
నాగావళి ఉగ్రరూపం
విజయనగరం: పైలీన్ తుపాను విలయాన్ని మర్చిపోకముందే శ్రీకాకుళం జిల్లాపై హుదూద్ దాడి చేసింది. నాగావళి నది ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. శ్రీకాకుళం పట్టణంతో పాటు 11 తీర మండలాల్లోని 107 గ్రామాలకు ఇపుడు వరదముప్పు పొంచి ఉంది. వంశధారలోనూ నీటి ప్రవాహం కొద్దికొద్దిగా పెరుగుతోంది. గొట్టా బ్యారేజీ వద్ద సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు 47,462 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రస్తుతానికి వరద ముప్పు లేకపోయినా.. అప్రమత్తంగా ఉండాలని నదీతీరంలోని 11 మండలాలకు చెందిన 124 గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో తుపాను నష్టం సుమారు రూ.500 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా.
72 వేల హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. విద్యుత్ పునరుద్ధరణకు మరో రెండురోజులు పడుతుందని చెబుతున్నారు. జిల్లాలో పలు ప్రధాన రోడ్లు, కాలువలకు గండ్లు పడ్డాయి. పక్కా ఇళ్లు, పూరిళ్లు అనే తేడాలేకుండా వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. హుదూద్ ధాటికి విజయనగరం జిల్లా అతలాకుతలమైంది. 70 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనావేస్తోంది. సుమారు రూ. 300 కోట్లు నష్టం ఉండవచ్చని ప్రాథమిక అంచనా. కొబ్బరి, అరటి తోటలతో పాటు వివిధ కూరగాయల పంటలు నే లమట్టమయ్యాయి. విద్యుత్ నష్టాల విలువ సుమారు రూ.20 కోట్లు దాటుతుందని అంచనా. చిన్నతరహా నీటి వనరులు కూడా దెబ్బతిన్నాయి. చెరువులకు గండ్లు పడితాగునీరు కూడా కలుషితమయింది. వందలాది కోళ్లు, పశువులు మృత్యువాత పడ్డాయి. ఇక మత్స్యకారుల బోట్లు, వలలు కొట్టుకుపోయాయి జీవనం భారమైపోయింది.