వలలకు విరామం
అమలులోకి వచ్చిన వేట నిషేధం
జిల్లా వ్యాప్తంగా నిలిచిన 600 మెకనైజ్డ్,
3 వేల మోటరైజ్డ్ బోట్లు
జూన్ 14 అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి
లక్ష మంది ఉపాధికి ఆటంకం
కాకినాడ సిటీ : వలలు కడలికి దూరమయ్యాయి. వేట బోట్లు లంగరేసుకున్నాయి. నిత్యం కెరటాల దారుల్లో సాగుతూ, ఆ జలనిధి నుంచే జీవనోపాధిని పొందే ‘వేటగాళ్లు’ తీరానికే పరిమితమయ్యారు. సముద్ర జలాల్లో చేపలవేట నిషేధం గురువారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిషేధం జూన్ 14 అర్ధరాత్రి వరకూ.. 61 రోజులు అమలులో ఉంటుంది. నిషేధంతో తూర్పుగోదావరి జిల్లాలో తీర ప్రాంతాల్లోని బోట్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
వేసవి కాలంలో చేపలు, రొయ్యలతో పాటు ఇతర సముద్ర జీవులు గుడ్లు పెట్టే సమయం కావడంతో చేపలు వేటాడడం వల్ల ఆ గుడ్లు పగిలి మత్స్యసంపద అభివృద్ధికి విఘాతం వాటిల్లే ప్రమాదముంది. ఈ కారణంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేట నిషేధాన్ని అమలు చేస్తోంది. గతంలో 45 రోజుల పాటు ఉండే నిషేధాన్ని గత ఏడాది నుంచి 61 రోజులకు పెంచింది. సంప్రదాయ బోట్లతో వేట సాగిస్తే పెద్దగా నష్టం లేకపోవడంతో వాటికి మినహాయింపు ఉంది. అయితే మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిషేధకాలంలో సముద్రంలో చేపలవేటకు వెళ్లకూడదు. ఆ సమయంలో మత్స్యకారులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఒక్కొక్కరికి రూ.4 వేల వంతున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సారైనా పటిష్టంగా అమలయ్యేనా..?
జిల్లాలోని సుమారు 144 కిలోమీటర్ల సముద్ర తీరంలో సుమారు 600 మెకనైజ్డ్, మూడువేల వరకు మోటరైజ్డ్ బోట్లు సముద్రంలో చేపలవేట సాగిస్తున్నాయి. వీటిపై దాదాపు లక్ష మంది మత్స్యకారులు, ఇతర వర్గాలవారు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేట నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల మత్స్యకారుల నుంచి మత్స్యశాఖాధికారులు సొమ్ములు దండుకుని వేట నిషేధాన్ని నీరుగారుస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేలా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మత్స్యకార నాయకులు కోరుతున్నారు.