ఇంకా అంధకారమే
- జిల్లాలో లక్షన్నర ఇళ్లు ఇంకా చీకట్లోనే
- విశాఖలో 23 వేల కనెక్షన్లకు అందని సరఫరా
- గుడ్డిదీపాల వెలుగులో నర్సీపట్నం
- పునరుద్ధరణకు మరో నాలుగైదు రోజులు
విశాఖపట్నం సిటీ: జిల్లాలో హుదూద్ సృష్టించిన చీకట్లు ఇంకా తొలిగిపోలేదు. దీపావళినాడు అందరి ఇళ్లల్లోనూ విద్యుత్ కాంతులు విరజిమ్మేలా ప్రయత్నిస్తున్నామని అధికారులు చేసిన ప్రకటన నాగులచవితి నాటికి కూడా సాధ్యమయ్యేలా కనబడడం లేదు. గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా వుంది. గుడ్డిదీపాల వెలుగులోనే గడుపుతున్నారు. కొవ్వొత్తుల కాంతితోనే కాలం నెట్టుకొస్తున్నారు.
జిల్లా అంతటా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరో నాలుగు ఐదు రోజులు పట్టేటట్టు కనిపిస్తోంది. తుపాను ముగిసి రెండు వారాలు దాటినా జిల్లాను అంధకారం విడచిపెట్టడం లేదు. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సైతం విద్యుత్ ఇంజినీర్లను పరుగులు పెట్టించి పునరుద్ధరణ పనులు చేయిస్తున్నా జిల్లాను పూర్తిగా వెలుగులతో నింపలేకపోతున్నారు. ఆదివారం నాటికి జిల్లా మొత్తంగా 1.67 లక్షల సర్వీసులకు కరెంట్ అందని దుస్థితి. విశాఖ మహానగరంలో అందరికీ విద్యుత్ అందించినట్టు చెప్పుకుంటున్నా...ఇప్పటికీ 23 వేల కనెక్షన్లకు విద్యుత్ సౌకర్యం లేదు.
చుట్టుపక్కల వారికి విద్యుత్ వెలుగులు వచ్చినా తమ ఇళ్లకే ఎందుకు రావడం లేదో తెలియక తెగ ఆందోళనచెందుతున్నారు. విశాఖ నగరంలోని వన్‌టౌన్ ఏరియాలో 110 కుటుంబాల వారు ఇప్పటికీ అంధకారంలో మగ్గుతున్నారు. కంచరపాలెం నుంచి గాజువాక పరిధిలో మరో 3 వేల మంది వినియోగదారుల ఇళ్లు చీకట్లోనే వున్నాయి. మధురవాడ పరిసర ప్రాంతాల్లో అయితే 20 వేల వినియోగదారులు నిత్యం విద్యుత్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతటా కరెంట్ ఇచ్చేశారని తమకెప్పుడు విద్యుత్ వస్తుందోనని ఎదురు చూస్తున్నారు.
అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు విద్యుత్ డివిజన్లలో 1.44 లక్షల కనెక్షన్లకు విద్యుత్ లేదు. జిల్లా వ్యాప్తంగా 11.31లక్షల మంది వినియోగదారులుంటే, ఆదివారం సాయంత్రానికి 9.64 లక్షల మందికి విద్యుత్‌ను పునరుద్ధరించగలిగారు. మిగిలిన 1.67 లక్షల కనెక్షన్‌దారులకు చీకట్లే గతయ్యాయి. వీరందరికీ సరఫరా పునరుద్ధరించాలంటే మరో నాలుగైదు రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయని విద్యుత్ వర్గాలే పేర్కొంటున్నాయి. ఈపీడీసీఎల్ సీఎండీ ఎంవి శేషగిరి బాబు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులను అప్రమత్తం చేశారు.