
తప్పిన ముప్పు
రేపల్లె
హమ్మయ్య.. జిల్లాకు హుదూద్ తుఫాను ముప్పు తప్పింది. ఎప్పుడేం జరుగుతుందోనని శనివారమంతా ఆందోళన చెందిన తీరప్రాంత వాసులు ఆదివారం మధ్యాహ్నం తుపాను విశాఖ సమీపాన తీరం దాటిందని, జిల్లాపై దాని ప్రభావం పెద్దగా ఉండదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం ఉదయం మాత్రం సముద్రతీరంలో అలలు ఎగసిపడ్డారుు. దీంతో నిజాంపట్నం హార్బర్‌లో లంగరేసిన బోట్లు ఏమవుతాయోనని మత్స్యకారులు ఆందోళన చెందారు. ఆకాశం మేఘావృతమై కొద్దిపాటి ఈదురుగాలులు వీచినా వర్షం లేకపోవడంతో ఊరట చెందారు. నిజాంపట్నం హార్బర్‌లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో రెండు రోజులపాటు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.
సూర్యలంక ప్రశాంతం.: బాపట్ల రూరల్: విశాఖ జిల్లాలో హుదూద్ తుఫాన్ తీరం దాటిన సమయంలో సూర్యలంక తీరం వద్ద 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్ శాఖాధికారులు తీర ప్రాంత గ్రామాల్లో మకాం వేసి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అగ్నిమాపక శాఖాధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తీరం వద్ద గస్తీ నిర్వహించారు. తీర ప్రాంతంలోకి ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం కావడంతో కొందరు పర్యాటకులు సూర్యలంక తీరం వద్దకు వచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో వెనుదిరిగారు.