పిడుగు పడగ
పిడుగుపాటుతో ఇండియాలో 79 మంది మృతి
గత ఏడాది జూన్‌లో మనదేశంలో భీకర తుపానుకు బీహార్ అస్తవ్యస్తం అయింది. మెరుపులు, పిడుగుల దాటికి 57 మంది ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌లో పదిమంది, ఉత్తర ప్రదేశ్‌లో ఆరుగురు పిడుగుల బారిన పడ్డారు. వారిలో ఎక్కువ మంది పొలాల్లో పని చేసుకునే వాళ్లు, పశువుల కాపర్లే. వర్షం కురుస్తున్నప్పుడు తల దాచుకోవడానికి ఏ చెట్టు కిందకో పరుగులు తీయడం అసంకల్పితంగా జరిగిపోతుంది. మెరుపులో విడుదలయ్యే విద్యుత్తు ఆ చెట్టునే ఆకర్షిస్తే ఇక అంతే.
రెండు రోజుల క్రితం రెండు రాష్ట్రాలలోని చాలా చోట్ల మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆనాడు వర్షం కంటే ఎక్కువగా ఉరుములు, మెరుపులే ప్రజలను భయపెట్టాయి. సాధారణంగా క్యుములోనింబస్ మేఘాలతో వర్షం కురిసినప్పుడు ఇలా మెరుపులు, ఉరుములతో వాతావరణం బీభత్సంగా మారిపోతుంది. ఇలాంటి సమయాల్లోనే పిడుగులు కూడా పడతాయి. ఇలా మెరుపులు, ఉరుములు, పిడుగుపడటం వంటివి ఎలా జరుగుతాయో చూద్దాం. మేఘాలలోని ధూళి కణాలలోని విద్యుదావేశాలు... అంటే ఛార్జ్‌డ్ పార్టికిల్స్ ఒకచోట పోగుపడతాయి. పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణాలన్నీ మేఘం పైవైపునకూ, నెగెటివ్ ఛార్జ్ ఉన్నవి కిందివైపునకు పోగుపడుతుంటాయి.
రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు వాటిలోని భిన్నమైన ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉన్నవి ఆకర్షించుకుంటాయి. దాంతో మేఘంలోనే రెండు విద్యుదావేశాల మధ్యనా, లేదా రెండు మేఘాలలో ఉన్న వేర్వేరు విద్యుదావేశాల మధ్యనా లేదంటే... కొన్నిసార్లు మేఘానికీ, భూమికీ మధ్యన జరిగే ఘర్షణతో చాలా స్వల్ప వ్యవధిలోనే అపరిమితమైన విద్యుచ్ఛక్తి వెలువడుతుంది. ఇదే మెరుపుగా మెరుస్తుంది. ఇంత అపరిమితమైన శక్తి పుట్టడం వల్ల పెద్ద శబ్దమూ వెలువడుతుంది. అదే ఉరుము. అయితే శబ్దవేగం కంటే కాంతి వేగం ఎక్కువ కావడం వల్ల మొదట మెరుపు కనిపించి, ఆ తర్వాత ఉరుము వినిపిస్తుంది. ఒక్కోసారి మేఘాల నుంచి ఆ విద్యుత్ భూమిలోకి కూడా ప్రవహిస్తుందని అనుకున్నాం కదా. అలా పయనించే విద్యుచ్ఛక్తే పిడుగు. ఒక్కోసారి వర్షం ఏదీ లేకుండా కూడా ఇలా మెరుపులు రావచ్చు. దాన్నే ‘డ్రై లైటెనింగ్’ అని కూడా అంటారు.
భూమ్మీదికి వచ్చే మెరుపుల వల్ల ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ భూమిలోకి ప్రవహించడం అన్నది ఒక్కోసారి పొడవాటి చెట్లు, పొడవైన స్తంభాల ద్వారా తేలిగ్గా జరిగిపోతుంది. అందుకే మెరుపులు మెరుస్తూ, ఉరుములు వినబడుతున్నప్పుడు చెట్ల కిందకీ, పెద్ద స్తంభాల దగ్గరికి వెళ్లవద్దని పెద్దలు చెబుతుంటారు. కొన్నిసార్లు మేఘాల నుంచి పాకే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ నిటారుగా నిలబడి ఉన్న మనుషుల ద్వారానే భూమిలోకి ప్రవేశిస్తే... ఆ వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడంటారు. కొన్ని సెకన్లలోపే ఆయుర్దాయం మాత్రమే ఉండే ఇలాంటి పిడుగులో దాదాపు 28,000 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. నీరు 100 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత వద్ద మరుగుతుందని తెలుసుకదా. దాన్ని బట్టి ఒక పిడుగులో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో ఊహించండి.
పిడుగు పడి ఎంపైర్ బిల్డింగ్ ధ్వంసం
చెట్లు సరే ఎత్తుగా ఉంటాయి కాబట్టి మెరుపును ఆకర్షించాయంటే అర్థం ఉంది. మరి భవనాల మీద ఎందుకు పడిందంటే... పిడుగులు పడిన ఆ భవనాలన్నీ ఆకాశాన్నంటేవే. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పిడుగుబారిన పడడానికి కారణం దాని ఎత్తే. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఇది 102 అంతస్థుల భవనం.
