- హుదూద్ ఎఫెక్ట్
- ఎగసిపడుతున్న అలలు
- మత్స్యకారుల వేటకు బ్రేక్
కోడూరు : ‘హుదూద్’ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోడూరు మండలంలోని పాలకాయతిప్ప సమీపాన శుక్రవారం సముద్రపు అలలు రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. సముద్రం కాస్త ముందుకు చొచ్చుకు వచ్చింది. సాగర సంగమం వద్ద అలలు కృష్ణమ్మ పాదాలను తాకుతున్నాయి. సముద్ర ప్రాంతమంతా గోతులు ఏర్పడ్డాయి. అలల ధాటికి సాగర సంగమ ప్రాంతానికి వెళ్లే రహదారి కోతకు గురైంది.
సాయంత్రం సముద్రంపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతోప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తమ పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. అధికారులు హుదూద్ తీవ్రరూపం దాల్చి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో తీరప్రాంతాల ప్రజలు 1977, నవంబర్ 19 తేదీన వచ్చిన దివిసీమ ఉప్పెనను గుర్తు చేసుకుని వణికిపోతున్నారు. వచ్చే నెల 17కు దివిసీమ ఉప్పెన వచ్చి 37ఏళ్లు పూర్తవుతుందని, మళ్లీ ఈ తరుణంలో హుదూద్ దూసుకొస్తోందని తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
తీర ప్రాంతాల్లో భయం..భయం..
హుదూద్ ప్రభావం ఎలా ఉంటుందోనని కోడూరు మండలలోని హంసలదీవి, పాలకాయతిప్ప, రామకృష్ణాపురం, ఊటగుండం, ఇరాలి, జార్జీపేట, చింతకోళ్ల తదితర తీరప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం లేక సోమవారం తుపాను తీరం దాటుతుందని అధికారులు చెప్పడంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని వణికిపోతున్నారు. పాలకాయతిప్పలోని మత్య్సకారులు వేటకు వెళ్లకుండా వలలు అల్లుకునే పనిలో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలు కురిస్తే వరి పైరు కూడా దెబ్బతింటుందని రైతులు చెబుతున్నారు.
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హుదూద్ తుపాను దృష్ట్యా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి, సోషల్ వెల్ఫ్‌ర్ డీడీ మాధుసుదనరావు సూచించారు. ఆయన శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తీర ప్రాంతాల గురించి తహశీల్దార్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు.
సముద్రంలో చిక్కుకున్న బోటు
మచిలీపట్నం : హుదూద్ తుపాను ప్రభావం మచిలీపట్నంపై పడింది. ఓ బోటు సముద్రంలో చిక్కుకుంది. సాధారణంగా గిలకలదిండి హార్బర్ నుంచి దాదాపు 90 బోట్లు చేపలవేటకు వెళుతూ ఉంటాయి. హుదూద్ తుపాను ప్రభావం నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను వెనక్కి రావాలని మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాలర్లు బోటుతో గిలకలదిండి హార్బర్‌కు సమీపంలోకి వచ్చే సరికి సముద్రం పాటుకు వెళ్లింది. దీంతో గిలకలదిండి హార్బర్ ముఖద్వారం వద్ద శుక్రవారం బోటును లంగరు వేసి నిలిపివేశారు.
ఈ బోటులో డ్రైవర్ సురేష్, జాలర్లు యషియా, నరసింహం, వెంకటేశ్వరరావు, చిన నరసింహం, మరో ముగ్గురు ఉన్నారు. శనివారం ఉదయం 9గంటల వరకు వీరు బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం సముద్రం ప్రశాంతంగానే ఉందని, ఈ రాత్రికి ఏం జరుగుతుందోనని భయంగా ఉందని బోటు డ్రైవర్ సురేష్ ‘సాక్షి’కి తెలిపారు.