
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో పడుతున్న పిడుగుల కారణంగా 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. గత మంగళవారం ఒక్క రోజే ఏపీలో 41,025 పిడుగులు పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏదో ఒక చోట పిడుగులు పడుతూనే ఉన్నాయి. మిన్ను విరిగి మనమీదే పడ్డట్టుగా ఉరుములు.. పిడుగులు.. భయానక వాతావరణాన్ని సృష్టించినప్పటికి మృతుల సంఖ్య తక్కువగా ఉండటానికి ఓ మొబైల్ యాప్ కారణం అంటున్నారు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు. కుప్పం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ఇస్రో అధికారుల సహాయంతో లైటెనింగ్ ట్రాకర్ సిస్టమ్ యాప్‌ని రూపొందించారు. విద్యుదయస్కాంత తరంగాలను విశ్లేషించడం ద్వారా ఉరుములు, పిడుగులు ఏ ప్రాంతాల్లో పడతాయో ముందే గుర్తించగలుగుతారు. ఎవరైతే ఈ యాప్‌ని వినియోగిస్తున్నారో వారికి 45 నిమిషాల ముందుగానే సరిగా ఏ ప్రాంతంలో పిడుగులు పడుతాయో సమాచారం అందుతుంది.
వాతావరణ నిపుణుడు కెటీ కృష్ణ మాట్లాడుతూ.. కేవలం లైటింగ్ ట్రాకింగ్ యాప్ సహాయంతో చాలా మంది ప్రాణాలు రక్షించగలిగామని తెలిపారు. ఈ యాప్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తరపున 20.14 లక్షల మంది మొబైల్ వినియోగదారులకి ఊరుములు, పిడుగులకు సంబంధించిన ముందస్తు సమాచారం అందజేశామని తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ సాఫ్ట్‌వేర్‌ని(వజ్రపథ్) వినియోగించామన్నారు. ప్రస్తుతానికి ఇది కేవలం బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని దీనిని ఇతర మొబైల్ సర్వీస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment