విశాఖకు పొంచి ఉన్న పెను తుఫాను
ఆంద్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు పెను తుఫాను ముప్పు పొంచి ఉంది. 'హుదూద్' తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి గురువారం రాత్రిలోపు తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయానికి అది పెను తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈనెల 12వ తేదీన విశాఖపట్నం- గోపాల్పూర్ మధ్య ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంది. దాంతో 11వ తేదీన గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. తుఫాను తీరం దాటే సమయంలో అయితే గాలుల వేగం గంటలకు 130-150 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అన్ని ప్రధాన పోర్టుల్లో రెండోనెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఈనెల 11వ తేదీ నుంచే తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. దాంతో ఏపీ, ఒడిశాలకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం పంపిది. విశాఖకు నాలుగు మిలటరీ దళాలను కూడా పంపింది.