శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వెలుగు.. చీకటిని చీల్చి బతుకుపై భరోసానిచ్చే ఓ ఊపిరి! కానీ అదే మిరుమిట్లు గొలుపే వెలుగు నిరుపేదల బతుకును చీకటిలోకి నెడుతోంది. తీరని శోకాన్ని మిగుల్చుతోంది. ఆకాశంలో మేఘాల మధ్య జరిగే ఘర్షణ.. పిడుగుల గర్జనగా కోట్ల వోల్టుల విద్యుత్ ప్రవాహంతో నిరుపేద రైతుకూలీల ప్రాణాలు తీస్తోంది. ప్రమాదాన్ని నివారించలేని విపత్తు నిర్వహణ సంస్థల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికే అరవై రెండు మంది పిడుగుపాటుతో పంట పొల్లాల్లోనే ప్రాణాలు వదలగా.. గత ఆరేళ్లలో ఏకంగా 398 మంది కన్నుమూశారు.
తెలంగాణలో ఏటా సగటున లక్షా యాభైవేల నుండి రెండు లక్షల వరకు పిడుగులు పడుతున్నట్టు అంచనా. రైతులు, కూలీలు పంట పొలాల్లో ఎక్కువ సమయం గడిపే అక్టోబర్‌లోనే ఎక్కువగా పిడుగులు పడుతున్నాయి. అందులో 90శాతం గ్రామాల్లోనే పడుతుండగా.. మరణిస్తున్న వారిలో నూటికి 96 మంది రైతులు, కూలీలే ఉంటున్నారు. ఊహించని విపత్తుతో మరణించిన మెజారిటీ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కనీస ఆర్థిక సహాయం అందడం లేదు. భూమి ఉన్న రైతులు మరణిస్తే రైతు బీమా వర్తిస్తుండగా.. భూమి లేని నిరుపేదలు ఏళ్ల తరబడి సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రమాదకర జోన్‌లో 13 జిల్లాలు
దేశంలో అత్యధికంగా పిడుగులు పడుతున్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. గత ఏడాది అక్కడ 6,55,788 పిడుగులు పడితే.. తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 5,76,498, మహారాష్ట్రలో 5,28,591 పిడుగులు పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మన పొరుగున ఉన్న కర్నాటక ఎనిమిదో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ పదకొండో స్థానంలో, తెలంగాణ 1,49,336 పిడుగులతో పద్నాలుగో స్థానంలో ఉన్నాయి.
మన రాష్ట్రంలో చూస్తే.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి, కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట జిల్లాలు అత్యధిక పిడుగు పీడిత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. గత ఆరేళ్లలో అత్యధికంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 90 మంది పిడుగుపాటుతో చనిపోయారు. వరంగల్ జిల్లాలో 59, ఆదిలాబాద్‌లో 52, మెదక్‌లో 27 మంది చనిపోయారు. పిడుగులు 96 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే పడుతుండగా.. మృతుల్లో 98శాతం రైతులు, కూలీలే. మొత్తంగా గత ఆరేళ్లలో తెలంగాణలో 398 మంది నిరుపేదలు మరణించగా.. మరో 1,220 మంది గాయాలపాలయ్యారు.
(చదవండి: రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ)
నివారించే అవకాశమున్నా..
పిడుగుపాటు మరణాలను నివారించే అవకాశమున్నా.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. పిడుగుపాటు నష్టాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన అరెస్టర్లు, కండక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. పుణె ఐఐటీ దామిని అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అది 20 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే అప్రమత్తం చేస్తుంది. దీనికితోడు ఎర్త్ నెట్‌వర్క్ అనే అమెరికా సంస్థ సైతం అధునాతన పరికరాలను మార్కెట్లోకి తెచ్చింది. పలు రాష్ట్రాల్లో గ్రామ, మండల యంత్రాంగాలు వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం భారీ నష్టానికి కారణం అవుతోంది. పొరుగున ఉన్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మెరుగైన పద్ధతులతో పేదల ప్రాణాలు కాపాడుతున్నారు.
కోట్ల వోల్టుల శక్తితో పిడుగులు
మేఘాల నుంచి ఒక్కసారిగా విడుదలయ్యే ఎలక్ట్రాన్లు 15–30 కోట్ల వోల్టుల విద్యుత్ ప్రవాహంతో భూమ్మీదకు దూసుకువచ్చే శక్తినే ‘పిడుగు’ అంటారు. ఒక మేఘం నుంచి మరో మేఘానికి ప్రసారమయ్యే పిడుగుల వల్ల ఆకాశంలో ఎగిరే విమానాలకు ముప్పు ఉంటుంది. మేఘం నుంచి భూమిని తాకే (క్లౌడ్ టు గ్రౌండ్) పిడుగులు మనుషులు, ఇతర జీవజాలానికి ముప్పు కలిగిస్తున్నాయి.
పూరి గుడిసెలో బంగారమ్మ..
వనపర్తి జిల్లా బాలకిష్టాపూర్‌లో జూన్ 6, 2017న పడిన పిడుగులు ఒకే ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములను పొట్టనపెట్టుకున్నాయి. ముళ్ల పొదలు తొలగించే క్రమంలో ఆకాశమంతా ముప్‌పై సెకన్లపాటు వెలుగును చిమ్ముతూ పడిన పిడుగుతో తెలుగు లక్ష్మన్న (40), ఈదన్న (52), పరమేశ్ (27) ప్రాణాలు వదిలారు. ఊరంతా కన్నీరు పెట్టింది. ఆదుకుంటామంటూ ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు ఆపద్బంధు కింద సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. ఆ ముగ్గురిలో ఈదన్న, లక్ష్మన్న కుటుంబాలకు పాత ఇళ్లయినా ఉండగా.. చివరివాడైన పరమేష్‌కు సొంత ఇల్లు కూడా లేదు. ఆయన భార్య బంగారమ్మ(24) రోజు కూలీకి వెళ్తూ.. సగం కూలిన గుడిసెలోనే కాలం వెళ్లదీస్తోంది. ఇలాంటి విషాద గాధలు ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంకా ఎన్నో ఉన్నాయి.
(చదవండి: రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కున్న మహిళ.. వీడియో వైరల్)
కాలం కాటేసినా.. కదలని యంత్రాంగం
అక్టోబర్ 9, 2021లో ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ పరిధిలోని బుర్కపల్లిలో సోయా చేనులో పనిస్తుండగా పిడుగుపాటుతో గరణ్ సింగ్ (45), ఆయన తమ్ముడి భార్య ఆశాబాయి (30) మరణించారు. విపత్తు పరిహారం కోసం బాధిత కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. త్రీమెన్ కమిటీ విచారణ పూర్తయినా ఇంకా పరిహారం అందలేదు.
తక్షణ కార్యాచరణ అవసరం
జాతీయ స్థాయిలో ప్రధాని చైర్మన్‌గా, నిపుణులు వైస్ చైర్మన్‌గా ఉండే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) తరహాలోనే రాష్ట్రస్థాయిలో సీఎం చైర్మన్‌గా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పనిచేయాలి. మన రాష్ట్రంలో విపత్తుల నిర్వహణను మర్చిపోయారు. వరద వచ్చాక సహాయక చర్యలు చేస్తున్నారు. అలాంటిది ముందే పిడుగుపాటు నివారణ చర్యలు ఎజెండాలోనే లేకపోవడం దారుణం
– మర్రి శశిధర్‌రెడ్డి, ఎన్‌డీఎంఏ మాజీ వైస్ చైర్మన్
నివారించదగిన ప్రమాదాలు..
పిడుగు అనేది వంద శాతం నివారించదగ్గ విపత్తు. కానీ తెలంగాణలో పిడుగులతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అందుబాటులోకి వచ్చిన అరెస్టర్లు, కండక్టర్లతో పిడుగుపాటు మరణాలను అరికట్టవచ్చు. పిడుగుపాటు సమయాలను ముందే తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. ఇలాంటి చర్యల్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో ఆ ప్రయత్నాలేవీ మొదలుకాలేదు. తగిన సలహాలు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
– కల్నల్ సంజయ్ శ్రీవాస్తవ, క్లైమైట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment