ఇంటింటా చిటపట
- మండుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు
- మార్కెట్‌కు వెళ్లాలంటనే భయమేస్తోందంటున్న జనం
- 15% వరకూ పెరిగిన నూనెల ధరలు
- కుతకుతలాడుతున్న పప్పులు.. బియ్యం, చక్కెర, అల్లం, వెల్లుల్లి ధరలూ నింగికి..
- అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
- ఇప్పటికే పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో ప్రజల విలవిల
- ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్
పచ్చిమిర్చి రూ. 100 పైనే
కిలో టమాటా రూ. 90
బీరకాయ, చిక్కుడు రూ. 80పైనే
సాక్షి నెట్‌వర్క్: కూరగాయల ధరలు కొండెక్కాయి.. పప్పులు ఎంతకూ దిగిరానంటున్నాయి.. నూనెలు మంటెక్కుతున్నాయి.. బియ్యం ధరలు చుక్కలను తాకుతున్నాయి.. చక్కెర చేదెక్కిపోయింది.. సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది.. సగటు మనిషి జీవితం ఆగమాగమవుతోంది.. పేదలు, మధ్యతరగతి జనాలు విలవిల్లాడిపోతున్నారు. వంద రూపాయలు పట్టుకుని బజారుకు వెళితే ఒక్కరోజుకు సరిపడా సరుకులు కూడా రాక లబోదిబోమంటున్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో సతమతమవుతున్నవారు ధరల పెంపుతో నిండా ఆవేదనలో కూరుకుపోతున్నారు. ధరల మంటతో ఇలా పేదలు, మధ్య తరగతి అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. అటు కేంద్ర ప్రభుత్వం ‘అచ్ఛేదిన్ ఆగయే’ అంటూ డప్పు కొట్టుకుంటోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ వెలిగిపోతోందని ప్రకటనలు చేస్తోంది. నిత్యావసరాల ధరలు తగ్గించడంపై మాత్రం ఎవరికీ పట్టింపు లేదు.
కొనాలంటే భయం..
రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూరగాయల ధరలు 30 శాతానికిపైగా పెరగగా.. నిత్యావసరాల ధరలు 15 శాతం వరకు పెరిగాయి. టమాటా, పచ్చిమిర్చి వంటివి కిలో రూ.100కు చేరుకున్నాయి. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, కాకర, క్యాబేజీ వంటివి వాటితో పోటీ పడుతున్నాయి. పాలకూర, మెంతికూర, కొత్తిమీర, తోటకూర వంటి ఆకుకూరలన్నీ పది రూపాయలకు నాలుగైదు కట్టలు చొప్పున విక్రయించేవారు. ప్రస్తుతం పది రూపాయలకు రెండు కట్టలు కూడా ఇవ్వడం లేదు. మార్కెట్లకు వెళుతున్నవారు ఒక్కో కూరగాయలను పావుకిలోకు మించి కొనేందుకు సాహసించడం లేదు. ఇక మార్కెట్లకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలు, తోపుడు బండ్లు వంటి వాటిలో కిలోకు మరో పది ఇరవై రూపాయలు అదనంగా విక్రయిస్తున్నారు.
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి తదితర హోల్‌సేల్ మార్కెట్లతోపాటు మెహిదీపట్నం, ఎర్రగడ్డలోని రైతుబజార్లలోనూ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెల క్రితం హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.7కు లభించిన టమాటా ఇప్పుడు రూ.60 నుంచి రూ.70 మధ్య పలుకుతోంది. ఇది రిటైల్‌కు వచ్చే సరికి ప్రాంతాన్ని బట్టి రూ.90-100 వరకు విక్రయిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో వారానికి సరిపడా కూరగాయల కోసం నెల రోజుల కింద రూ.300 వరకు ఖర్చు కాగా.. ఇప్పుడది రూ.550-600కు చేరుకోవడం గమనార్హం. ఇక అప్పుడప్పుడూ చుక్కలనంటే ధరలతో భయపెట్టే ఉల్లిగడ్డ మాత్రం ఇప్పుడు తక్కువ ధరకే (కిలో రూ.15కే) దొరుకుతుండడం గమనార్హం.
ఈ జ్ఞాపకం మధురమే!
