మద్దతు మూరెడు..ఖర్చు బారెడు
- 2013-14కు వరి మద్దతు ధర పెంపు
- గత ఏడాది కంటే కేవలం రూ.60 పెంచిన కేంద్రం
- ధరల పెరుగుదల..ప్రకృతి విపత్తులతో అన్నదాతలు కుదేలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ధరల పెరుగుదల ఒకవైపు.. ప్రకృతి విపత్తులు మరోవైపు అన్నదాతలను నిలువునా ముంచుతున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు అరకొరగా చేయి విదిలిస్తూ చేతులు దులుపుకొంటున్నాయి. నష్టపరిహారాల మాటెలా ఉన్నా.. వరి మద్దతు ధర పెంపు విషయంలో కేంద్రం రైతులపై కనికరం చూపడం లేదు. దీంతో పంటల పెట్టుబడికి.. దిగుబడిపై వస్తున్న రాబడికి పొంతన లేకుండా పోతోంది.
ఈ ఏడాదైనా వరి మద్దతు ధరను కేంద్రం అధికంగా పెంచుతుందని రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. అయితే ఈ ఏడాది కూడా క్వింటాకు కేవలం రూ.60 వరకు మాత్రమే పెంచి రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో రబీ వరి కోతలు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించే పనిలో రైతులు నిమగ్నమై ఉన్నారు. వాతావరణం సహకరిస్తే ఖరీఫ్ సాగును సకాలంలో చేపట్టాలని భావిస్తున్నారు.
రూ.60 పెంపు
ఏటా ఖరీఫ్ సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు మే, జూన్ నెలల్లో కేంద్ర ప్రభుత్వం వరితో పాటు వివిధ రకాల పప్పుధాన్యాలకు మద్దతు ధర పెంచడం ఆనవాయితీ. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీ(సీఏసీపీ) వరి, గోధుమ, ఇతర పప్పుధాన్యాలకు ఎంత వరకు మద్దతు ధర పెంచాలనే దానిపై నివేదిక ఇస్తుంది. దీనికి అనుగుణంగా తొలుత వ్యవసాయ శాఖ, తరువాత ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నాక కేంద్రం మద్దతు ధర పెంచుతుంది.
అయితే గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రంలో పర్యటించిన సీఏసీపీ చైర్మన్ అశోక్ గులాటీ వరికి మూడేళ్ల పాటు మద్దతు ధర పెంచే అవకాశం లేదని ప్రకటించారు. ఇప్పటికే వరికి మద్దతు ధర ఎక్కువగా ఉన్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఎన్నికల సమయం కావడంతో కేంద్రం మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. 2013-2014కు సంబంధించి ధాన్యం సాధారణ రకం క్వింటాకు రూ.1310, గ్రేడ్-ఎకు రూ.1345గా పెంచారు. గత ఏడాది సాధారణ రకానికి రూ.1250, గ్రేడ్-ఎకు రూ.1280గా ఉండేది. గత ఏడాది కంటే కేవలం రూ.60, రూ.65 మాత్రమే పెంచడంతో రైతన్నలు నైరాశ్యంలోకి జారుకున్నారు.
ధరలు విపరీతం
పంటల సాగుకు రైతులు కష్టకష్టాలు పడుతున్నారు. విత్తనాల నుంచి కూలీల వరకు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా పెట్టుబడులు రెట్టింపవుతున్నాయి. కానీ దిగుబడిపై వస్తున్న రాబడి మాత్రం కనిపించడం లేదు. దీంతో అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. ఖరీఫ్ సగటు పెట్టుబడి ఎకరాకు రూ.12 వేలు నుంచి రూ.15 వేలు వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. దిగుబడి ఎకరాకు 26 నుంచి 28 బస్తాలు(ఒక్కో బస్తా 75 కేజీలు) వరకు ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. దీన్ని బట్టి చూస్తే రైతుకు ఎకరాకు రూ.2 వేలు నుంచి రూ.2500 మించి మిగిలే పరిస్థితి లేదు. మూడేళ్లుగా వరుసగా కరువు, వరదలు కారణంగా ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతింటూ వచ్చాయి.
దీంతో రైతులు లాభాలను మరిచిపోయి కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం. రుణ అర్హత కార్డులు ఉన్నా కూడా రుణాలు అందక.. అప్పులు చేసి వేసిన పంట చేతికందక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు ధర పెంపుపైనే రైతులు ఆశలు పెట్టుకోగా కేంద్రం ఊసూరుమనిపించింది.
స్వామినాథన్ సిఫార్సులపై ఆశలు
వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు గతంలో ఎన్‌డీఏ ప్రభుత్వ సారధి వాజ్‌పాయి నియమించిన స్వామినాథన్ కమిటీ సిఫార్సులను మోడీ నేతృత్వంలో ఏర్పడే ఈ ఎన్‌డీఏ ప్రభుత్వమైనా నెరవేరుస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ కమిటీ సిఫార్సుల్లో ప్రధానమైనది లాభసాటి ధర. పంట దిగుబడికి 50 శాతం లాభాన్ని కలిపి దాన్నే మద్దతు ధరగా ప్రకటించాలని స్వామినాథన్ సూచించారు. ఆ సిఫార్సులను యూపీఏ ప్రభుత్వ పక్కనపెట్టింది. ప్రస్తుతం ఎన్‌డీఏ తిరిగి అధికారం చేపట్టడంతో ఆ సిఫార్సులు అమలుకు నోచుకుంటాయో లేదో వేచి చూడాలి మరి.