ఆరంభంలోనే ‘అల’జడి!
- వాయుగుండంతో బోట్లు వెనక్కి
- విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో లంగరు
- నష్టాల్లో మత్స్యకారులు
సాక్షి, విశాఖపట్నం : రెండు నెలల విరామం తర్వాత చేపల వేటకెళ్లిన మత్స్యకారుల ఆశలపై వాయుగుండం నీళ్లు చల్లింది. ఈ ఏడాది ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14 అర్ధరాత్రి (61 రోజులు) వరకు ప్రభుత్వం చేపలవేటపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో 15వ తేదీ నుంచి వీరు వేటకు బయల్దేరారు. వెళ్లిన రెండు రోజులకే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్ర మేపీ వాయుగుండంగా బలపడింది. ఫలితంగా మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రాణభయంతో అప్పటికే సముద్రంలో వేట సాగిస్తున్న బోట్లలో సగానికిపైగా ఆగమేఘాలపై విశాఖ హార్బర్‌కు తీసుకొచ్చేశారు. మరికొన్ని మరపడవలు సమీపంలో ఉన్న ఒడిశాలోని గోపాల్‌పూర్, పారదీప్, శ్రీకాకుళం జిల్లా భావనపాడు తదితర రేవులకు చేర్చారు. విశాఖ నుంచి సుమారు 650 బోట్లు వేట సాగిస్తుంటాయి. నిషేధం పూర్తయ్యాక ఇందులో దాదాపు 400 బోట్లు వేటకెళ్లాయి. మిగిలినవి వెళ్లే లోగానే అల్పపీడన భయంతో హార్బర్‌లోనే నిలిచిపోయాయి. వాస్తవానికి నిషేధానికి రెండు నెలల ముందు నుంచి చేపలవేట ఆశాజనకంగా లేదు. దీంతో అప్పటికే మత్స్యకారులు బాగా నష్టపోయారు. వేట విరామం తర్వాత చేపల లభ్యత బాగుంటుందన్న ఆశతో వేటకెళ్లారు.
ఒకసారి వేటకు వెళ్తే 10 నుంచి 15 రోజుల పాటు సముద్రంలోనే ఉంటారు. ఇందుకు అవసరమైన డీజిల్, ఐస్, నిత్యావసర సరకులు వెరసి రూ.లక్షన్నరకు పైగా పెట్టుబడి పెట్టారు. సముద్రంలో వేట మొదలయ్యే సరికే వాయుగుండం హెచ్చరికలు వెలువడ్డాయి. దీంతో అర్ధంతరంగా వెనక్కి రావడం వల్ల ఒక్కో బోటుకు 300 నుంచి 400 లీటర్ల డీజిల్ వృథాగా ఖర్చయింది. నాలుగైదు టన్నుల ఐస్ కూడా కరిగిపోయింది. చేపలు లభ్యత లేకపోవడంతో రూ.40 నుంచి 50 వేల వరకు నష్టపోయామని బోటు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయుగుండం హెచ్చరికలతో వెనక్కి వచ్చేసిన బోట్లు విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో 300కు పైగా ఉన్నాయి. ఇవన్నీ మళ్లీ వేటకు బయల్దేరాలంటే మరో రెండు రోజులైనా పడుతుంది. అప్పుడు కొత్తగా ఐస్, రేషన్ వంటివి అవసరమని, మళ్లీ వాటిని సమకూర్చుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుందని వైశాఖి బోటు ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీహెచ్.సత్యనారాయణమూర్తి తెలిపారు.