కందిపప్పు కిలోకు ఒక రూపాయి డెబ్బై పైసలు, నూనె కిలోకు నాలుగున్నర రూపాయలు.. భలే తక్కువ ధరలు కదా! దాదాపు 45 ఏళ్ల కింద 1971లో రాసిన సరుకుల చిట్టా ఇది. మధుర జ్ఞాపకాలు అంటూ ఈ చిత్రం ఫేస్‌బుక్‌లో చెక్కర్లు కొడుతోంది. అప్పట్లో నాలుగు రకాల పప్పులు ఎనిమిది కిలోలు, మూడు కిలోల నూనె, పావుకిలో నెయ్యి, రెండు కేజీల చక్కెర, 2 సబ్బులు, పోపు సామగ్రి అంతా కలిపి కేవలం 40 రూపాయల 75 పైసలకే ఇచ్చేశారు. నిజంగా ఇది మధుర జ్ఞాపకమే!
నిత్యావసరాలు భగ్గు
కూరగాయలే కాదు బియ్యం, పప్పులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. గత ఏడాది హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.110కు కిలోచొప్పున లభించిన కందిపప్పు ఇప్పుడు రూ.150 దాటింది. అది రిటైల్ దుకాణాలకు వచ్చే సరికి కిలో రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. లీటర్ వేరుశనగ నూనె రూ.100 నుంచి రూ.125కు, సన్‌ఫ్లవర్ నూనె రూ.80 నుంచి రూ.95కు పెరిగాయి. పేదలు వినియోగించే పామాయిల్ ధర కూడా లీటర్ రూ.65 నుంచి రూ.75కు పెరిగింది. బియ్యం, గోధుమలు వంటి వాటి ధరలూ 15 శాతం వరకూ పెరిగాయి. ఇక చింతపండు, అల్లం, వెల్లుల్లి, చక్కెర వంటి వాటి ధరలు కూడా బాగా పెరిగాయి. ధరల పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కందిపప్పు కొనడం మానేశామని, ఇప్పుడు టమాటా వంటి కూరగాయలను కూడా కొనలేని పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కల్పించుకుని నిత్యావసరాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తగ్గిన సాగు
కొన్నేళ్లుగా కొనసాగుతున్న తీవ్ర వర్షభావ పరిస్థితులుతో కూరగాయల సాగు తగ్గిపోయింది. భూగర్భజలాలూ అడుగంటడంతో నీళ్లు లేక చిన్న రైతులు కూడా కూరగాయలు పండించలేకపోతున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, మదనపల్లి, అనంతపురం ప్రాంతాల్లో కూరగాయలు సాగవుతుంటాయి. కానీ కరువు పరిస్థితుల కారణంగా పంటల సాగు తగ్గింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రైతులు అత్యధికంగా కూరగాయల సాగు చేసి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తుంటారు. వారిలో ఈసారి సగం మంది కూడా కూరగాయలు సాగు చేయకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో ఏటా దాదాపు 10 వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేసేవారు. ఈసారి 6 వేల ఎకరాల్లోనే వేశారు. అందులోనూ నీళ్లు లేక దిగుబడి బాగా తగ్గిపోయింది. ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో కూరగాయల పంటలకు భారీగా మచ్చల తెగులు సోకడంతో నష్టం కలిగింది.
మార్కెట్‌కు వెళ్లాలంటే భయమే..
‘‘పప్పులు, బియ్యం ధరలు బాగా పెరిగాయి. మార్కెట్‌కు వెళదామంటే భయమేస్తుంది. ధరలు ఇలా పెరిగితే పేదలు, సామాన్యుల పరిస్థితి ఏం కావాలి? ప్రభుత్వం వెంటనే ధరలు నియంత్రించాలి.’’
- బసయ్య, తాండూరు, రంగారెడ్డి జిల్లా
ఏం తినేటట్లు లేదు
‘‘కనీసం కూ రగాయలు కూడా కొనలేకపోతున్నాం. రెండు నెలల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నడూ లేనట్లు పచ్చిమిర్చి, టమాటా ధరలు కిలో 100 రూపాయలు దాటిపోయాయి. ఇలాగే ఉంటే ఏమీ కొనలేం. ఏమీ తినలేం..’’
- చింతల ఏసమ్మ, హైదరాబాద్