్గాల మధ్య వాదోపవాదాలు సాగాయి. పరిస్థితి గమనించిన పి.సి.అప్పారావు పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో జానకీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జానకీరామ్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. -
ఆరంభంలోనే ‘అల’జడి!
- వాయుగుండంతో బోట్లు వెనక్కి - విశాఖ ఫిషింగ్ హార్బర్లో లంగరు - నష్టాల్లో మత్స్యకారులు సాక్షి, విశాఖపట్నం : రెండు నెలల విరామం తర్వాత చేపల వేటకెళ్లిన మత్స్యకారుల ఆశలపై వాయుగుండం నీళ్లు చల్లింది. ఈ ఏడాది ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14 అర్ధరాత్రి (61 రోజులు) వరకు ప్రభుత్వం చేపలవేటపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో 15వ తేదీ నుంచి వీరు వేటకు బయల్దేరారు. వెళ్లిన రెండు రోజులకే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్ర మేపీ వాయుగుండంగా బలపడింది. ఫలితంగా మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాణభయంతో అప్పటికే సముద్రంలో వేట సాగిస్తున్న బోట్లలో సగానికిపైగా ఆగమేఘాలపై విశాఖ హార్బర్‌కు తీసుకొచ్చేశారు. మరికొన్ని మరపడవలు సమీపంలో ఉన్న ఒడిశాలోని గోపాల్పూర్, పారదీప్, శ్రీకాకుళం జిల్లా భావనపాడు తదితర రేవులకు చేర్చారు. విశాఖ నుంచి సుమారు 650 బోట్లు వేట సాగిస్తుంటాయి. నిషేధం పూర్తయ్యాక ఇందులో దాదాపు 400 బోట్లు వేటకెళ్లాయి. మిగిలినవి వెళ్లే లోగానే అల్పపీడన భయంతో హార్బర్‌లోనే నిలిచిపోయాయి. వాస్తవానికి నిషేధానికి రెండు నెలల ముందు నుంచి చేపలవేట ఆశాజనకంగా లేదు. దీంతో అప్పటికే మత్స్యకారులు బాగా నష్టపోయారు. వేట విరామం తర్వాత చేపల లభ్యత బాగుంటుందన్న ఆశతో వేటకెళ్లారు. ఒకసారి వేటకు వెళ్తే 10 నుంచి 15 రోజుల పాటు సముద్రంలోనే ఉంటారు. ఇందుకు అవసరమైన డీజిల్, ఐస్, నిత్యావసర సరకులు వెరసి రూ.లక్షన్నరకు పైగా పెట్టుబడి పెట్టారు. సముద్రంలో వేట మొదలయ్యే సరికే వాయుగుండం హెచ్చరికలు వెలువడ్డాయి. దీంతో అర్ధంతరంగా వెనక్కి రావడం వల్ల ఒక్కో బోటుకు 300 నుంచి 400 లీటర్ల డీజిల్ వృథాగా ఖర్చయింది. నాలుగైదు టన్నుల ఐస్ కూడా కరిగిపోయింది. చేపలు లభ్యత లేకపోవడంతో రూ.40 నుంచి 50 వేల వరకు నష్టపోయామని బోటు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయుగుండం హెచ్చరికలతో వెనక్కి వచ్చేసిన బోట్లు విశాఖ ఫిషింగ్ హార్బర్లో 300కు పైగా ఉన్నాయి. ఇవన్నీ మళ్లీ వేటకు బయల్దేరాలంటే మరో రెండు రోజులైనా పడుతుంది. అప్పుడు కొత్తగా ఐస్, రేషన్ వంటివి అవసరమని, మళ్లీ వాటిని సమకూర్చుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుందని వైశాఖి బోటు ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీహెచ్.సత్యనారాయణమూర్తి తెలిపారు. -
కష్టాలబాటలో ఆశలవేట
