డెహ్రాడూన్: ప్రియాంక, కత్రినా, దీపీకా రేపు పెళ్లి చేసుకోబోతున్నారు. మహా శివరాత్రి సందర్భంగా తమకు కాబోయే వరుడ్ని స్వయంవరంలో ఎంచుకోబోతున్నారు. వీరిని వివాహం చేసుకునేందుకు మొత్తం 15మంది పెళ్లి కుమారుల్లు సిద్థం కాగా వారిలో తమకు నచ్చిన వారిని లైఫ్ పార్టనర్‌గా ఎంపికచేసుకోబోతున్నారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరఖాండ్‌లోని తేరి జిల్లా జౌన్‌పుర్ ప్రాంత పరిధిలోని పంత్‌వాడి గ్రామం వేదిక కానుంది. అదేమిటీ బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న ఈ ముగ్గురు ఇలా పెళ్లికి సిద్ధమై పోవడం ఏమిటని ఆశ్చర్యపోతూ అవాక్కవుతున్నారా.. వాస్తవానికి పెళ్లి ప్రియాంక, కత్రినా, దీపికాదే కాని.. బాలీవుడ్ నటులైన ప్రియాంక, కత్రినా, దీపికాలది కాదు. ఆ పేర్లు కలిగిన మూడు గొర్రెలది.
అవును.. మహాశివరాత్రి సందర్భంగా ఈ పేర్లు గల మూడు గొర్రెలకు స్వయం వరం నిర్వహిస్తున్నారు. ఇలా చేయడం ప్రతిఏడాది ఆ గ్రామంలో ఆనవాయితీ. ఈసారి ఈ మూడు గొర్రెలకు స్వయం వరం చేస్తున్నారు. వీటికోసం 15 మగ గొర్రెలను సిద్ధం చేశారు. ఒక్కో గొర్రెకు ఐదు గొర్రెలను ఓ రింగ్‌లోకి పంపించగా వాటిల్లో నుంచి ఒకదానిని ఆడ గొర్రె ఎంపిక చేసుకుంటుంది.
అలా ఎంపిక చేసుకున్న గొర్రెతో దాని వివాహం జరిపిస్తారు. ఈ తంతుకు సాధారణంగా పెళ్లిల్లకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో అలాంటివే వీటి కోసం కూడా సిద్ధం చేస్తారు. ఇలా చేసి మూగజీవాలను గౌరవించడం తమ ప్రాంతంలో ఆనాదిగా వస్తున్న గొప్ప ఆచారంగా అక్కడి ప్రజలు చెప్పుకుంటుంటారు.
ప్రియాంక, కత్రినా, దీపికల స్వయంవరం రేపే
Published Thu, Feb 23 2017 1:09 PM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM
Advertisement
Advertisement