సాక్షి, పాయకరావుపేట: పవన్ కల్యాణ్ పర్యటనకు స్వాగత ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు అభిమానులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లా పాయకరావుపేటలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పాయకరావుపేటలో గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఉంది. ఈ పర్యటన కోసం పార్టీ నాయకులు, అభిమానులు రెండురోజుల నుంచి పట్టణంలో భారీ స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
స్థానిక నాగరాజుపేటకు చెందిన బీమవరపు శివ (31), తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని తారకరామనగర్‌కు చెందిన తోలెం నాగరాజు (28) తమ ఫొటోలతో కూడిన 30 అడుగుల పవన్ కల్యాణ్ ఫ్లెక్సీని పాయకరావుపేట సూర్యమహల్ సెంటర్‌లో కట్టేందుకు సిద్ధమయ్యారు. రోడ్డుపక్కన కర్రలుపాతి ఫ్లెక్సీ కడుతుండగా పైనుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మరణించారు.
వీరిద్దరూ తుని రైతు బజారులో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. మృతులు ఇద్దరికీ భార్యా పిల్లలు ఉన్నారు. మృతదేహాలను తుని ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ తెలిపారు.
కలచి వేసింది: పవన్‌కల్యాణ్
పాయకరావుపేటలో ఫ్లెక్సీలుకడుతూ ఇద్దరు అభిమానులు విద్యుత్‌షాక్‌కు గురై మరణించడం తనను కలచి వేసిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. నాగరాజు, శివ కుటుంబాలను స్వయంగా కలసి పార్టీ తరఫున ఆదుకుంటామని పేర్కొన్నారు. కాగా అభిమానుల దుర్మరణం నేపథ్యంలో పాయకరావుపేటలో గురువారం జరగాల్సిన పవన్ కల్యాణ్ పర్యటన వాయిదాపడిందని స్థానిక జనసేన పార్టీ నాయకుడు గెడ్డం బుజ్జి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment