సామాజిక భద్రత గాలిలో దీపం! | Social Security, the lamp is in the air | Sakshi
Sakshi News home page

సామాజిక భద్రత గాలిలో దీపం!

Published Fri, Oct 17 2014 11:24 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సామాజిక భద్రత గాలిలో దీపం! - Sakshi

సామాజిక భద్రత గాలిలో దీపం!

హుదూద్ విలయాన్ని ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నదని ప్రచారం సాగుతోంది. నాలుగు రోజుల ముందే తెలిసి సంభవించిన ఉత్పాతాన్ని ఎదుర్కోవడానికి పూర్తిగా సంసిద్ధమై ఉంటే విద్యుత్ పునరుద్ధరణ ఇంత ఆలస్యమయ్యేదా? జనం తాగునీటి కోసం సైతం ఇంకా కటకటలాడాల్సి వచ్చేదా?

తొలి తెలంగాణ ప్రభుత్వ హయాంలో 250 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఆత్మహ త్యలకు పాల్పడవచ్చని తెలుసు. కానీ, ఊరూరా, వాడవాడలా జేఏసీలను నిర్మించి ఉద్యమ ప్రస్థానం సాగించిన పార్టీ ప్రభుత్వానికి.. రైతులకు ధైర్యం చెప్పే కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాలేదా?
 
సాంఘికశాస్త్రం
 
‘దేశమంటే మనుజులోయ్’ అన్నది గురజాడ మాట. ‘దేశమంటే ఓటరోయ్’ అన్నది నేటి ఏలికల మాట. నాలుగు ఓట్లను వెనకేసుకునేందుకు కావాల్సిన రాజకీయ వ్యూహాలంటే మన నాయకులకు బోలెడంత శ్రద్ధ. పౌర సంక్షేమం, సాంఘిక భద్రతలతో ముడిపడిన విషయాలపై అలాంటి ముందస్తు ఆలోచనలు చేయడంలో మాత్రం ఆ ఆసక్తి కనబడదు. సమాజంలో అవాంఛనీయమైన ధోరణులు తలెత్తబోతున్నాయనే సూచనలు కనిపించినప్పుడుగానీ, విపత్తులు ఎదురు కాబోతున్నాయనే హెచ్చరికలు అందినప్పుడుగానీ ప్రభుత్వాలకు ఉండవలసిన సన్నద్ధత, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం మృగ్యం. పెపైచ్చు గోరంత పనికి కొండంత ప్రచార రాగం తీసే విపరీత ధోరణి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిణామాలనే తీసుకుందాం. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక జీవనాడిగా భాసిల్లుతుందని భావిస్తున్న విశాఖ పట్నం(ఉత్తరాంధ్రసహా) పై పెనుగాలులతో ప్రకృతి విరుచుకు పడింది. తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన ఈ నాలుగున్నర మాసాల్లో సుమారు 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తలొస్తున్నాయి. ఈ రెండు ఉత్పాతాలను రెండు ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

ఈ నెల పన్నెండో తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు హుదూద్ తుపాను విశాఖపట్నం వద్ద తీరం దాటింది. గంటకు 200 కిలో మీటర్ల వేగపు పెనుగాలులతో విధ్వంసం సృష్టించి వెళ్లింది.
 
అంతకు ముందురోజు... అంటే పదకొండో తేదీనాటి వాతావరణ హెచ్చ రికను ఒకసారి చూడండి. తుపాను తీరం దాటే సమయానికి పన్నెండు గంటల ముందు నుంచి ఆ తర్వాత మరో 24 గంటలపాటు- మొత్తంగా 36 గంటలసేపు 160 నుంచి 180 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని స్పష్టంగా చెప్పింది.

 ఇంకోరోజు ముందుకెళ్దాం. పదో తేదీ నాటి వాతావరణ హెచ్చరిక... హుదూద్ తుపాను విశాఖపట్నం వద్దే తీరం దాటబోతోంది. ఆ సమయంలో భీకరమైన గాలులు వీస్తాయి.

అక్టోబర్ 9 నాటి వాతావరణ హెచ్చరిక... విశాఖపట్నం- గోపాల్‌పూర్ (ఒడిశా)ల మధ్య హుదూద్ తుపాను 12వ తేదీన తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.

 విశాఖపట్నాన్ని ప్రచండ మారుతం తాకబోతోందన్న విషయం మూడు రోజుల ముందే స్పష్టంగా తెలుసు. ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ మరింత స్పష్టంగా, లెక్కకట్టిన చందంగా తుపాను ప్రభావాన్ని వాతావరణ శాస్త్రం కళ్లకు కట్టింది. ఈ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రప్రభుత్వం తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కేంద్రప్రభుత్వం నౌకాదళాన్ని, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ను సమాయత్తం చేసింది. పదమూడో తేదీ మధ్యాహ్నం సమయానికి ముఖ్యమంత్రి విశాఖ పట్నం చేరుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి, సహాయ కార్యక్రమాలను సమన్వయం చేసే పనిని ప్రారంభించారు. స్థూలంగా ఇదీ ప్రభుత్వ స్పందన.

ఈ మాత్రం పనిని ఆకాశానికెత్తే స్తోత్ర కైవారాలు మూడోరోజు నుంచే మొదలయ్యాయి. కొందరు అధికారులు, మరికొందరు మేధావులనుకునేవాళ్ల ఇంటర్వ్యూలు కొన్ని పత్రికల్లో అచ్చవుతున్నాయి. కొన్ని చానళ్లలో ప్రసారమ వుతున్నాయి. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడం ఎప్పుడూ చూడలేదం టారు వారు. అసలు ముఖ్యమంత్రి విశాఖపట్నంలో మకాం వేయడమేమిటని ఆశ్చర్యపోతారు. ప్రధానమంత్రి స్వయంగా సమీక్షలో పాల్గొనడమేమిటని నివ్వెరపోతారు. అసలు ఈ ప్రభుత్వం ఉన్నది కనుకే ఇంత తక్కువమంది (36 మంది) చనిపోయారని కొందరు సూత్రీకరిస్తారు. ‘‘అనుభవమండీ... అనుభ వం, నేనందుకే చెప్పాను అనుభవజ్ఞుడు పాలకుడవ్వాలని’’ మరొకాయన తన దూరదృష్టిని జనానికి గుర్తుచేస్తారు. ఈ తుపాను ప్రమాదాన్ని ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నదని తామే ఒక నిర్ధారణకు వచ్చేసి, ప్రజ లంతా ఇదే అభిప్రాయాన్ని నమ్మితీరాలని చేస్తున్న ఈ ప్రచారం ఇలావుంటే... సామాన్యుల బుర్రలను మాత్రం అనేక సందేహాలు తొలిచేస్తున్నాయి. ప్రచం డమైన గాలులు వీస్తాయని మూడు నాలుగు రోజుల ముందే తెలుసుకదా... ఆ స్థాయి గాలులకు కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోతాయనీ, చెట్లు కూలిపోతాయని ఎందుకు ఊహించలేకపోయారు? అంధకారం ఆవరించే అవకాశంవుందని ఎందుకు అంచనా వేయలేకపోయారు? అంచనా వేసివుంటే తుపాను తీరం దాటడానికి ముందుగానే విద్యుత్ సిబ్బందిని, పరికరాలను సమీకరించి, ఎందుకు సిద్ధం చేయలేదు. అలా చేసి వున్నట్టయితే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఇంత ఆలస్యమయ్యేది కాదుగదా? ముందస్తు వ్యూహం ఉన్నట్లయితే విపత్తు సంభవించాక ఇన్ని రోజుల తర్వాత కూడా జనం తాగు నీటి కోసం ఎందుకు క్యూల్లో నిలబడాల్సివస్తోంది. కాలకృత్యాలు తీర్చుకోవ డానికీ ఎందుకు అవస్థలు పడాల్సివస్తోంది. పాలు, కూరగాయలను గంటల తరబడి నిలబడి మరీ అధిక ధరలకు ఎందుకు కొనుక్కోవలసి వస్తోంది? ఐదు రోజుల తర్వాత బంగాళదుంపల కోసం బెంగాల్ ముఖ్యమంత్రికి ఫోన్ చేయడ మేమిటి? ఈ పని ముందుగానే చేయలేరా? ఐదు రోజుల తర్వాత కూడా విశాఖ వీధుల్లో ఆకలికేకలు ఎందుకు వినాల్సివస్తోంది? తాను విశాఖలో ఉండటంవల్ల ప్రజలకు, అధికారులకు నైతిక బలాన్నిచ్చినట్టవుతుందని భావిస్తున్న ముఖ్య మంత్రి తుపానుకు ముందురోజే అక్కడ ఎందుకు మకాం వేయలేదు?
 ఇక తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు కొత్తగా ఇప్పుడు ప్రారంభమైనవి కాకపోవచ్చు. కానీ, ఈ నాలుగు మాసాల్లో పెరిగాయి.

విద్యుత్ సమస్య కూడా ఈ ప్రభుత్వం సృష్టించింది కాకపోవచ్చు. కానీ, మరింత జటిలంగా మారింది. ఈ నాలుగు మాసాల్లో సుమారు 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రని చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ మరో రెండు మూడు వారాల్లో పూర్తవుతుం దనగా ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ఇక పంటల దిగుబడి మీద ఆశలు పూర్తిగా అడుగంటడంతో, చేసిన అప్పులు గుర్తుకొచ్చి రైతులు పిట్టల్లా రాలు తున్నారు. ఈ సంవత్సరం సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. అయి నాసరే సాధారణ సాగులో 90 శాతానికి పైగా రైతులు సాగుచేశారు. ఏరువాక జూన్‌లో వుంటే మన బ్యాంకులు ఖరీఫ్ అప్పులను అక్టోబర్ నాటికి గానీ ఇవ్వవు. అప్పటికే ఖరీఫ్ పూర్తయ్యే దశలో ఉంటుంది. ప్రైవేట్ అప్పులను అధిక వడ్డీకి తీసుకొని రైతులు సాగు ప్రారంభిస్తారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు 180 శాతం పెరిగితే ఇదేకాలంలో మద్ధతు ధర 10 శాతం పెరి గింది. ఇన్ని కష్టాలతో సాగు ప్రారంభించిన రైతును వర్షాలు తొలిదెబ్బ తీస్తే, కరెంట్ మలిదెబ్బ తీసింది. ఒక మడి పూర్తిగా తడిసిన తర్వాతే రెండో మడిలోకి నీరు పారేలా ఉంటుంది మన వ్యవసాయ పద్ధతి. ఉదయం-రాత్రి... ఇలా రెం డు దఫాలుగా కరెంటు ఇవ్వడంతో తడిపిన ప్రతిసారీ మొదటి మడి తడవడమే తప్ప రెండో మడిలోకి నీరు పారదు. ఇచ్చిన కరెంట్ ఒకేసారి ఇస్తే కొంతైనా ఫలితముండేదేమో! పొట్టకొచ్చిన పంట చివరి తడులు లేక కళ్లముందే మాడి పోయింది. రుణాలు రెన్యువల్ అయివుంటే అక్టోబర్ నాటికైనావచ్చే బ్యాంకు రుణాలతో పీకల మీదున్న అప్పులను రైతు తీర్చుకునేవాడు. రుణమాఫీ ప్రక్రి య పూర్తికాకపోవడంతో ఆ ఆశాలేదు. అవమానభారాలు గుర్తుకొచ్చి బతుకు మీద ఆశ చస్తోంది. అరువుకు దొరికే మద్యం చావడానికి ధైర్యాన్నిస్తోంది.

 ఈ వ్యవహారంలో తొలి తెలంగాణ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తుందని ప్రజలు ఆశించారు. ఎందుకంటే, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఉద్యమానికి సారథ్యం వహించిన పార్టీ. కానీ, ఈ మొత్తం సీజన్‌లో ఏ దశలోనూ ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషించలేదు. పంటలు ఎండిపోతున్నాయని తెలుసు. రైతు లు ఆత్మహత్యలకు పాల్పడతారనీ తెలుసు. కానీ, గ్రామగ్రామాన ఆత్మహత్య లకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తితో జన చేతన కార్యక్రమాలు నిర్వహించాలన్న శ్రద్ధ మాత్రం దానికి కలుగలేదు. ఊరూరా, వాడవాడనా, జేఏసీలను నిర్మించి ఉద్యమ ప్రస్థానం సాగించిన పార్టీకి రైతులకు ధైర్యం చెప్పే కార్యక్రమం చేపట్ట డం సాధ్యం కాలేదా? నాలుగు వేలమంది తెలంగాణ కళాకారులను గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీనిచ్చిన ప్రభుత్వానికి, కళాబృందాలతో గ్రామగ్రామానా ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మనసు రాలేదా? ఉద్యమపార్టీ రాజకీయ పార్టీగా పరివర్తన చెందింది కాబట్టి బహుశా ఇక అటువంటి ఆలోచనలు రాకపోవచ్చు. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రచారం దొరికే బతుకమ్మలు, గోల్కొండ కోటలు, ట్యాంక్‌బండ్ విగ్రహాలు వుండగా సాంస్కృతికోద్యమాలు, సాంఘికోద్యమాలు ఎవరు తలకెత్తుకుంటారు?    
 
 వర్థెల్లి  మురళి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement