Narayanpet District Latest News
-
జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి
నారాయణపేట రూరల్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 317 బాధితులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి న్యాయం చేయాలని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీఓ 317 సమస్యలపై దాటవేత వైఖరి పట్ల రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా తీవ్రంగా నిరసిస్తున్నారని, బాధితులందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారని గుర్తు చేశారు. భార్యాభర్తలు, ఆరోగ్య కారణాలతో బదిలీలకు జీఓలోనే అవకాశం ఉందని, స్థానికత కోల్పోయిన వారి గురించి నిర్ణయం చేయకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేయాలని ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నల్గొండలో జరిగే రాష్ట్ర మహాసభలకు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. కె.రవికుమార్, కె.శివరాములు, కె.బాలాజీ కోశాధికారి భీమయ్య,కృష్ణగౌడ్, రవికుమార్ పాల్గొన్నారు. -
పాఠాలు చెప్పడం లేదంట..
నా కూతురు మరికల్ కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. 15 రోజుల నుంచి ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో పాఠాలు చెప్పడంలేదంట. పరీక్షలకు సిద్ధం కావాల్సిన అంశాలను వివరించే వారు లేకపోతే ఎలా ఉతీర్ణత అవుతారు. తమ పిల్లలు ఉతీర్ణత కాకుంటే దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారు. ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. – చంద్రకళ, పదో తరగతి విద్యార్థిని తల్లి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి పదో తరగతి, ఇంటర్ విద్యార్థినుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమ్మెలో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి. వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతున్న సమయంలో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సమ్మె ఇలాగే కొనసాగితే విద్యార్థులు త్రీవంగా నష్టపోయే అవకాశం ఉంది. – రాంరెడ్డి, పదో తరగతి విద్యార్థిని తండ్రి, పూసల్‌పహాడ్ నష్టం కలగకుండా చూస్తాం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రస్తుతం పదో తరగతి, ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఉన్న వనరులను ఉపయోగించుకుంటాం. కేజీబీవీలో అందుబాటులో ఉన్న డిజిటల్ తరగతులను నిర్వహిస్తాం. ఇందుకుగాను ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ఎంఈఓలను ఆదేశించడం జరిగింది. విద్యార్థులకు నష్టం కలగకుండా చూస్తాం. – గోవిందరాజులు, డీఈఓ -
దక్షిణ భారతదేశ సైన్స్మేళాలో..: గణిత ఉపాధ్యాయురాలు అనిత
మల్దకల్ మండలం అమరవాయి జెడ్పీహెచ్ఎస్ గణిత ఉపాధ్యాయురాలు అనిత బోధనలో మేటిగా నిలుస్తున్నారు. గణితంలోని అంశాలు అమూర్త భావనలు అనగా మూర్త వస్తువులతో బోధించడంతో విద్యార్థులు గణితశాస్త్రంపై భయం లేకుండా విద్యనభ్యసిస్తున్నారు. వస్తువుల రూపంలో ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. వీటితో పాటు గణితంలోని ఆకారాలను సులువుగా నేర్చుకునేందుకు డిజిటల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. 2020 చైన్నెలోని సత్యభామ యూనివర్సిటీలో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఉపాధ్యాయ విభాగంలో పాల్గొని ప్రతిభచాటారు. దక్షిణ భారతదేశ సైన్స్మేళాలో జిల్లా నుంచి పాల్గొన్న ఏకై క ఉపాధ్యాయురాలిగా నిలిచారు. -
మ్యాథ్స్ పార్క్‌తో సులభంగా..
సులభంగా గణిత ప్రక్రియలు నేర్చుకునేందుకు వీలుగా మహబూబ్‌నగర్‌లోని నాగార్జున పాఠశాల విద్యార్థులు అలేఖ్య, హిమశ్రీలు మ్యాథ్స్ పార్కులు ఆవిష్కరించారు. పార్కులో ఆడుకుంటూ అక్కడ ఉండే ఒక్కో ఆట వస్తువుతో ఒక్కో విధమైన గణిత ప్రక్రియ ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా వివిధ గణిత సూత్రాలు, ప్రక్రియలు, చతుర్విత ప్రక్రియలు, లెక్కలు నేర్చుకునేందుకు అవకాశం ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. దీని ఆధారంగా పార్క్‌లను ఏర్పాటు చేస్తే విద్యార్థులు మర్చిపోకుండా గణితం చేర్చుకుంటారని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలో విద్యార్థులు ప్రతిభచాటారు. -
ఫిన్లాండ్ స్ఫూర్తితో విద్యార్థులకు బోధన..
విద్యార్థులకు ఒత్తిడి లేకుండా, సులువుగా విద్యను అందించడంలో ఫిన్లాండ్ దేశం ముందువరుసలో ఉంది. అక్కడ మాథ్స్, సైన్స్ విద్యాబోధనలో అమలవుతున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడి విద్యార్థుల కోసం మాథ్స్ ల్యాబ్ రూపొందించాను. గణితం పట్ల విద్యార్థుల్లో భయం పోగెట్టేలా సులువైన విధానంలో బోధిస్తున్నాను. ఈ విధానంలో విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతుండటం ఆనందాన్ని కలిగిస్తోంది. – కూన శ్రీనివాసులు, గణిత ఉపాధ్యాయుడు, మార్చాల కల్వకుర్తి మండలం మార్చాల ప్రభుత్వ పాఠశాలలో ఉమ్మడి జిల్లాలోనే తొలిసారిగా మ్యాథమెటికల్ ల్యాబ్ ఏర్పాటైంది. సైన్స్‌లో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ తరహాలోనే గణితానికి సంబంధించిన ఆవిష్కరణలకు ఈ ల్యాబ్ ప్రాక్టికల్‌గా విద్యార్థులు అనుభూతి పొందేందుకు వీలు కలుగనుంది. గణితంలో క్లిష్టమైన అంశాలను అతి సులువుగా విద్యార్థులకు బోధించేందుకు వీలుగా ఈ ల్యాబ్‌ను ఉపాధ్యాయుడు కూన శ్రీనివాసులు రూపొందించారు. 85 రకాల క్లిష్టమైన అంశాలను ఈ ల్యాబ్‌లో పొందుపర్చారు. ఒక్కో కాన్సెప్ట్‌ను పది నిమిషాల చొప్పున వివరించడం ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు అవసరమైన మ్యాథమెటికల్ కాన్సెప్ట్‌లు ఇందులో ఉంటాయి. టేబుల్స్, అల్గారిథమ్స్, అర్థమెటిక్ అంశాలను అతి సులువుగా విద్యార్థులకు బోధించేలా మ్యాథ్స్ ల్యాబ్‌ను రూపొందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ పొందిన శ్రీనివాసులు విద్యార్థులకు వినూత్న పద్ధతిలో గణితం బోధిస్తున్నారు. మార్చాలలోమ్యాథ్స్ రూం -
సమ్మెలో గురువులు.. సాగని చదువులు
మరికల్: సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో కేజీబీవీ పాఠశాలల్లో చదువులు సాగడంలేదు. దీనికితోడు శనివారం జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థినుల తల్లిదండ్రుల సమావేశం ఉండగా, ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ఈ సమావేశాలు రద్దు చేశారు. 15 రోజుల నుంచి కేజీబీవీలో పాఠాలు చేప్పే వారు లేక ఏం చదవాలో అర్థం కావడం లేదంటూ విద్యార్థినులు వారి తల్లిదండ్రుల ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల సమయం సమీపిస్తున్న వేళ సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెకు దిగ్గడంతో కేజీబీవీల్లోని విద్యార్థినుల చదువులు అయోమయంలో పడ్డాయి. అంతేకాకుండా బాలికలకు రక్షణ, అల్పాహారం భోజనం అందించడానికి ఇద్దరు మినహా మిగతావరంతా సమ్మెలో ఉండడం గమనార్హం. జిల్లాలో మొత్తం 450 మంది ఉద్యోగులు నారాయణపేటలో శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరసనలు చేస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వారంతా వాపోతున్నారు. నిరవదిక సమ్మె ఇప్పటికే 15 రోజులు దాటింది. విద్యార్థినుల భవిష్యత్‌పై ప్రభావం ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలవుతాయి. పెండింగ్ సిలబస్ పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఇదే కీలక సమయం. కానీ, చదువు చెప్పే వారే సమ్మెలో ఉండడంతో విద్యార్థుల భవిష్యత్‌పై సమ్మె ప్రభావం పడబోతోంది. ఇక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులకు చెప్పాలనుకున్నా మండల వనరుల కేంద్రాలు సైతం మూత పడటంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయం మాటేమిటి..? సమ్మె నేపథ్యంలో ఎంఈఓలు కేజీబీవీలను సందర్శిస్తున్నారు. బాగా చదువుకోవాలని వార్షిక పరీక్షల్లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని హితబోద చేస్తున్నారు. ప్రత్యామ్నాయం గురించి మాత్రం ఆలోచించడం లేదు. కేజీబీవీలకు దగ్గరలోని పాఠశాలల ఉపాధ్యాయులను బోధనకు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో విద్యార్థినులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కేజీబీవీల్లో నిలిచిన విద్యా బోధన ముంచుకొస్తున్న పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలు.. ఇంకా పూర్తికాని సిలబస్ ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు -
గణితంలో ఘనులు
అంకెలతో ఆట.. సూత్రాలతో లెక్కల వేట ● రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు.. గుర్తింపు ● కల్వకుర్తి మండలం మార్చాల ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ రూం ● విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ప్రాజెక్టులు ● నేడు జాతీయ గణిత దినోత్సవం మార్కులు, గ్రేడ్లు, ర్యాంకులే లక్ష్యం కాకుండా, నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేసేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు పలువురు ఉపాధ్యాయులు. విద్యార్థులు క్లిష్టమైన సబ్జెక్టుగా భావించే గణితాన్ని సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అతి సులభంగాగణితంలో మెళకువలను నేర్పిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ లెక్కలపై ఉన్న భయాన్ని పోగొడుతున్నారు. ఆదివారం గణిత దినోత్సవం (శ్రీనివాస రామానుజన్ జయంతి) సందర్భంగా ఈ వారం సండే స్పెషల్.. – సాక్షి, నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/ గద్వాల టౌన్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ మార్చాల జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఐశ్వర ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ పోటీలకు ఎంపికై ంది. అతి క్లిష్టమైన ‘మ్యాథమెటికల్ మోడలింగ్ అర్థమెటిక్ టు అల్గారిథమ్ వయా ఆల్జిబ్రా’ అనే అంశాన్ని ప్రదర్శించింది. క్వార్ర్డాటిక్ ఈక్వేషన్‌ను పరిష్కరించేందుకు ఇప్పటివరకు మూడు మెథడ్లు ఉండగా, ఐశ్వర్య నాలుగో మెథడ్‌ను తయారు చేయడం విశేషం. మ్యాథ్స్ విభాగంలో ప్రతిభ చూపినందుకు మార్చాల పాఠశాలకు చెందిన ఐశ్వర్యతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్(ఎన్‌ఎన్‌ఎంఎస్) నుంచి ఏటా రూ.12,500 చొప్పున స్కాలర్షిప్ను అందుకుంటున్నారు. ఐదేళ్లకాలం పాటు ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు అందుతుంది. ఉపకార వేతనాలు పొందేలా.. పాలమూరులోని మోడల్ బేసిక్ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు ఫసియొద్దీన్ ఎన్ఎంఎంఎస్కు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. ఫలితంగా గతేడాది ఏకంగా 13 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు. ఈ విధంగా ఉపాధ్యాయుడు ఫసియొద్దీన్ అందరి మన్ననలు పొందుతున్నారు. భవిష్యత్‌లో మరిన్ని తరగతులు నిర్వహించి విద్యార్థులు స్కాలర్షిప్కు ఎంపికయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. -
24 గంటలు నీటి సరఫరా నిలిపివేత
నారాయణపేట: మరికల్ నుంచి నారాయణపేట వెళ్లే దారిలో కొత్తతండా వద్ద మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అయ్యిందని, దీని మరమ్మతు నిమిత్తం ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 వరకు నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని మిషన్ భగీరథ గ్రిడ్ అధికారి పుట్ట వెంకట్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మన్యంకొండ నీటి శుద్ధి కేంద్రం నుంచి నీటి సరఫరా అయ్యే దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ ఆసెంబ్లీ నియోజకవర్గాలలోని 245 గ్రామాల్లో నీటి సరఫరా ఉండదని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. నేటినుంచి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు కోస్గి: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నేటినుంచి 26వరకు జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు కొనసాగనున్నాయి. ఈ మేరకు అండర్–19 విభాగంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో బాలురకు నిర్వహిస్తున్న ఈ పోటీలకు అన్ని రాష్ట్రాల నుంచి 550మంది క్రీడాకారులు, 100మంది కోచ్ మేనేజర్లు టోర్నమెంట్ ఆర్గనైజర్ బాల్‌రాజ్ తెలిపారు. ఆయా రాష్ట్రాల కోచ్‌లు తమ క్రీడాకారుల వివరాలు నమోదు చేయిస్తున్నారు. ఏర్పాట్లను తహసీల్దార్ శ్రీనివాసులు పరిశీలించారు. రేపు జాతీయ రైతు దినోత్సవం నారాయణపేట: గ్రామభారతి, జ్ఞాననేత్ర నేచర్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ సహకారంతో జాతీయ రైతు దినోత్సవాన్ని సోమవారం ఉదయం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు శనివారం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌చే ప్రకృతి సేద్యం చేస్తున్న కొంత మంది రైతులను సన్మానించడం, ప్రకృతి సేద్య నిపుణుల సలహాలు అందించడం, రైతుల అనుభవాలు పంచుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రకృతి సేద్య రైతులతో పాటు ఈ సేద్యం పై ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి , శ్రీహరి, ప్రకృతి సేద్య నిపుణులు విజయరాం, వక్త మదన్ గుప్తా హాజరవుతున్నట్లు తెలిపారు. పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే మరికల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సర్వే పకడ్బందీగా చేపట్టాలని.. అనంతరం వారి ఎంపిక జరుగుతుందని జిల్లా అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలోని మరికల్, వెంకటాపూర్ గ్రామాల్లో శనివారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. సిబ్బందికి నిర్దేశించిన సమయంలోపు సర్వేను పూర్తి చేసి వివరాలను అందజేయాలని అధికారులకు సూచించారు కార్యక్రమంలో ఎంపీడీఓ కొండన్న, ఎపీఓ పావని పాల్గొన్నారు. నేడు ఆర్ఎల్డీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు వనపర్తి విద్యావిభాగం: వనపర్తి ఆర్ఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఆదివారం నర్సింగాయపల్లి సమీపంలో నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్, స్వర్ణోత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు రఘునందన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల ప్రారంభం 1974 నుంచి ఇప్పటి వరకు పనిచేసిన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, కళాశాలలో చదివిన విద్యార్థులు అందరిని కార్యక్రమానికి ఆహ్వానించామని పేర్కొన్నారు. కళాశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్న అందరూ కలిసి కళాశాలకు గొప్ప వైభవం తీసుకొచ్చే ఉద్దేశంతో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని.. ముఖ్యఅతిథులుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ నాగార్జున, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొంటారని పేర్కొన్నారు. శనైశ్వరుడికి శాస్త్రోక్తంగా పూజలు బిజినేపల్లి: నందివడ్డెమాన్‌లో శనివారం జైష్ట్యాదేవి సమేత శనైశ్వరుడికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో గోత్రనామార్చన చేశారు. శివాలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. -
గణిత పాఠ్యపుస్తక రచయితగా..
గణితం అంటే చాలామంది విద్యార్థులకు భయం. కానీ, అందులోని సూత్రాలు తెలిస్తే అన్ని సబ్జెక్టులకంటే ఎంతో సులువైనదని చెబుతున్నారు గణిత బోధకుడు వరద సుందర్‌రెడ్డి. ఉండవెల్లి మండలం తక్కశిల జెడ్పీహెచ్ఎస్లో గణిత బోధకుడిగా పనిచేస్తున్నారు. 22ఏళ్ల సర్వీసులో మొదటి ఏడాది తప్ప మిగిలిన 21 సంవత్సరాల నుంచి గణిత సబ్జెక్టులో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాలేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న 6, 7, 8, 9వ తరగతి గణిత పాఠ్యపుస్తక రచయితగా సేవలు అందిస్తున్నారు. ఉమ్మడిజిల్లాలో ఉన్న ఏకై క పాఠ్య పుస్తక రచయిత ఈయనే కావడం గర్వకారణం. సృజనాత్మకంగా, ప్రయోగాత్మకంగా, వినూత్న బోధన పద్ధతులతో విద్యార్థులను గణితం వైపు ఆకర్షించేలా బోధన అందిస్తు మేటిగా నిలుస్తున్నారు. -
అబాకస్‌లో ప్రపంచ రికార్డు
నారాయణపేట రూరల్: పెన్ను, పేపర్ లేకుండా కేవలం మెదడుకు పని చెప్పి.. గణితంలో సమాధానాలు చెప్పే విధానమైన అబాకస్‌లో అతివేగంగా అత్యధిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ప్రపంచ రికార్డు సాధించారు నారాయణపేట చిన్నారులు. స్థానిక సింగార్‌బేస్ వీధిలో శిక్షకురాలు రీతు ప్రైవేటుగా కొద్దిరోజులుగా అబాకస్‌లో పిల్లలకు శిక్షణ ఇస్తుంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం పట్టణానికి చెందిన చరణ్, వైభవ్, ప్రణవి ఐరేంజ్ సంస్థ వారు 2023లో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీలకు దరఖాస్తు చేసుకోగా పరీక్షలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఆయా విద్యార్థులకు సంబంధించిన వీడియోలను వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేయగా, నిర్వాహకులు చూసి ఆన్లైన్లో లైవ్‌గా వీరి ప్రతిభను పరిశీలించారు. అవాకై ్కన వారు హైదరాబాద్ కార్యాలయానికి పిలిపించి పది డిజిట్లకు సంబంధించిన వంద ప్రశ్నలను వేయగా పెన్ను, పేపర్ లేకుండా ఒక్క నిమిషంలోనే సమాధానాలు చెప్పారు. దీంతో వారిని అబాకస్‌లో ఆర్థమేటిక్ క్యాలిక్యులేషన్ ప్రక్రియలో ప్రపంచ రికార్డు సాధించినట్లు ప్రకటించి ప్రశంసాపత్రాలు అందించారు. దీనిపై శిక్షకురాలు రీతు మాట్లాడుతూ.. గణితంపై భయాన్ని పోగొట్టేందుకు తాను తర్ఫీదు పొందిన అబాకస్‌ను పట్టణంలోని చిన్నారులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికి వందల మంది విద్యార్థులు నేర్చుకున్నారని, మున్ముందు మరింత మందికి అందించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. -
నెరవేరిన దేవరకద్ర ప్రజల కల
ఐదు దశాబ్దాలుగా మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న దేవరకద్రకు మున్సిపాలిటీ హోదా లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్న పట్టణాలు కూడా మున్సిపాలిటీలుగా మారాయి. కానీ స్థానిక పాలకుల నిర్లక్ష్యం వల్ల దేవరకద్రకు ఆ అవకాశం దక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మున్సిపాలిటీగా మార్చడానికి నాలుగు గ్రామాలతో కలిపి ప్రతిపాదనలు చేశారు. అయితే ఇది కార్యరూపం దాల్చకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు చేయడంతో దేవరకద్రకు మున్సిపాలిటీ హోదా దక్కింది. -
కృష్ణమ్మ తగ్గుముఖం
కొల్లాపూర్: కృష్ణానదిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నెలరోజుల కనిష్టానికి నీటిమట్టం చేరుకుంది. జనవరి నెలాఖరులో ఉండే లెవల్‌కు డిసెంబర్లోనే శ్రీశైలం బ్యాక్‌వాటర్ తగ్గిపోయింది. రాయలసీమలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులకు విరివిగా నీటిని తరలిస్తుండటంతో పాటు, శ్రీశైలం డ్యాం వద్ద విద్యుదుత్పత్తి, కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టడంతో కృష్ణానదిలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది. ఈ ఏడాది 23 టీఎంసీలు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు కేఆర్ఎంబీ అనుమతులు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 23 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ప్రాజెక్టులోని మూడు మోటార్ల ద్వారా ఎత్తిపోతలు సాగుతున్నాయి. రోజూ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. మరో 17 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు వెసులుబాటు ఉన్నప్పటికీ చాలినన్ని రిజర్వాయర్లు లేకపోవడంతో నీటి ఎత్తిపోతలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రిజర్వాయర్ల కొరత.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు వనపర్తి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన కేఎల్ఐ ప్రాజెక్టు కింద నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం కేవలం 4 టీఎంసీలు మాత్రమే. రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండడంతో నియోజకవర్గాల్లోని చెరువులకు కూడా కృష్ణానది నీటిని కాల్వల ద్వారా మళ్లిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో నీటి కేటాయింపులను వినియోగించుకోవాలన్నా.. వేసవిలో నీటి కష్టాలు రాకుండా ఉండాలన్నా అదనపు రిజర్వాయర్ల నిర్మాణమే పరిష్కారమని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వేగంగా ‘వెనక్కి’..ఆగస్టు నెలలో వరదలు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఫుల్‌గేజ్ 885 అడుగులు. ఆగస్టు నెలలో కృష్ణానదికి వరదలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ నెలాఖరు నాటికి శ్రీశైలం డ్యాం నిండింది. వరదల సమయం నుంచి కేఎల్ఐ ప్రాజెక్టులో ఎత్తిపోతలు చేపట్టారు. సాగునీటి అవసరాలతోపాటు మిషన్ భగీరథ స్కీం నిర్వహణ కోసం రోజూ 0.2 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 863 అడుగుల ఎత్తులో బ్యాక్‌వాటర్ ఉంది. 825 అడుగుల వరకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకోవచ్చు. అయితే గతంలో కంటే ఈసారి వేగంగా బ్యాక్‌వాటర్ నీటిమట్టం తగ్గుతోంది. ఏపీలోని పోతిరెడ్డిపాడు, హంద్రినీవా, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ స్థాయిలో నీటిని ఎత్తిపోయడమే ఇందుకు ప్రధాన కారణం. ఉన్నతాధికారులకు సమాచారం కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు నిండుగా ఉన్నాయి. ఎల్లూరు రిజర్వాయర్ ద్వారా మిషన్ భగీరథ స్కీంకు నీళ్లు అందిస్తున్నాం. రిజర్వాయర్‌లో నీళ్లు తగ్గిన వెంటనే మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటివరకు 23 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. ప్రస్తుతం ఎల్లూరు లిఫ్టులో మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా రెండింటికి మరమ్మతు చేపట్టాల్సి ఉంది. బ్యాక్‌వాటర్ నీటి నిల్వలపై రెగ్యులర్‌గా ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేస్తున్నాం. – లోకిలాల్‌నాయక్, మిషన్ భగీరథ డీఈఈ రోజురోజుకు తగ్గిపోతున్న బ్యాక్ వాటర్ నెలరోజుల కనిష్ట స్థాయికి శ్రీశైలం డ్యాం నిల్వలు ప్రస్తుతం 863 అడుగుల ఎత్తులో నీటిమట్టం సాగునీటితోపాటు, మిషన్‌భగీరథ పథకానికి వినియోగం నీటినిల్వకు అదనపు రిజర్వాయర్ల నిర్మాణమే పరిష్కార మార్గం -
అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించాలి
నారాయణపేట: అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆస్పీరేషన్ (ఆకాంక్షాత్మక) నర్వ బ్లాక్ పై జిల్లా అధికారులు, నర్వ మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. శాఖల వారీగా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. నర్వ మండలంలో కేంద్ర మంత్రి పర్యటన ఈనెల 26న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నర్వ మండలంలోని రాయికోడ్, పాతర్ చేడ్లో పర్యటించనున్నారని కలెక్టర్ తెలిపారు. ఆస్పీరేషన్ నర్వ బ్లాక్‌లో 12 ప్రభుత్వ శాఖల అధికారులు 40 ఇండికేటర్ల వారీగా సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర నిధుల వినియోగంపై మంత్రి బండి సంజయ్ ఆరా తీసే అవకాశం ఉందని, కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు ఎన్ని.. ఎక్కడ పనులు నిలిచిపోయాయని ప్రశ్నించే ఆస్కారం ఉందని తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇదివరకు ములుగు, భూపాలపల్లి జిల్లాలో పర్యటించారని, అక్కడి అధికారులతో మాట్లాడితే కొంత క్లారిటీ వస్తుందని సూచించారు. ఈ పర్యటన ముగిసే వరకు అధికారులెవ్వరికి సెలవులు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం రాయికోడ్ పల్లె దవాఖానను పరిశీలించిన సమయంలో రికార్డులన్నీ సక్రమంగా రాయలేదని దానికి బాధ్యులు ఎవరని కలెక్టర్ వైద్యశాఖ అధికారులను నిలదీశారు. పనిచేయడం ఇష్టం లేకపోతే బదిలీ చేసుకోండి కలెక్టరే అన్ని చోట్లకు వెళ్లి తనిఖీలు, పరిశీలనలు జరిపితే ఇక జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు ఎందుకు ఉన్నట్లు అని కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ.. పనిచేయడం ఇష్టం లేకపోతే బదిలీ చేసుకొని వెళ్లిపోవాలని సున్నితంగా హెచ్చరించారు. విద్యాశాఖ పనితీరు సంతృప్తికరంగా లేదని, సమీక్షకు డీఈఓ ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. డీఈఓ సెలవుపై వెళ్లారని విద్యాశాఖ ఉద్యోగి ఒకరు తెలపడంతో సెలవు పత్రం ఎవరికి ఇచ్చారని, తాను సెలవు ఇవ్వనిదే ఎలా వెళ్తారని ప్రశ్నించారు. నర్వ ఎంఈఓ రాయికోడ్‌కు రాలేదని, నేటి సమీక్షకు హాజరు కాకపోవడంపై సంజాయిషీ కోరారు. డిసెంబర్ వచ్చినా ఇంకా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ ఎందుకు పూర్తి కాలేదని, విద్యాశాఖ, డీఆర్డిఏ అధికారులు సమన్వయం చేసుకుని పంపిణీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నర్వ మండలంలోని పంచాయతీల వారీగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల నివేదికను తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే ఉపాధి హామీ పథకం బిల్లుల పెండింగ్ , పీఎం కిసాన్ యోజన, మట్టి నమూనాల సేకరణ వివరాలను పద శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో ట్రైనీ కలెక్టర్ గరిమానరుల, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, డీఆర్డీఓ మొగులప్ప, డీఎంహెచ్ఓ సౌభాగ్యలక్ష్మి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిధులు, అభివృద్ధి పనులపై నివేదికలతో సిద్ధంగా ఉండాలి 26న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ రాక ఆస్పీరేషన్ నర్వ బ్లాక్‌పై కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష -
వైభవంగా ప్రతిష్ఠాపనోత్సవాలు
నారాయణపేట రూరల్: పట్టణంలోని పరిమళాపురం రాఘవేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి 109వ ప్రతిష్ఠాపనోత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఆలయంలో ఉదయం స్వామివారికి నిర్మాల్యం, పంచామృత అభిషేకం, అర్చన, నైవేద్యం, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం వైభవపీతంగా స్వామివారి మహారథోత్సవం, సాయంత్రం భక్తిశ్రద్ధలతో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో అర్చకులు నరసింహ చారి, శక్తిపీఠం వ్యవస్థాపకులు శాంతానంద్ పురోహిత్, సేవా సమితి సభ్యులు లక్ష్మీకాంతరావు, శ్రీనివాసరావు, నరసింహ, శ్రీపాధ్, సీతారామారావు, శ్రీధర్ రావు, శేషు, ధరణిధర్, ధీరజ్, విద్యాధర్, ప్రకాష్, మంజునాథ్, రాజేంద్ర ప్రసాద్, ప్రహల్లాద్ పాల్గొన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలపై నిరసన నారాయణపేట టౌన్: భారత రాజాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు చేయడంపై వామపక్షనాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతుసంఘం, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి ఉన్నతమైన, అతిపెద్ద రాజ్యాంగాన్ని దేశానికి అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు ప్రతిపక్షాలు ఉచ్చరిస్తే కేంద్రహోంమంత్రి అమిత్ షా సహించలేకపోతున్నారని అన్నారు. అంబేద్కర్ పేరు విని సహనం కోల్పోతున్నారని, అందుకే అంబేడ్కర్ పేరుకు బదులు దేవుడి పేరు జపిస్తే బావుంటుందని అంటున్నారని అన్నారు. కార్యక్రమంలో బాల్రామ్, వెంకట్రామ్ రెడ్డి,బాలప్ప,గోపాల్,అంజిలయ్య,పవన్ పాల్గొన్నారు. హామీ అమలు చేసే వరకు పోరాటం నారాయణపేట రూరల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12వేల జీవన భృతి ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సరం పూర్తి అవుతున్న వారిని పట్టించుకోవడం లేదని టీయూసీఐ జిల్లా కార్యదర్శి నర్సింహ, సిపిఐ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ అన్నారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనకు చలో హైదరాబాద్ వెళ్తున్న ఆటో వర్కర్లను స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించగా.. వారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన తర్వాత బస్సులోనే ప్రయాణం చేస్తున్నారని, దీంతో ఆటో కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారని వాపోయారు. రోజువారీగా ఫైనాన్స్‌లు కట్టలేక జీవితాలు వెళ్లదీయడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ లను ఆటో కార్మికులకు వర్తింప చేలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు సాదిక్, నారాయణరెడ్డి, కథలప్ప, జమీరుద్దీన్, సాబీర్, నయీమ్, నారాయణ, ఎల్లప్ప పాల్గొన్నారు. -
ముగిసిన సీఎం కప్ క్రీడా పోటీలు
నారాయణపేట రూరల్: జిల్లా స్థాయిలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్లో సాయంత్రం ఏర్పాటుచేసిన ముగింపు వేడుకలలో జిల్లా యువజన క్రీడా అధికారి వెంకటేష్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు దత్తురావు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి సంవత్సరం క్రీడలు నిర్వహించడం వల్ల విద్యార్థులు చురుకుగా ఉంటారని, చక్కటి ప్రణాళికతో భవిష్యత్ గురుంచి ఆలోచిస్తారని చెప్పారు. ఆటలు ఆడటం వల్ల శారీరిక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. జిల్లాస్థాయిలో విజేతలు గాని ఇచ్చిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఘనంగా అథ్లెటిక్స్ పోటీలు సీఎం కప్ పోటీల్లో చివరిరోజు అథ్లెటిక్‌కు సంబంధించిన ఆటలు ఆడించారు. అన్ని రకాల వయస్సుల వారికి బాల బాలికలకు వేరువేరుగా క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొని విజయం సాధించిన వారికి మెడల్బహుకరించారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ నర్సిములు, పీడీలు రమణ, సాయినాథ్, అనంతసేన, బాలరాజ్, ఆంజనేయులు, శ్రీధర్, శేఖర్, రాజశేఖర్, పారిజాత, అక్తర్ పాషా, పర్వీన్ పీఈటీలు కృష్ణవేణి, స్వప్న, రాజేష్, మంజుల, సవిత, ఖేలో ఇండియా కోచ్ హారిక పాల్గొన్నారు. -
కార్పొరేషన్‌గా మహబూబ్‌నగర్
మున్సిపాలిటీలుగా మద్దూరు, దేవరకద్ర ఇదిలా ఉండగా ఆయా గ్రామాల్లో ఇక ఆస్తిపన్ను, నల్లా బిల్లులు, భవన నిర్మాణ అనుమతికి చెందిన చార్జీలు పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు ఈ గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కొనసాగుతుండగా.. ఇక నుంచి ఇది అమలు కాదని తెలుసుకున్న వారు ఏమి చేయాలోనని తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు గతంలోనే సర్పంచ్ల పదవీ కాలం ముగిసినందున ఇదే అదనుగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఒకవేళ సర్పంచ్ల పదవీకాలం కొనసాగి ఉంటే ఎక్కడికక్కడ గ్రామసభలు ఏర్పాటు చేసి మున్సిపాలిటీలుగా మార్చవద్దని తీర్మానాలు చేసేవారు. అసెంబ్లీ ఎన్నికలు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మద్దూరు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. మద్దూరు అనుబంధ గ్రామాలుగా ఉన్న భీంపూర్, నాగంపల్లి, సాపన్చెరవుతండాతో పాటు రెనివట్ల, వాల్యానాయక్‌తండా, అంబటోనివంపులను కూడా పురపాలికలో విలీనం చేశారు. 2023 లెక్కల ప్రకారం వీటన్నింటిలో కలిపి 12,595 మంది ఓటర్లు ఉన్నారు. నారాయణపేట జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య నాలుగుకు చేరింది. ఎన్నికల హామీమేరకు మున్సిపాలిటీగా.. పన్నులు పెరుగుతాయని ఆందోళన -
ఉద్యోగాల భర్తీలో మధ్యవర్తులను నమ్మొద్దు
నారాయణపేట: నిరుద్యోగులు మధ్యవర్తులను నమ్మి డబ్బు వృధా చేసుకోవద్దని.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వైద్య శాఖలో ఉద్యోగాలు వస్తాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని సౌభాగ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నారాయణపేట పీహెచ్సీలో ఉద్యోగాల కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా.. నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే, ఓ అజ్ఞాత వ్యక్తి సెల్ నం.9836330846, 9490673253, 8276841598 నుంచి ఫోన్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారని, నమ్మవద్దని సూచించారు. -
ప్రభుత్వ వైఖరి సరికాదు..
నారాయణపేట ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కారణంగా గత కొన్ని రోజులుగా కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులకు బోధన జరగడంలేదని, ఇప్పటికై నా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకొని డిమాండ్లు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి అన్నారు. స్థానిక ఎర్రగుట్ట సమీపంలో ఉన్న కేజీబివి పాఠశాల గేట్ ఆవరణలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని, 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైన ఈ సమయంలో ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకపోవడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మె చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి, వారిని రెగ్యులర్ చేసి, వీలైనంత తొందరగా విధుల్లో హాజరయ్యేలా చేసి సకాలంలో సిలబస్ పూర్తి అయ్యేలా చూడలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాక్షుడు పవన్‌కుమార్, జిల్లా నాయకులు శ్రీహరి, వెంకటేష్, నవీన్, రాజు, రాజవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. -
శిలాఫలకానికే పరిమితం
మక్తల్: నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మక్తల్‌లోని 30 పడకల ఆస్పత్రిని 150 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసినా.. అందుకు తగ్గట్లుగా భవనం మాత్రం నేటికీ అందుబాటులోకి రాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటగా 5 ఎకరాలు స్థలం కేటాయించి భూమి పూజ సైతం చేశారు. ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.34 కోట్లు మంజూరు చేశారు. అనంతరం రాష్ట్రంలో అధికారం మారడంతో.. తాజాగా కాంగ్రెస్ నాయకులు, సంబంధిత అధికారులతో చర్చించి ఆస్పత్రి నిర్మాణానికి 5 ఎకరాలు సరిపోవని, అదే స్థలం పక్కన ఉన్న స్థలాన్ని మళ్లీ సర్వే చేయించి మరో 4 ఎకరాలు.. మొత్తం 10 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. మొదట ఓ సారి టెండర్లు నిర్వహించినా పనులు మాత్రం మొదలు కావడంలేదు. స్థలం అప్పగిస్తే పనులు మొదలు పెడతామని కాంట్రాక్టర్.. భూమికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని అధికారులు పేర్కొంటూ నేటికీ పనులు మొదలు పెట్టలేదు. అత్యవసర సేవలు అందట్లే.. 2023 అక్టోబర్ 4న 150 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నాటి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. కానీ, నేటికీ ఆ పనులు ముందుకు పడడంలేదు. ప్రస్తుతం మక్తల్‌లో ఉన్న 30 పడకల ఆస్పత్రికి నిత్యం 150 నుంచి 400 వరకు ఓపీ కేసులు నమోదవుతూ ఉంటాయి. 167వ రహదారి పట్టణ సమీపంలో ఉండడం.. మక్తల్ నుంచి కృష్ణా మండలం వరకు దాదాపు 30 కిలోమీటర్ల వరకు అంతర్రాష్ట్ర రహదారి ఉండడంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేందుకు రాయచూర్ లేదా హైదరాబాద్‌కే తరలించాల్సి వస్తోంది. 150 పడకల ఆస్పత్రి అందుబాటులోకి వస్తే అత్యవసర సేవలు ఇక్కడే అందుబాటులోకి వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. ముందుకు సాగని 150 పడకల ఆస్పత్రి పనులు మూలుగుతున్న రూ.34కోట్ల నిధులు -
అనుమతులు రాలేదు..
మక్తల్‌లో 150 పడకల ఆస్పత్రి నిర్మించేందుకు రూ.34 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ పక్రియ పూర్తి చేసి అగ్రిమెంటు చేయడం జరిగింది. అయితే, 10 ఎకరాల్లో నిర్మాణం చేపట్టాలని ప్రొసీడింగ్ కాపీ మాకు అందలేదు. అనుమతులు వస్తే పనులు చేసేందుకు చర్యలు చేపడతాం. – సాయి, ఏఈ, మహబూబ్‌నగర్ త్వరలో ప్రారంభిస్తాం ఆస్పత్రి భవన నిర్మా ణ పనులు త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. గతంలో స్థల కొరత ఉండడంతో తిరిగి సర్వే చేయించి 10 ఎకరాలు చూపించాం. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్● -
డీపీఆర్ పూర్తయితే భూసేకరణ
హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ కోసం 2022– 23లో కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ మార్గంలోని 128.6 కి.మీ., నుంచి 191 కి.మీ., వరకు రోడ్డు విస్తరణకు ఇప్పటికే ఆర్అండ్బీ అధికారులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. జనావాసాలు ఉన్న మన్ననూర్, దోమలపెంటల వద్ద బైపాస్, మూలమలుపులు ఉన్నచోట నేరుగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు ఉన్నాయి. డీపీఆర్ పూర్తయితే అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి– మన్ననూర్ నుంచి ఈగలపెంట– పాతాళగంగ వరకు సుమారు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనా. ఇందులో 128.63 హెక్టార్లు అటవీ భూమి కాగా.. మరో 18.68 హెక్టార్ల అటవీయేతర భూమి సేకరించనున్నారు. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి -
కళాశాలల నిర్మాణానికి స్థలం అప్పగింత
కోస్గి రూరల్: ప్రభుత్వ ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి సంబంధిత అధికారులకు గురువారం అప్పగించామని తహసీల్దార్ బక్క నర్సింలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను అప్‌గ్రేడ్ చేస్తూ కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలగా ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నేపథ్యంలో కళాశాల నిర్మాణానికి సర్వే నంబరు 1737లో 10 ఎకరాల 8 గుంటలను ప్రిన్సిపల్ శ్రీనివాస్‌కు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సర్వే నంబరు 1809,1811,1812 లో 5 ఎకరాలను భూమిని ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డికి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు కార్యక్రమంలో అర్ఐ సుభాష్‌రెడ్డి ,సర్వేయర్ అరుణ సిబ్బంది ఉన్నారు. పేటను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుదాం నారాయణపేట రూరల్: పేటను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని డీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు. సీఎం కప్‌లో భాగంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం నాలుగో రోజు స్థానిక మినీ స్టేడియంలో ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు నిరంతరం సాధన చేయాలని, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి జాతీయస్థాయిలో స్కేటింగ్ ఆడారని, రాష్ట్ర స్థాయిలో బాస్కెట్ బాట్లో ప్రతిభ కనబరిచారని కొనియాడారు. రాష్ట్రాన్ని ఒలంపిక్ హబ్‌గా మార్చాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి ధ్యేయమన్నారు. అందుకే ఇటీవల స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పడానికి కృషి చేశారన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో క్రీడా పోటీలను నిర్వహించాలన్నారు. విజేతలు వీరే.. బాలికల విభాగంలో మొదటి బహుమతి మక్తల్ మండలం, రెండవ బహుమతి కృష్ణ మండలం, బాలుర విభాగంలో మొదటి బహు మతి నారాయణపేట మండలం, ద్వితీయ బహుమతి మద్దూరు మండల్ కై వసం చేసుకున్నాయి. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కోట్ల రవీందర్ రెడ్డి, గందే చంద్రకాంత్, మాధవరెడ్డి, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి నరసింహులు, పిఈటీలు వెంకటప్ప, పారిజాత, కృష్ణవేణి, స్వప్న, రూప, మీనా కుమారి పాల్గొన్నారు. తెల్ల కందులు క్వింటా రూ.9,100 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో తెల్ల కందులు క్వింటా గరిష్టంగా రూ.9,100, కనిష్టంగా రూ.8,200 ధర పలికింది. ఎర్ర కందులు గరిష్టంగా రూ.8,640, కనిష్టంగా రూ.7వేలు, వడ్లు సోన గరిష్టంగా రూ. 2,634, కనిష్టంగా రూ.1,900, వడ్లు హంస గరిష్టంగా రూ.1,740, కనిష్టంగా రూ.1,700 ధర పలికాయి. నవాబుపేట మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం నవాబుపేట/దేవరకద్ర: నవాబుపేట మార్కెట్‌కు వరి ధాన్యం పోటెత్తింది.28,340 బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. సోనా మసూరి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,692 కనిష్టంగా రూ.2,020 పలికింది. దేవరకద్రలో ఆర్ఎన్ఆర్ క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,550, కనిష్టంగా రూ.2,509, కందులు గరిష్టంగా రూ.8,059, కనిష్టంగా రూ.7,709గా ధరలు లభించాయి. -
డ్యాం వద్ద ఐకానిక్ బ్రిడ్జి
హైదరాబాద్– శ్రీశైలం–తోకపల్లి జాతీయ రహదారిలో శ్రీశైలం డ్యాం వద్ద ఐకానిక్ వంతెన ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఈ మార్గంలో పాతాళగంగ వద్ద ఇరుకై న బ్రిడ్జి ఉంది. ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు తెలంగాణలోని ఈగలపెంట, ఆంధ్రప్రదేశ్‌లోని సున్నిపెంట గ్రామాల మధ్య కృష్ణానదిపై 173 మీటర్ల ఎత్తు, 670 మీటర్ల పొడవైన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ వైపు 180, ఏపీ వైపు 340 మీటర్ల సపోర్ట్ బ్రిడ్జి డిజైన్ రూపొందించారు. దీంతో శ్రీశైలానికి మరో 9 కి.మీ., దూరం తగ్గుతుంది. ● మన్ననూర్– పాతాళగంగ మార్గంలో62 కి.మీ., ఎలివేటెడ్ కారిడార్ ● ప్రాజెక్టు వ్యయం అంచనా రూ.7,700 కోట్లు ● శ్రీశైలం డ్యాం వద్ద నాలుగు వరుసల భారీ వంతెన ● మల్లన్న సన్నిధికి తగ్గనున్న ప్రయాణ భారం సాక్షి, నాగర్‌కర్నూల్/అచ్చంపేట: ఒకవైపు అరుదైన వన్యప్రాణులు, వృక్షజాతులను సంరక్షిస్తూనే.. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు నల్లమల వేదిక కానుంది. నల్లమల అటవీ ప్రాంతం గుండా సుమారు 62 కి.మీ., మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో హైదరాబాద్– శ్రీశైలం రహదారి రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ మార్గంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల జీవనానికి ఆటంకం కలిగించకుండా భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. రూ.7,700 కోట్ల నిధులతో ఈ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టేందుకు అవసరమైన డీపీఆర్ రూపొందించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. 30 అడుగుల ఎత్తులో.. హైదరాబాద్–శ్రీశైలం జాతీయరహదారి–765 గుండా శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులతో రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ మా ర్గంలో సుమారు 62.5 కి.మీ., మేర నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. మ న్ననూరు నుంచి పాతాళగంగ వరకు సు మారు 30 అడుగుల ఎత్తులో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీంతో వన్యప్రాణుల భయం లేకుండా ఎత్తు నుంచే గమ్యాన్ని చేరుకునేందుకు వీలుంది. హైదరాబాద్–ఏపీలోని ప్రకాశం మధ్య 45 కి.మీ., మేరకు దూరభారం తగ్గనుంది. -
సాంకేతిక వ్యవస్థపై అవగాహన ఉండాలి
నారాయణపేట: జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలని, ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని, సాంకేతిక వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా యోగేష్ గౌతమ్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నారాయణపేట సర్కిల్ ఆఫీస్‌ను గురువారం ఎస్పీ తనిఖీ చేసి ఆఫీస్‌లో నిర్వహిస్తున్న పలు రకాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ కేసులు, కేసుల పురోగతి పెండింగ్ ఉన్న కేసులను తగ్గించాలని సూచించారు. కేసుల దర్యాప్తు, వర్టికల్స్ పనితీరు కేసుల వివరాలను పరిశీలించారు. నూతనంగా వచ్చిన కానిస్టేబుళ్లు అందరు పోలీస్ స్టేషన్లో ప్రతి వర్టికల్స్ పై అవగాహన కలిగి ఉండి రొటేషన్ వైస్‌గా అన్ని విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. అలాగే సాంకేతిక వ్యవస్థపై దృష్టి సారించాలని, పోలీస్ శాఖ లో వస్తున్న నూతన యాప్స్, సీసీటీఎన్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాత నేరస్థులపై నిఘా పెట్టాలని ఎస్పీ సూచించారు. బాధితులకు భరోసానివ్వాలి జిల్లాలో ఎక్కడైనా పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు పూర్తి భరోసా ధైర్యం ఇచ్చేలా పోలీసు ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలన్నారు. ఫిర్యాదుదారులకు కేసుకు సంబంధించిన పూర్వపరాలను ఎప్పటికప్పుడు బాధితులకు వివరించాలన్నారు. కేసుల దర్యాప్తు నిర్వహిస్తేనే నేరాల్లో నింధితులకు శిక్షలు పడతాయన్నారు.పిర్యాదుదారుడు నేరుగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ణిర్యాదు చేసేలా స్నేహపూర్వక వాతావరణం కల్పించాన్నారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేయాలని, ఫ్రీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఎస్పీ సూచించారు. సమస్యలు సృష్టించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ అలాంటి వారిపై షీట్స్ ఓపెన్ చేయాలన్నారు. దొంగతనాల నివారణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నిషేధిత మత్తు పదార్థాలకు అడ్డుకట్ట మత్తు పదార్థాలు, గుట్కా, గంజాయి లాంటి నిషేధిత పదార్థాల అమ్మకాలు, అక్రమ రవాణా నిరోధించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మహిళల రక్షణ కోసం, సైబర్ నేరాలపై షీ టీమ్స్, లోకల్ పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రాపర్టీ నేరాలు జరగకుండా విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాజు, కృష్ణ దేవ్, రేవతి, ఎఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆంగ్లంపై పట్టు సాధిస్తే ఉద్యోగావకాశాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: యువత ఆంగ్లంపై పట్టు సాధిస్తే సులువుగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉందని పాలమూరు యూనివర్సిటీ వీసీ జీఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘హైబ్రిడిటీ అండ్ బిలాంగింగ్ ఇంగ్లిష్ ఇన్ ఏ ట్రాన్స్లేషన్ వరల్డ్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో అన్ని విద్యా, ఉపాధి, వాణిజ్యం వంటి అంశాలు ఆంగ్ల భాషతో ముడిపడి ఉన్నాయని, అందుకు విద్యార్థులు దానిపై దృష్టి సారించాలన్నారు. గ్రామీణస్థాయి విద్యార్థులకు ఆంగ్లం అంటే వెనుకబాటుతనం ఉండకుండా నిరంతర సాధన వల్ల దానిపై పట్టు సాధించేందుకు అవకాశం ఉందన్నారు. సెమినార్లతో విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలల నుంచి మొత్తం 132 పరిశోధన పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో కీనోట్ స్పీకర్ జేఎన్టీయూ పులివెందుల ప్రొఫెసర్ సాంబయ్య, తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రఘుపతి, ప్రిన్సిపాల్ పద్మావతి, హెచ్ఓడీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంవీఎస్ కళాశాలలో జాతీయ సెమినార్లో పీయూ వీసీ జీఎస్ శ్రీనివాస్