నారాయణ్‌పేట్: తెల్లవారుజాము నుంచి చిరు జల్లులు.. రెక్కాడితే గాని డొక్కాడని అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన ఐదుగురు ఓ వ్యవసాయ పొలంలో కూలీకి వెళ్లారు.. పనులు చేస్తూ మధ్యాహ్నం కావడంతో అందరు కలిసి భోజనం చేశారు.. ఇంతలో ఉరుములు, మెరుపులతో వర్షం జోరందుకోవడంతో అక్కడే ఉన్న ఓ చెట్టు చెంతన చేరారు.. సరిగ్గా 1.20 గంటలు.. ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం.. అటుఇటు చూసే లోపే ముగ్గురు కుటుంబ పెద్దలను పిడుగు రూపంలో మృత్యువు కబళించింది.
పిడుగుపాటుకు బలైన వారు తెలుగు లక్ష్మణ్ణ (40), వాకిట ఈదన్న (52), తెలుగు పరమేష్ (27). గాయపడిన వారు కొండన్న, శివ. మృతుడు తెలుగు లక్ష్మణ్ణకు భార్య లక్ష్మితో పాటు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. మరో మృతుడు ఈదన్నకు భార్య మణెమ్మతో పాటు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. మృతుడు పరమేష్‌కు భార్య జయమ్మ (బంగారమ్మ)తో పాటు కూతురు ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఈ కుటుంబాలు ప్రస్తుతం దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మణెమ్మ, జయమ్మ కూలి పనులకెళ్తూ, లక్ష్మి పండ్లు అమ్ముకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఆస్పత్రుల ఖర్చులు తడిసిమోపెడు కాగా.. అప్పులతో కాలం వెళ్లదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment