వెళ్లేదెలా..
- నేటి నుంచి జన్మభూమి-మా ఊరు
- పల్లెల్లో ప్రతిఘటన ఎదురవుతుందని అధికారుల్లో భయం
- హుదూద్ దెబ్బతో జిల్లాలో మారిన పరిస్థితులు
- అంధకారంలో పల్లెలు..గందరగోళంగా నష్టం అంచనాలు
- గిట్టుబాటు ధర దక్కక మండిపడుతున్న రైతులు
జన్మభూమి-మావూరు మళ్లీ మొదలవుతోంది. గత నెల 2న ప్రారంభించి ఏడురోజులకే అర్ధంతరంగా వాయిదాపడిన ఈ కార్యక్రమాన్ని శనివారం నుంచి జిల్లాలో మళ్లీ చేపడుతున్నారు. పదిరోజుల పాటు గ్రామసభల అనంతరం పదకొండో రోజున ర్యాలీలు..మానవ హారాలతో అధికారులు ముగింపు పలకనున్నారు. పునర్నిర్మాణపనులు విశాఖలో జరిగినంతవే గంగా గ్రామీణంలో కానరాకపోవడంతో ప్రజల నుంచి ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయం అధికారులు, ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. పల్లెలకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి-మావూరు కార్యక్రమాన్ని టీడీపీ సర్కార్ అక్టోబర్-2న చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని యోచించింది. హుదూద్ కారణంగా అర్ధంతంగా 9వ తేదీనే ఆగిపోయింది. తుఫాన్ విధ్వంసంతో జిల్లా కకావికలమైంది. విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్ప కూలిపోయాయి. విశాఖతో పాటు పల్లెలన్నీ అంధకారంలో చిక్కుకుపోయాయి. తాగునీటికి లక్షలాది మంది అల్లాడిపోయారు. రోజులు , వారాలు గడుస్తున్నా జిల్లాలో విద్యుత్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేకపోయారు.
విశాఖ నగరానికి వెలుగులొచ్చినా.. కోతలతో శివారు ప్రాంత ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ నేటికి గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా జరగడంలేదు. అధికారికలెక్కల ప్రకారమే 4వేలకు పైగా పల్లెలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. వందలాది గ్రామాల్లో మంచి నీటి సరఫరా ఏ మాత్రం మెరుగుపడలేదు. అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. పునరావాస చర్యలతో పాటు తక్షణ సహాయం కింద ఉచితంగా పంపిణీ చేసిన బియ్యం, ఇతర నిత్యావసరాలు తెలుగుతమ్ముళ్లు టన్నుల కొద్ది పక్కదారిపట్టించారు.
ఇక నష్టం అంచనాల్లో జన్మభూమి కమిటీలకే ప్రాధాన్యం ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తలు తమకు నచ్చినవారికి ఒకలా.. నచ్చని వారికి మరోలా ఎన్యుమరేషన్ చేయిస్తూ అర్హుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నష్టం అంచనాల తయారీ దాదాపు పూర్తికావచ్చింది. ఈ జాబితాలను గ్రామసభల్లో ప్రదర్శించనున్నారు. ఒక పక్క విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో పునరుద్ధరించక పోవడం..మరో పక్క టీడీపీ నేతల కనుసన్నల్లో తయారయిన జాబితాలపై గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్టీఆర్ భరోసా పేరిట పెంచిన పింఛన్లు అందుకోవాలన్న గంపెడాశతో మొన్నటి జన్మభూమి సభలకు వచ్చి నిరాశతో వెనుదిరిగిన లక్షలాదిమంది నిర్భాగ్యులు రెండు నెలల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరితో పాటు పింఛన్ అర్హతకోల్పోయిన వేలాదిమంది కూడా ఈసభల్లో అధికారులను నిలదీసే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే రుణమాఫీ పుణ్యమాని బీమాకునోచుకోని లక్షలాది మంది రైతులు ఆశలను తుఫాన్ చిదిమేసింది.
కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ, పరిహారమైనా దక్కకపోతుందా అన్నఆశగా వారు ఎదురు చూస్తున్నారు. వీరంతా గ్రామసభల్లో తమ ఆవేదనను వెలిబుచ్చే అవకాశాలున్నాయి. మరొక పక్క ప్రధాన ప్రతిపక్షమైనవైఎస్సార్‌సీపీకూడా తుఫాన్ బాధితులు, రైతుల తరపున జన్మభూమి సభలను వేదికగా చేసుకుని అధికారులను నిలదీసే అవకాశాలున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సభల్లో పాల్గొనేందుకు అధికారులు విముఖత ప్రదర్శిస్తున్నారు.