హుదూద్ టై
- రేపు మధ్యాహ్నం విశాఖ సమీపంలో తీరం దాటే అవకాశం
- జిల్లా యంత్రాంగం అప్రమత్తం
- కంట్రోల్ రూముల ఏర్పాటు
- రంగంలోకి భద్రతా బలగాలు
- నేడు విద్యా సంస్థలకు సెలవు
- పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
జిల్లాకు పెనుముప్పు పొంచి ఉంది. పెను తుపాను రూపంలో హుదూద్ శరవేగంగా దూసుకొస్తోంది. విశాఖకు సుమారు 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం మధ్యాహ్నానికి విశాఖ సమీపంలో తీరం దాటే అవకాశముంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యలకు సర్వసన్నద్ధంగా ఉంది. ఇప్పటికే నేవీ, ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు.
విశాఖ రూరల్ : హుదూద్ తీవ్ర పెనుతుపానుగా మారి మనవైపే దూసుకువస్తోంది. నగరం పరిసరాల్లోనే తీరం దాటుతుందనే వాతావరణ నిపుణుల సమాచారం కొంత కలవరపరుస్తోంది. వాస్తవానికి తుపానులు చాలాసార్లు ఏర్పడినా మనకు చేరువుగా తీరం దాటడం ఇదే ప్రప్రథమం. మునుపెన్నడూ ఇ లా విశాఖ వైపు దూసుకొచ్చిన సందర్భాలు లేవు. భౌగోళికంగా చుట్టూ ఉన్న కొండలు, సముద్ర అడుగు భాగంలో ఉన్న ప్రత్యేకమైన సహజ నిర్మాణం తుఫానును విశాఖ తీరానికి రాకుండా చేస్తున్నాయి. అనుకున్నట్టుగా హుదూద్ విశాఖ సమీపాన తీరం దాటితే చరిత్రే.
జిల్లాలో పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, పెదగంట్యా డ, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, భీమిలి మొత్తం 11 కోస్తా తీర మండలాలు ఉన్నాయి. వీటితో పాటు 16 మండలాలపై హుదూద్ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.వీటిలో 50 తీర ప్రాంత గ్రామాలకు తుపాను ప్రమాదం పొంచి ఉంది. 1967 నుంచి గత ఏడాది వరకు వచ్చిన తుపాన్లు ఏ ఒక్కటీ విశాఖ మీదుగా తీరం దాటలేదు. కానీ తుపాన్ల ధాటికి జిల్లా అతలాకుతలమైంది.
అటువంటిది ఈ హుదూద్ విశాఖ మీదుగా తీరం దాటుతుండడంతో ఎటువంటి ఉపద్రవాన్ని మోసుకొస్తుందోనని అందరిలో ఆందోళన నెలకొంది. తీరం దాటే సమయంలో గాలులు గంటకు 140 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. సముద్రం 1.5 మీటర్ ముందు వస్తుంది. ఈ తీవ్రతను ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రెండు కంపెనీల మిలటరీ బలగాలు కూడా జిల్లాకు వస్తున్నాయి. 30 నేవీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆరు ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లు జిల్లా నుంచి తుపాను ప్రభావిత మండలాలకు పయనమయ్యాయి.
నేడు పునరావాస కేంద్రాలకు తరలింపు
తుపాను ప్రభావిత, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు శనివారం ఉదయం నుంచి తరలిస్తారు. జిల్లాలో మొత్తం 125 పునరావాస కేంద్రాలను గుర్తిం చినప్పటికీ అవసరాన్ని బట్టి తొలి దశలో 40 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 10 మండలాల్లో 57 గ్రామాల నుంచి 89,776 మంది 40 పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి కేంద్రం వద్ద డిప్యూటీ తహశీల్దార్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఇప్పటికే ఈ కేంద్రాలకు బియ్యం, పప్పు, తాగునీరు, మందులు, ఇతర సదుపాయాలను సిద్ధం చేశారు. భారీ గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగే అవకాశాలు ఉండడంతో వెంటనే వాటిని తొలగించడానికి జేసీబీలు, క్రేన్‌లు సిద్ధంగా ఉంచారు.
భారీగా భద్రతా దళాలు :కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా దశలు జిల్లాకు చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2 కంపెనీల మిలటరీ బలగాలను జిల్లాకు పంపిస్తోంది. శనివారం ఉదయానికి 36 వాహనాల్లో ఇవి జిల్లాకు రానున్నాయి. వీటికి అచ్యుతాపురంలో చేశారు. 30 నేవీ బృందాలు తమ సామగ్రితో సిద్ధంగా ఉన్నాయి. ప్రతి బృందంలో అయిదుగురు ఈతగాళ్లు ఉన్నారు. వీటితో పాటు జిల్లాకు నాలుగు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పంపించినప్పటికీ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావించి మరో రెండు టీమ్‌లను జిల్లాకు కేటాయించారు. ఒక్కో బృందంలో 40 మంది సభ్యులు ఉండనున్నారు. ఈ టీమ్‌లు శనివారం ఉదయానికి 15 ప్రభావిత ప్రాంతాలకు చేరుకోనున్నాయి. వీటితో పాటు హైదరాబాద్ నుంచి రాష్ర్ట స్థాయి విపత్తు నిర్వహణ బృందం జిల్లాకు రానుంది. ఫైర్‌మెన్ టీమ్‌లను కూడా సిద్ధం చేశారు.
హెలికాప్టర్లు సిద్ధం : అత్యవసర పరిస్థితుల కోసం జిల్లాలో 5 నేవీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. వరదలప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వారికి ఆహారాన్ని అందించే విషయంలో వీటిని వినియోగించనున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మరో హెలికాప్టర్ కూడా హైదరాబాద్‌లో సిద్ధంగా ఉంది.
రవాణా వ్యవస్థపై ప్రభావం : హుదూద్ తుఫాన్ ప్రభావం రైళ్లపై పడింది. ఎలాంటి విపత్తు సంభవించినా తూర్పు కోస్తా రైల్వే సర్వసన్నద్దంగా వుందని ఆశాఖ ప్రకటించింది. అన్ని మేజర్ రైల్వే స్టేషన్‌లలో కంట్రోల్ గదులను ఏర్పాటు చేసింది. విశాఖ మీదుగా నడిచే రైళ్లను రద్దు చేసింది. విశాఖ నుంచి బయలుదేరే రైళ్లు కూడా రద్దయ్యాయి.ముందుజాగ్రత్తగా శనివారం కూడా కొన్నింటిని రద్దు చేసింది. పలు రైళ్లను ఖరగ్‌పూర్, ఝార్సుగుడ, రాయపూర్, నాగపూర్ మీదుగా దారిమళ్లించారు. 12న విశాఖపట్నం, విజయనగరం, రాయగడ, పలాస, కోరాపుట్‌ల నుంచి బయలుదేరాల్సిన అన్ని పాసిం జర్ రైళ్లను రద్దు చే శారు. 12న ఆర్టీసీ బస్సులను నడిపే విషయంపై ఆ రోజు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనునున్నారు.
రిజర్వాయర్లపై దృష్టి : ప్రస్తుతం జిల్లాలో 7 జలాశయాల్లో నీటి మట్టాలు 50 శాతం తక్కువగానే ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినా వెంటనే రిజర్వాయర్ల గేట్లు ఎత్తే అవకాశం లేదు. వాటి కింద గ్రామాలకు ప్రస్తుతానికి ఎటువంటి భయం లేదు. అయితే స్థానికంగా భారీ వర్షాలు పడితే ఇన్‌ఫ్లోను బట్టి నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
నేడు విద్యా సంస్థలకు సెలవు : పెను తుపాను నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సెలవు ప్రకటించారు. యాజమాన్యాలు ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని సూచించారు. తీరప్రాంతంలో ఉన్న పరిశ్రమలు శనివారం రాత్రి షిఫ్ట్ నిర్వహించకూడదని ఆయా సంస్థలకు, ప్రధానంగా బ్రాండిక్స్‌కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సిద్ధంగా ఉన్నాం
ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. ఈ నెల 12న భారీ వర్షాలతో పాటు గాలులు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. సముద్రం 1.5 మీటర్లు ముందు వస్తుంది. లోతట్టు ప్రాం తాల ప్రజలను శనివారం ఉదయం నుంచి 40 పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్ ఎఫ్, ఫైర్‌మెన్, పోలీసులు, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. ప్రజలు కూడా సహకరించాలి.
- డాక్టర్ ఎన్.యువరాజ్, కలెక్టర్
ఏర్పాట్లు ఇలా...
274 మంది ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు.
పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, ఆహారం, పాలు, బ్రెడ్ సరఫరాకు ఏర్పాట్లు చేశారు.
తుపాను కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడం వల్ల గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉండడంతో ప్రతి మండల కేంద్రంలో వీటిని సిద్ధంగా ఉంచుతున్నారు. 300 గ్యాస్ సిలిండర్లతో ఒక లారీ, 12 కిలోలీటర్లతో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పాలు ట్యాంకర్లు ప్రతి మండల కేంద్రంలో ఉండనున్నాయి.
జిల్లాలో అన్ని మండలాల్లో వైర్‌లెస్ సెట్లు రెడీ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన 14 శాటిలైట్ ఫోన్లలో 8 జిల్లాలో వినియోగించనున్నారు.
వర్షాలు, గాలులకు నెలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు 43 జేసీబీలను, 36 ట్రీ కటర్లను, 32 రంపాలను, 46 ట్రాక్టర్లను, 35 గన్నీ బ్యాగ్ సప్లయిర్లను సిద్ధం చేశారు.