నార్వే లో పిడుగు పడి 323 ప్రాణాలు బలి
నార్వేలో పిడుగు ఏకంగా మూడు వందలకు పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఈ మెరుపు దాడి అటవీ ప్రాంతం మీద విరుచుకు పడడంతో ఆ మరణాలన్నీ వన్యప్రాణులకే పరిమితమయ్యాయి. అయితే ఇది ఆ దేశ చరిత్రలో అత్యంత పెద్ద ప్రకృతి విలయం. ఈ జంతువులన్నీ మారే వాతావరణానికి అనుగుణంగా ప్రదేశాలు మారుతుంటాయి. ఆ వెళ్లడం సమూహాలుగా కదులుతాయి. దాంతో ఒక్క పిడుగుకు అన్ని జంతువులు బలయ్యాయి.
రక్షించుకోండిలా...
మనం అద్దం దగ్గర దువ్వుకునే సమయంలో జాగ్రత్తగా గమనిస్తే మన వెంట్రుకలు బాగా పొడిగా ఉన్నప్పుడు... దువ్వెన దగ్గరికి తేగానే దువ్వెన వైపునకు ఆకర్షితమవుతాయి. దీనికి కారణం... వెంట్రుకలు, దువ్వెనల్లోని వేర్వేరు ఎలక్ట్రిక్ ఛార్జే. ఇలాగే ఆరుబయట ఉన్నప్పుడు వెంట్రుకలు నిటారుగా పైకి లేస్తున్న తీరును గమనించి కూడా సర్వైవల్ నిపుణులు కొందరు పిడుగుపాటు ప్రమాదాన్ని పసిగడతారు. మీరూ ఇలాంటి సూచనను గమనిస్తే వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలి. మెరుపులు, ఉరుములు కనిపించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరుబయట ఉన్నవారు లైటెనింగ్ కండక్టర్ వంటివి ఉన్న భవంతిలోకి వెళ్లాలి. అంతేగాని నిటారుగా ఉండే చెట్ల కిందికి, స్తంభాల దగ్గరికి వెళ్లకూడదు. బయట మెరుపులు మెరుస్తూ, ఉరుముల శబ్దం వినపడుతున్నప్పడు ప్లంబింగ్, వైరింగ్ వంటి పనులు చేయడం సరికాదు.
నీళ్లు విద్యుత్‌వాహకం. కాబట్టి పొడి నేల కంటే నీరుండే స్విమ్మింగ్‌పూల్ వంటివి పిడుగును త్వరగా ఆకర్షిస్తాయి. అందుకే నీళ్లున్న ప్రాంతానికి దగ్గర్లో ఉన్నవారిపైనా లేదా ఈదుతున్న వారిపైన పిడుగు పడే ప్రమాదం ఎక్కువ. అందుకే వర్షం సమయంలో ఈత లేదా నీటిలో ఆడటం వంటివి సరికాదు.
ఇంటిలోపల (ఇన్‌డోర్స్‌లో) ఉన్నవారు సైతం విద్యుత్ ప్రవహించడానికి అవకాశం ఉన్న వైర్లు కలిగిన ఫోన్ (ల్యాండ్‌లైన్ ఫోన్)లలో మాట్లాడటం, వైర్లతో ఉండే విద్యుత్ ఉపకరణాలతో పనిచేయడం (అంటే కంప్యూటర్లు వాడటం) సరికాదు. ఆ సమయంలో టీవీ లాంటి విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం కూడా మంచిదే. కార్‌లలో ప్రయాణం చేస్తున్న వారు... తమ దేహం విద్యుత్ ప్రవహించే లోహానికి తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి. విద్యుత్ ప్రవహించని సీటు వంటి ఇన్సులేటింగ్ మెటీరియల్‌కు మాత్రమే ఆని వుండేలా జాగ్రత్త పడాలి. అంతేగాని ఒళ్లు లోహానికి తాకకూడదు.
మెరుపుని తిప్పికొడదాం
►ఏటా దాదాపుగా 25 మిలియన్ల పిడుగులు పడుతుంటాయి.
►మెరుపు సెకనుకు 90 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
►ఒక్క మెరుపులో ఒక బిలియన్ వోల్టుల విద్యుత్తు ఉంటుంది.
►వర్షం పడిన చోట మాత్రమే కాకుండా చుట్టూ పదిమైళ్ల విస్తీర్ణంలో కూడా మెరుపులు మెరుస్తుంటాయి, పిడుగులు పడుతుంటాయి.
►మెరుపు పక్కన ఉండే గాలి 28 వేల సెంటీగ్రేడ్ వేడి ఉంటుంది. ఇది సూర్యుడి వేడికంటే ఐదురెట్లు ఎక్కువ.
►కరెంటు ప్లగ్‌తో కనెక్ట్ అయిన వస్తువులను ముట్టుకోవద్దు.
►గోడలను ఆనుకోవద్దు అంట్లు తోమకూడదు
►స్నానం చేయకూడదు
►యంత్రపరికరాలతో పని చేయకూడదు