ఆపదలో అన్నదాత
- పంట దిగుబడి పడిపోవడంతో రైతుల ఆక్రందన
- 83శాతానికి తగ్గిన సాగు విస్తీర్ణం
- తీవ్ర వర్షాభావమే కారణం
- వ్యవసాయశాఖ నివేదికలో వెల్లడి
- చుక్కల్ని తాకుతున్న బియ్యం, పప్పు ధాన్యాల ధరలు
సాక్షి, హైదరాబాద్: ఊరించి ఉస్సూరనిపించిన రుతుపవనాలు.. సరిగా కురవని వానలు.. ఎండిపోయిన బావులు.. వట్టిపోయిన బోర్లు.. అన్నీ కలసి అన్నదాతను నట్టేట ముంచేశాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఖరీఫ్ పంటలు రైతన్నను రోడ్డున పడేశాయి. నానాతిప్పలూ పడి, అప్పులూ తెచ్చి పెట్టిన పెట్టుబడులు గాలిలో కలిసిపోయాయి. ఎటూ తోచక కూలీలుగా మారిపోయే దుస్థితిని తెచ్చిపెట్టాయి.. రైతు కష్టం ఇటు సామాన్యుడికీ తిప్పలు తెచ్చిపెట్టింది. పంటల దిగుబడి తగ్గిపోవడంతో ఆహార ధాన్యాల ధరలు చుక్కలను తాకుతున్నాయి.
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీనికితోడు సాగు విస్తీర్ణం కూడా తగ్గడంతో 2014-15 ఖరీఫ్ ఆహార ధాన్యాల దిగుబడి భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యంతో పోల్చినా.. గత రెండేళ్లతో పోల్చినా ఈ సారి దిగుబడి, ఉత్పాదకత గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ పంటల దిగుబడులు దాదాపుగా రైతుల చేతుల్లోకి వచ్చాయి.
ఖరీఫ్ ఆలస్యం కారణంగా అక్కడక్కడా కొంతమేర పంట పూర్తి కావాల్సి ఉన్నా దాదాపు 95 శాతం వరకు పూర్తయినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు దిగుబడులపై ఆ శాఖ తయారు చేసిన నివేదిక ‘సాక్షి’కి అందింది. ఆ వివరాల ప్రకారం గతంలో వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఇది ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
31 శాతం తగ్గిన ఉత్పత్తి..
ఖరీఫ్‌లో ఆహారధాన్యాల మొత్తం ఉత్పత్తి లక్ష్యం 78.98 లక్షల టన్నులుగా వ్యవసాయశాఖ నిర్దేశించుకుంది. కానీ దిగుబడి మాత్రం 53.86 లక్షల టన్నుల వరకు మాత్రమే వచ్చింది. అంటే ఏకంగా 25.11 లక్షల టన్నుల (31.81%) ఉత్పత్తి తగ్గిపోయింది. ఇందులో వరి దిగుబడి లక్ష్యం 50.81 లక్షల టన్నులుకాగా... దిగుబడి 35.27 లక్షల టన్నులకే పరిమితమైంది. ఈ లెక్కన 15.54 లక్షల టన్నులు (30.59%) తగ్గింది. ఇక పప్పుధాన్యాల పరిస్థితీ అంతే. శనగ ఉత్పత్తి లక్ష్యం 47 వేల టన్నులుకాగా.. దిగుబడి 14 వేల టన్నులకే పరిమితమైంది.
సోయాబీన్ 4.7 లక్షల టన్నుల లక్ష్యానికి 4.12 లక్షల టన్నులు దిగుబడి అయింది. పంటలు వేసిన విస్తీర్ణం తగ్గిపోవడంతో పాటు ఉత్పాదకత తగ్గడం మూలంగానే దిగుబడి బాగా తగ్గిపోయింది. వర్షాలు సరిగా కురవకపోవడం, పంటలు ఎండిపోవడంతో ఉత్పాదకత తగ్గిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2012-13 ఖరీఫ్‌లో బియ్యం ఉత్పాదకత హెక్టారుకు 3,263 కేజీలు అయితే, 2013-14 ఖరీఫ్‌లో 3,227 కేజీలకు, ఈ ఖరీఫ్‌లో 3,072 కేజీలకు తగ్గిపోయింది. మిగతా పంటల ఉత్పాదకత పరిస్థితి కూడా అలాగే ఉంది. గతేడాదితో పోలిస్తే పత్తి దిగుబడి ఐదున్నర లక్షల టన్నులు తగ్గిపోవడం ఆందోళనకరమైన విషయం.
సాగు తగ్గడం, వర్షాభావమే కారణం: ఖరీఫ్‌లో రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, వర్షాలు సరిగా కురవకపోవడం, పంటల సాగు తగ్గిపోవడం వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గిపోవడానికి ప్రధాన కారణమని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. మహబూబ్‌నగర్ మినహా ఏ జిల్లాలోనూ ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం నమోదుకాలేదు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో 715 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాలి. కానీ ఈ సారి 498.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలోని మొత్తం 464 మండలాలకుగాను 339 మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. కేవలం 80 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలు సరిగా కురవని కారణంగా.. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇది కూడా సాగు విస్తీర్ణం పడిపోవడానికి కారణమయింది. ఖరీఫ్‌లో 20.60 లక్షల హెక్టార్లలో ఆహారధాన్యాల సాగు జరగాల్సి ఉండగా... 17.18 లక్షల హెక్టార్లకు (83%) పడిపోయింది. అందులో వరి 10.04 లక్షల హెకార్లలో సాగుకావాల్సి ఉండగా... 8.17 లక్షల హెక్టార్లకు (81%) తగ్గిపోయింది. పప్పుధాన్యాల సాగు 4.92 లక్షల హెకార్లకుగాను 3.45 లక్షల హెక్టార్లకు (70%) పడిపోయింది.
కూలీలుగా మారుతున్న రైతులు..
ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గడం, ఆహారధాన్యాల దిగుబడులు భారీగా పడిపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం, రబీలోనూ కరువు ఛాయలు కనిపిస్తుండడంతో... రాష్ట్రంలో అన్నదాతలు నిండా ఆందోళనలో మునిగిపోయారు. దిగుబడి తగ్గిపోవడంతో పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా అందలేదు. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఎటూతోచని పరిస్థితుల్లో కూలీలుగా మారుతున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల రైతులు ‘ఉపాధి’ హామీ పనులకు వెళుతున్నారు. మరోవైపు తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వలసలు పెరుగుతున్నాయి. ఏదో పనిచేసుకొని పొట్టపోసుకునేందుకు రైతులు పట్టణాలకు వస్తున్నారు. భవన నిర్మాణ కూలీలుగా, వాచ్‌మన్లుగా చేరుతున్నారు. కొందరు ఆటో రిక్షాలనూ నడుపుతున్నారు.
చుక్కల్ని తాకుతున్న ధరలు..
వరి, పప్పుధాన్యాల దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో వాటి ధరలు చుక్కలను తాకుతున్నాయి. గత నెలతో పోలిస్తే సూపర్‌ఫైన్ బియ్యం ధర కిలోకు రూ.5 నుంచి రూ. 10 వరకు పెరిగింది. సాధారణంగా రూ. 35 బియ్యం ధరలు రూ. 40కి.. రూ. 40 నుంచి రూ. 45 వరకు ఉన్న బియ్యం ధరలు రూ. 50 వరకు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక పప్పుల ధరలు కిలోకు రూ. పది నుంచి పదిహేను వరకు పెరిగాయి. రాబోయే రోజుల్లో మరిం తగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది.