అంచనావేసినట్టే పెను తుపాను హుదూద్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరప్రాంతాల వాసులను భయకంపితుల్ని చేసింది. అది తీరం దాటుతుండగా 200 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులతో, దాంతోపాటు వచ్చిన కుండపోత వర్షాలతో ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా విశాఖ నగరం చిగురుటాకులా వణికాయి. గోదావరి జిల్లాల తీరప్రాంతాలు కూడా గణనీయంగా దెబ్బతిన్నాయి. ప్రచండమైన గాలులతో కరెంటు స్తంభాలన్నీ కూలిపోగా, అపార్టుమెంట్లు కూడా బీటలువారి అందులో నివాసముంటున్నవారు భయభ్రాంతులయ్యారు. ఏదో ఉన్మాదం ఆవహించినట్టు సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంపొడవునా పలుచోట్ల జనావాస ప్రాంతాలవైపు సముద్ర జలాలు చొచ్చుకొచ్చాయి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఆసరాగా నిలవడంతో... జాతీయ విపత్తు ఉపశమన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగడంతో ప్రాణనష్టం కనిష్ట స్థాయికి పరిమితమైంది. అయితే, ఆస్తి నష్టం మాత్రం అపారంగా ఉన్నట్టు వివిధ ప్రాంతాలనుంచి అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. హుదూద్ తీరందాటింది గనుక రానున్న 72 గంటలూ అధికార యంత్రాంగానికీ, ప్రజలకూ పరీక్షా సమయం. ఇంతవరకూ వచ్చిన కుండపోత వర్షాలను మించిన వర్షాలు కురుస్తాయంటున్నారు. కనుక అధికార యంత్రాంగం మరింత అప్రమత్తతతో మెలగాల్సి ఉంటుంది. రవాణా సదుపాయాలన్నీ దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో ఇదంతా కత్తి మీది సాము. ఈసారి తుపానుపై కేంద్ర ప్రభుత్వంకూడా చురుగ్గానే కదిలింది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడంతో పాటు యూపీలోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరపాల్సిన పర్యటనను కూడా వాయిదా వేసుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించడం బాగానే ఉన్నా ఇతర ప్రాంతాల ప్రజలకు సంబంధించి మరికొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఉదాహరణకు కుండపోత వర్షాలు, పెనుగాలుల కారణంగా ఎవరూ వెలుపలకు రావొద్దని అధికారులు ఇప్పుడు సూచిస్తున్నారుగానీ వారి ఇతర అవసరాల గురించి తీసుకున్న ముందు జాగ్రత్తలేమిటి? బయటికొచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చుగనుక కనీసం నాలుగు రోజులకు సరిపడా మంచినీరు, ఇతర నిత్యావసరాలు అందుబాటులో ఉంచుకోవాలని ముందే చెప్పి, చైతన్యపరిస్తే... అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసివుంటే ఉపయోగమయ్యేది. సముద్రం మీదికి వెళ్లొద్దని మత్స్యకారులకు చేసే హెచ్చరికల తరహాలోనే ఇవి కూడా ఉండాలి. ఒకపక్క నిమిషం కూడా తెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలకు తోడు మనిషిని సైతం విసిరిపారేసేంతగా పెనుగాలులు వీస్తుండటంతో వణుకుతున్న జనం చాలాచోట్ల కనీసం గొంతు తడుపుకోవడానికి నీళ్లులేక, కూరగాయలు అందుబాటులో లేక అవస్థలుపడుతున్నారని ఆ ప్రాంతాలనుంచి సమాచారం అందుతున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివారు బయటికెళ్లినా లభ్యమయ్యేది ఏమీ ఉండదు. గాలీ, వానా ఉపశమిస్తే తప్ప వారికి సాయం అందజేయడం అధికారులకు సాధ్యమయ్యేలా లేదు. ఇక ముందస్తు వైద్య సదుపాయాల పరిస్థితీ అదే. ఇక ఆ ప్రాంతాల్లోని తమ ఆప్తులు ఎలా ఉన్నారో తెలుసుకుందామని ప్రయత్నించే వారికి ఎమర్జెన్సీ నంబర్లంటూ ఇచ్చినవేమీ అక్కరకు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. పుష్కరకాలం క్రితం ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే తుపానులు ఇప్పుడు ఏడాది పొడవునా పలకరిస్తున్నాయి. వాయుగుండాలు, అకాల వర్షాలు సరేసరి. ఇలా వైపరీత్యాలు సర్వసాధారణంగా మారినప్పుడు సహాయ కార్యక్రమాలకు సంబంధించి కూడా శాశ్వత ప్రాతిపదికన తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సివుంది. ఈ యంత్రాంగం ఏడాది పొడవునా సంభవిస్తున్న తుపానులు... ఆ సందర్భంగా ముందుజాగ్రత్తల్లోగానీ, సహాయ చర్యల్లోగానీ వెల్లడైన లోటుపాట్లను అధ్యయనం చేస్తే మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి శాశ్వత యంత్రాంగం లేకపోబట్టే ఆంధ్రా యూనివర్సిటీలాంటి చోట కూడా హాస్టల్ విద్యార్థులు పస్తులతో గడపాల్సివచ్చిందని గుర్తుంచుకోవాలి.
ప్రతియేటా అక్టోబర్-నవంబర్ నెలల మధ్య వచ్చే తుపానులతో రైతాంగం కుదేలవుతున్నది. అదునుకు వర్షాలు పడక మొన్నటివరకూ రైతులు ఆదుర్దాపడ్డారు. చివరకు ఎంతో కొంత లోటుతో వానాకాలం ముగిసిందని ఊపిరిపీల్చుకునేంతలో హుదూద్ వచ్చిపడింది. ఈ పెనుతుపాను ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల వరి, చెరకు, జొన్న, పత్తి పంటలను, కూరగాయల సాగును దెబ్బతీసిందని అంటున్నారు. సెల్ టవర్లు ధ్వంసమై కమ్యూనికేషన్ల వ్యవస్థ కుప్పకూలడంతో, ముఖ్యంగా రాడార్ కేంద్రం సైతం పనిచేయకపోవడంతో జరిగిన నష్టాన్ని అంచనావేయడం అసాధ్యంగా మారిందని అధికార వర్గాలు చెబుతున్న మాట. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తుపాను కారణంగా వేలాది విద్యుత్ స్తంభాలు కూలడంతో ఆ ప్రాంతమంతా అంధకారం అలముకుంది. తుపాను పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది గనుక ఇప్పుడు జరిగిన నష్టంపై వెనువెంటనే సవివరమైన నివేదిక సమర్పించి తగిన సాయాన్ని పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషిచేయాలి. అలాగే, పంట నష్టపోయిన రైతాంగానికి సుదీర్ఘకాలం నిరీక్షిస్తే తప్ప పరిహారం దక్కడంలేదు. పైలిన్, హెలెన్, లెహర్, నీలం తుపానుల్లో కలిగిన నష్టానికి ఎంతో ఆలస్యంగా... అది కూడా అరకొరగా పరిహారం అందజేశారు. కౌలు రైతులదైతే అత్యంత దయనీయమైన స్థితి. పంట నష్టపోయినప్పుడు వారికి దక్కేదేమీ ఉండదు. విపత్తులు సంభవించినప్పుడు తీసుకునే చర్యలే కాదు... అనంతరకాలంలో చేపట్టాల్సిన ఇలాంటి చర్యల విషయంలో కూడా ప్రభుత్వాలు శ్రద్ధవహించాలి.
ప్రళయ భీకరం!
Published Sun, Oct 12 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement
Advertisement