విశాఖపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: ఏదైనా ఒక రాష్ట్రం, ప్రాంతం ఆర్థిక స్థితిని అంచనా వేయడంలో విద్యుత్ వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. విశ్వ నగరంగా మారిన విశాఖ ఆర్థిక రాజధానిగా బలంగా ఎదిగేలా విద్యుత్ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది.
భారీ పరిశ్రమలు, ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మాల్స్, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య కార్యకలాపాల కోసం నిరంతరం, నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా విశాఖలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోంది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగని విధంగా భూగర్భం నుంచి కేబుళ్ల ద్వారా విద్యుత్ పంపిణీ కానుంది. పారిశ్రామికవేత్తలు, పర్యాటకులను ఆకర్షించడంతోపాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాఖలో సిద్ధమవుతున్న ఆధునిక విద్యుత్ వ్యవస్థపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ..
తుపాన్లకు తల వంచదు..
రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ఎంతోమంది ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చి విశాఖలో స్థిరపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాలను అందిపుచ్చుకుంటూ పలువురు పారిశ్రామికవేత్తలు సాగర నగరిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పనులు కూడా మొదలయ్యాయి. తుపాన్లు లాంటి విపత్తుల సమయంలోనూ విశాఖ నగరం అంతటా విద్యుత్ వెలుగులకు ఆటంకం కలుగకుండా రూ.925 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.481.49 కోట్ల ఖర్చుతో 80,529 విద్యుత్ కనెక్షన్లను భూగర్భ విద్యుత్ వ్యవస్థలోకి తెచ్చారు. నగరం మొత్తం 2,449 కి.మీ. పొడవున అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయనున్నారు.
సముద్రాన్ని ఆనుకుని ఉన్న నగరం కావడంతో తుపాన్లు వచ్చినపుడు విద్యుత్ స్తంభాలు దెబ్బతింటున్నాయి. ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా పాత స్తంభాల స్థానంలో సెంట్రిఫ్యూగల్లీ కాస్ట్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ స్తంభాలు (స్పన్‌పోల్స్) ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 3,266 స్పన్‌పోల్స్ ఏర్పాటు కాగా అందుకోసం రూ.15.36 కోట్లను వెచ్చించారు. నష్టాల తగ్గింపు, ఆధునికీరణ పనులను సుమారు రూ.1,722.02 కోట్లతో చేపట్టారు. ఇందులో భాగంగా 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు 16 నిర్మించనున్నారు. గత మూడు నెలల్లో 421 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment