విశాఖ విలవిల
- తీరమా..ఘోరమా..
- చెదిరిన విశాఖ ముఖచిత్రం
- విశాఖ చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విలయం
- హుదూద్ ప్రభావంతో ఉక్కిరి బిక్కిరి
- పెనుగాలులతో బీభత్సం,కుండపోతగా వర్షం
- జల దిగ్బంధంలో జిల్లా, నగరం
- పూడిమడక వద్ద తీరం దాటిన తుఫాన్
- కరెంటు లేక అంతటా చిమ్మ చీకట్లే
- ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు
- ముగ్గురు వ్యక్తులు మృత్యువాత
- వేలాదిగా వృక్షాలు నేల మట్టం,భారీ విధ్వంసం
- బస్సు,రైలు, విమాన సర్వీసులన్నీ రద్దు
- హైవేలో ఎక్కడి వాహనాలు అక్కడే..
‘పయోధర ప్రచండ ఘోష, ఝంఝానిల షడ్జధ్వానం’ విశాఖను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ‘హుదూద్’ పెను తుఫాన్ రూపంలో ప్రకృతి విసిరిన జల ఖడ్గం సుందర సాగర తీరాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జిల్లా యావత్తూ అతలాకుతలం అయింది. దాదాపు 24 గంటలకుపైగా జనజీవనం స్తంభించి, జల జీవనంగా మారింది. ఎటు చూసినా చెట్లు కూలిన దృశ్యాలు, కరెంటు తీగలు తెగిపడిన విద్యుత్ స్తంభాలు, మొండి గోడలుగా మారిన పూరిళ్లు, శ్లాబులతో సహా నేల వాలిన పక్కా గృహాలు, ధ్వంసమైన వందలాది కార్లు, ద్విచక్రవాహనాలు..దర్శనమిస్తున్నాయి. రోడ్లపై వందలాది మూగజీవాల మృత కళేబరాలు పడి ఉన్నాయి. జిల్లాలోని తీరప్రాంతమంతా ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో, హోరు గాలులతో భీకరాకారం దాల్చింది. శనివారం అర్ధరాత్రి మొదలైన ‘హుదూద్’ ప్రభావం ఆదివారం తెల్లవారుజామయ్యే సరికి విలయంగా మారింది. కాళరాత్రిగా మారి చెవులు చిల్లులు పడేలా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులకు తోడు కుండపోతగా భారీ వర్షం కురిసింది. ఈ భయానక వాతావరణం దాదాపు 20 గంటలకుపైగా కొనసాగింది. విశాఖ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి ప్రకృతి బీభత్సం చోటు చేసుకుంది. ముందే అధికార యంత్రాంగం మేలుకోవటంతో జననష్టం నివారించగలిగినా, ఆస్తి నష్టంభారీగానే జరిగింది. బంగాళాఖాతంలో జిల్లా నడిబొడ్డు పూడిమడకలో తీరం దాటిన వేళ ప్రచండ గాలులు భయకంపితుల్ని చేశాయి.
సాక్షి, విశాఖపట్నం : గంటా, రెండు గంటలా? ఏకంగా 20 గంటల పాటు విశాఖ వణికిపోయింది. చెవులు చిల్లులుపడేలాంటి హోరుగాలులు, కుంభవృష్టితో హుదూద్ తుపాన్ విలయతాండవం చేసింది. చెట్లు, విద్యుత్ స్థంభాలను నేలకూల్చింది. అడుక్కో చెట్టు, స్తంభం కూల్చేసి అడుగు ముందుకు పడకుండా అడ్డుకట్టవేసింది. ఎన్నో ఇళ్లు, భవనాలను నేలమట్టం చేసేసింది. ముగ్గురిని మింగేసింది. అందరినీ ప్రాణభీతిలో అల్లాడించింది. ఒక్కమాటలో చెప్పాలంటే విశాఖ చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత బీభత్సాన్ని సృష్టించింది. అందాల నగరాన్ని కకావికలం చేసింది. ఇది మన వైజాగేనా? అనుకునేంత అందవిహీనంగా మార్చేసింది. వెరసి విశాఖ వాసులకు హర్రర్ సినిమాలో సన్నివేశాలను ప్రత్యక్షంగా చూపించింది!
శనివారం అర్థరాత్రి నుంచే మొదలైన హదూద్ వికృతరూపం ఆదివారం ఉదయానికి మరింత ఉధృతమైంది. గంటగంటకూ ఉగ్రరూపం దాల్చడం మొదలైంది. మధ్యాహ్నానికి తీరం దాటే సమయంలో మరింత బీభత్సం సృష్టించింది. తీరం దాటాక ఫర్వాలేదనుకున్న వారికి ఆ ఆశలు తల్లకిందులు చేస్తూ విధ్వంసకాండను కొనసాగించింది. పెనుగాలులు ఒకపక్క చెట్లు, స్తంభాలు కూలుతుండగా, మరోపక్క ఇళ్ల పైకప్పుల రేకులు అరటి ఆకుల్లా ఎగిరిపడ్డాయి.
ఎక్కడ చూసినా ఇవి ఆకాశంలో నాట్యం చేస్తూ కనిపించాయి. కిటికీల అద్దాలు, తలుపులు, ఇళ్లలోని వస్తువులు ధ్వంసమయ్యాయి. ఈ బీభత్సానికి పిల్లాపాపలతో ప్రాణాలరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే బందీలయ్యారు. శనివారం అర్థరాత్రి నుంచే విద్యుత్ సరఫరా లేక బయట ఏం జరుగుతుందో టీవీల ద్వారా తెలుసుకోలేకపోయారు. ఫోన్ల ద్వారానైనా తెలుసుకుందామంటే నెట్‌వర్క్ సమస్యతో అవికూడా మూగబోయాయి.
కానీ విశాఖలో హదూద్ సృష్టిస్తున్న విలయానికి తమ వారికి ఏంజరుగుతుందోనన్న భయంతో దూర ప్రాంతాల్లో ఉన్న వారు అతికష్టంపై క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. దుకాణాలు, హోటళ్లు, సినిమాహాళ్లు, మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలతో రైళ్లు, బస్సు సర్వీసులు ఎక్కడివక్కకే నిలిచిపోయాయి. రైల్వే, బస్‌స్టేషన్లు బోసిపోయాయి. ఆటోలు, ఇతర వాహనాలు తిరిగే సాహసం చేయలేకపోయాయి. రోడ్లపై మనుషులకు బదులు చెట్లు, స్తంభాలే కనిపించాయి.
మరోవైపు అడుగడుగుకీ చెట్లు కూలిపోయాయి. అనేకచోట్ల రోడ్లు తెగిపోయాయి. అత్యవసర పనులపై బయటకు వచ్చిన ఎంతదూరమైనా కాలినడకే శరణ్యమైంది. అయినా ఏ ముప్పు ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడింది. ఇక హైవేపై కూలిన చెట్లు పడకేసినట్టుగా కనిపించాయి. ఒక్క వాహనం కూడా వెళ్లకుండా అడ్డుకట్టవేశాయి. ఇలా అన్ని వైపులా హుదూద్ విజృంభించి విశాఖను అష్టదిగ్బంధనం చేసింది. విద్యుత్ సరఫరా లేక ఇటు నగరం, అటు జిల్లా అంధకారంలో మగ్గిపోయి శతాబ్దం కిందటి రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చింది.
జిల్లాలో పరిస్థితి కూడా భయానకంగానే ఉంది. హుదూద్ ధాటికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల ఎకరాల్లో వరిపంట నీట మునగగా, చెరకు పంట పెనుగాలుల తీవ్రతకు నేలవాలింది. తుపాన్ తీరం దాటినట్టుగా భావిస్తున్న అచ్యుతాపురం మండలం పూడిమడక ప్రాంతంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. తీరం దాటే సమయానికి తుపాను ఉధృతికి అక్కడ స్థానికులు, సహాయక చర్యల్లో ఉన్న అధికారులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఎన్నో తుపాన్లను చవిచూసిన విశాఖ నగర, జిల్లా వాసులు హుదూద్ తుపాన్ అంతటి విపత్కర పరిస్థితిని ఎన్నడూ చవిచూడలేదంటూ ఆవేదన చెందుతున్నారు.
ముగ్గురు మృత్యువాత
కాగా హుదూద్ తుపాను కారణంగా ఆదివారం ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో విశాఖ నగరంలోని రామ్‌నగర్ ప్రాంతంలో గాలులకు ఎగిరిపడ్డ రేకు పడి గుర్తు తెలియని వ్యక్తి మృత్యువాతపడ్డాడు. పద్మనాభం మండలం బీఆర్ పాలవలసలో వర్షం నీటిలో జారిపడి ఎర్రయ్య (58) మరణించాడు. అనకాపల్లి మండలం కూండ్రంగిలో చంద్రవతి అనే మహిళ మరణించింది.