హుదూద్ దెబ్బకు నష్టపోయిన మత్స్యకారులు 20రోజులుగా సాగరానికి దూరం ఇప్పుడిప్పుడే కదులుతున్న బోట్లు రోజుకు స్వల్పస్థాయిలో ఉత్పత్తి పరిహారమందక అప్పులపాలు జలపుత్రుల జీవన గమనంలో అడుగుడుగునా సుడి‘గండా’లే. వాటిని మెల్లగా దాటుకుంటూ బతుకు సయ్యాటలో భాగంగా గంగపుత్రులు మళ్లీ సాగరం బాట పట్టారు. హుదూద్ దెబ్బకు 20 రోజులుగా తీరానికి దూరంగా ఉన్న ఈ బడుగు జీవులు శనివారం నుంచి వేటకు ఉపక్రమించారు. అయినా మెజార్టీ మెకనైజ్డ్ బోట్లు లంగరేయడంతో రోజుకు నాలుగైదు టన్నులకు మించి మత్స్యసంపద దొరకని పరిస్థితి. సాక్షి, విశాఖపట్నం: హుదూద్ దెబ్బకు కకావికలమైన జిల్లా తేరుకుంటున్నా తీరం వెంబడి సముద్రంతో సహజీవనంచేసే మత్స్యకారు లు మాత్రం ఇంకా కుదుట పడలేదు. జిల్లాలోని 11 మండలాల్లో 132 కిలోమీటర్ల తీరం ఉంది. 62 మత్స్యకార గ్రామాల్లోని 30 వేల మంది రోజూ వేటకు వెళతారు. వీరిలో 30శాతం మందికి వేటలేకుంటే పూట గడవదు. సుమారు లక్ష మంది వేట ఆధారంగా జీవిస్తున్నారు. మరో లక్ష మంది పరోక్షంగా అనుబంధ రంగాలపై ఆధారపడి బతుకుతున్నారు. వీరందరికీ హుదూద్ వల్ల ఉపాధి లేకుండా పోయింది. తుఫాన్ వల్ల జిల్లాలో 40కి పైగా మత్స్యకార గ్రామాలు దెబ్బతిన్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో 670 మెకనైజ్డ్ బోట్లుంటే దాదాపు అన్నీ దెబ్బతిన్నాయి. సగానికి పైగా ధ్వంసమైతే మిగిలిన సగం బోట్లకు నష్టం వాటిల్లింది. వలలతో పాటు ఉన్న బోట్స్ 391 కొట్టుకుపోతే, వలలతో ఉన్న మరో 190 బోట్స్‌కు నష్టం వాటిల్లింది. ఇవి కాకుండా మరో 431బోట్స్, మరో 190 వలలు విడివిడిగా కొట్టుకుపోతే..మరో చిన్నా చితకా బోట్లు కలిపి 1301 వరకు దెబ్బ తిన్నాయి. బోట్స్,వలలకు రూ. 24 కోట్ల 61లక్షల 14వేలుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పరిహారం అందలేదు. లైవ్లీ హుడ్ కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఇస్తామన్న పరిహారం కూడా ఏ ఒక్క మత్స్యకారునికి అందలేదు. దీంతో అప్పులతో బోట్లకు మరమ్మతులు చేసుకుంటున్నారు. స్వల్పంగా నష్టపోయిన బోట్లకు మరమ్మతులు చేయించుకున్న యజమానుల శనివారం నుంచి వేటకు వెళ్లడం మొదలు పెట్టారు. సుమారు 350కు పైగా బోట్లు వేటకు వెళ్లినట్టు అంచనా. నావలు,నాటుపడవలు,చిన్న బోట్లన్నీ తీరంలోనే వేట సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ప్రతీరోజు వేట ద్వారా హార్బర్‌కు 150 నుంచి 200 మెట్రిక్ టన్నుల మత్స్యసంపద వచ్చేది. ప్రస్తుతం కేవలం నాలుగైదు టన్నులకు మించి మత్స్య సంపద రావడంలేదు. పైగా ఇదంతా స్థానిక మార్కెట్ల అవసరాలకే ఉపయోగ పడే రకాలేతప్ప ఎగుమతికి ఉపయోగపడే రకం ఒక్క కిలో కూడా దొరకని దుస్థితి. ఒక్కొక్క మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది వరకు పనిచేస్తుంటారు. ఈ విధంగా చూస్తే వేటకు వెళ్లిన బోట్లపై సుమారు రెండున్నరవేల మంది ఉపాధి పొందుతుండగా తీరంలో ఎండుచేపలు, పచ్చిచేపల వ్యాపారం చేసే వారు మరో 500 మంది వరకు ఉపాధి లభిస్తోంది. ఫిషింగ్ హార్బర్‌పై ఆధారపడి జీవనం సాగించే వేలాది మత్స్యకారులతో పాటు భీమిలి నుంచి పాయకరావుపేట వరకు తీరం వెంబడి వేటే జీవనాధారంగా బతికే వారుసైతం ఉపాధి లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. పూర్తిస్థాయిలో వేట ఎప్పుడు ప్రారంభమవుతుందా? పూర్వ వైభవం వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. -
బోటుకు చోటేదీ
పాతపోస్టాఫీసు: విశాఖ ఫిషింగ్ హార్బ ర్ సుమారు 24 హెక్టార్ల విస్తీర్ణంలో ఉం ది. రూ.4.26 కోట్లతో 11 జెట్టీలను 1976లో విశాఖపట్నం పోర్టుట్రస్టు నిర్మించింది. 750 మరబోట్లు, 1500 మోటారుబోట్లు,100 మినీ ట్రాలర్లు, భారీ ట్రాలర్లను ఈ 11 జెట్టీల్లోనే కట్టాలి. కానీ పదేళ్ల క్రితం మరమ్మతులకు గురైన 14 ట్రాలర్లను యజమానులు పట్టించుకోకపోవడంతో అవి మునిగిపోయాయి. వాటిని తొలగించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని భావించి అలాగే వదిలేశారు. దీంతో ఇవి 300 మరబోట్లు పట్టే స్థలాన్ని ఆక్రమించాయి. అప్పటి నుంచి జెట్టీల్లో అడుగు చోటు దొరకడమే గగనంగా మారింది. ప్రస్తుతం ఒకబోటు వెనుక మరోబోటును ఇలా నాలుగు వరుసల్లో కట్టుకుంటున్నారు. బోట్లలో డీజిల్, ఐస్, నిత్యావసర వస్తువులు నింపుకునే ందుకు మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. ముందున్న బోట్లను తీస్తే గానీ వెనుకున్న బోట్లు ముందుకు వచ్చి నింపుకోవడం కుదరదు. లేదంటే ముందున్న బోట్లు వేటకెళ్లేంతవరకు ఎదురుచూడాల్సిందే. ఇక బోటు మరమ్మతుకు గురైందంటే.. ఇక అంతే సంగతులు. నీటిలో మునిగిన ట్రాలర్లు పైకి 10 శాతం మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన 90 శాతం నీటి అడుగున ఉంటాయి. పదేళ్లుగా అవి నీళ్లలో ఉండడంతో బాగా తుప్పుపట్టి ప్రమాదకరంగా తయారయ్యాయి. మరబోట్లకు చిన్న ఇనుపముక్క తగిలినా నష్టం భారీగా ఉంటుంది. పనుల కోసం మత్స్యకారులు నీళ్లలోకి దిగితే వీటి వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి. మునిగిన ట్రాలర్ల వల్ల చాలా కష్టాలు పడుతున్నామని, వాటిని తొలగించాలని చాలా కాలంగా పోర్టు అధికారులను మత్స్యకారులను కోరుతూనే ఉన్నారు. మునిగిన ట్రాలర్లను తొలగించాలి మునిగిన 14 ట్రాలర్లతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. హార్బర్లో 300 మరబోట్లు పట్టేంత స్థలాన్ని ఇవి ఆక్రమించాయి. మరబోట్లు పెట్టుకోవడానికి స్థలం కరువైంది. నాలుగు వరుసల్లో బోట్లను కట్టుకుంటున్నాం. ఒక మరబోటు తయారీకి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చవుతుంది. మునిగి తుప్పుపట్టిన ట్రాలర్లు మరబోటుకు తగిలితే చాలా నష్టం కలుగుతుంది. నీటి అడుగు భాగా నికి వెళ్లినప్పుడు తుప్పు వ స్తువులు తగిలి మత్స్యకా రు లు ప్రమాదాలకు గురవు తున్నారు. వీటిని వెంటనే తొల గించి మా కష్టాలు తొలగిం చాలి. - బర్రి కొండబాబు, కోస్టల్ మరపడవల సంఘం అధ్యక్షుడు -
విరామానికి ముందే ఫుల్స్టాప్!
చేపలకు కరువే కారణం ఎగుమతి కేంద్రాలూ మూత మత్స్యకారుల కలత విశాఖపట్నం, న్యూస్‌లైన్: మత్స్యకారులకు చేపల వేట నష్టాల బాటగా మారింది. తూర్పు తీరంలో చేపలకు కరువొచ్చి పడింది. ప్రాణాలొడ్డి నెలల తరబడి సంద్రంలో కష్టపడినా వారికి చేపల జాడే లేకుండా పోయింది. ఫలితంగా ఒక దఫా వేటకు రూ.20-30 వేల వరకు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మునుపెన్నడూ లేనంతగా ప్రస్తుత పరిస్థితులను చూసి మత్స్యకారులు, బోటు ఓనర్లు, మత్స్య కార్మికులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి 47 రోజుల పాటు చేపల వేటపై నిషేధం అమలవుతుంది. కానీ నిషేధం అమలుకు సుమారు నెలన్నర రోజుల ముందు నుంచే చేపల లభ్యత క్షీణించడం మొదలైంది. రానురాను మరింత దిగజారడంతో వేట గిట్టుబాటు కావడం లేదు. దీంతో గత్యంతరం లేక, నష్టాలను భరించలేక కొద్ది రోజుల నుంచి చేపల వేట మానేసి బోట్లను హార్బర్లో జట్టీలకే పరిమితం చేశారు. ఇప్పుడు విశాఖ ఫిషింగ్ హార్బర్ మరబోట్లతో నిండి ఉంది. విశాఖ నుంచి వేటకెళ్లే మరబోట్లు 750, 1500 వరకూ మోటారు బోట్లు వేట సాగిస్తుంటాయి. వీటిలో 90 శాతానికి పైగా బోట్లు వేటకు ఫుల్స్టాప్ పెట్టేసి హార్బర్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. వాస్తవానికి నెలన్నర రోజుల వేట విరామానికే మత్స్యకారులు కుటుం పోషణ సాగక అల్లాడుతుంటారు. అలాంటిది రెండు నెలలకు పైగానే చేపల వేట మానుకోవలసిన పరిస్థితి తలెత్తడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చేపల్లేకపోవడంతో హార్బర్లోని ఎగుమతి కేంద్రాలు కళతప్పాయి. విశాఖ హార్బర్లో పెద్ద ఎగుమతి కేంద్రాలు 24, చిన్నవి వందకు పైగా ఉన్నాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటే పెద్ద కేంద్రం పనిచేస్తుండగా, చిన్న ఎగుమతి కేంద్రాలు అర డజను మాత్రమే తెరచి ఉన్నాయి. ఫలితంగా వేట నిలిచిపోవడంతో చేపలు లేక, ఎగుమతి కేంద్రాలు తెరచుకోక ఫిషింగ్ హార్బర్ బోసిపోయింది. అలాగే హోల్‌సేల్, రిటైల్ చేపల మార్కెట్లలో కూడా అమ్మకాలు, కొనుగోళ్లు సన్నగిల్లాయి. మత్స్యకారులు వేటకు స్వస్తి చెప్పి ఇంజన్లు, వలలు, ప్రొపెల్లర్లను బోట్ల నుంచి తీసి ఇంటికి పట్టుకుపోతున్నారు. ఈ ఏడాది సుమారు రెండు నెలల పాటు తమకు గడ్డుకాలమేనని వాపోతున్నారు. సంక్రాంతి నుంచి ఇంతే.. సంక్రాంతి నుంచి చేపలవేట ఆశాజనకంగా లేదు. నెలల తరబడి వేట సాగించినా చేపలు పడడం లేదు. 30 శాతం బోట్లు వేటకెళితే అందులో మూడొంతులు బోట్లకు నష్టాలే వస్తున్నాయి. దీంతో బోటు ఓనర్లు సాహసం చేయలేకపోతున్నారు. బోట్లను హార్బర్‌కే పరిమితం చేస్తున్నారు. - పి.సి.అప్పారావు, అధ్యక్షుడు, ఏపీ మరపడవల సంఘం