సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో ఎండలు తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు భగభగమండగా కోస్తా జిల్లాల్లో వాటి ప్రభావం ఇంకా ఎక్కువ కనిపించింది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉ.11 గంటలకే చాలా ప్రాంతాల్లో 40–41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు బయటకురావడానికే బెంబేలెత్తిపోయారు.
కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, పల్నాడు, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఈ జిల్లాల్లో దాదాపు అన్నిచోట్లా 40–44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. అనకాపల్లి, విశాఖ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో అత్యధికంగా 44.8 డిగ్రీలు నమోదైంది. ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.7, కామవరపుకోటలో 44.5, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 44.4, ఏలూరు జిల్లా రాజుపోతేపల్లిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మోకా తుపాను ప్రభావమే
మోకా తుపాను ప్రభావంవల్లే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతం నుంచి ఏపీకి వీచే గాలులను తుపాను లాగేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మన ప్రాంతంలో గాలిలో తేమ శాతం తగ్గిపోయింది.
కేవలం తేమలేని పొడిగాలులు వీస్తుండడంతో తీవ్రమైన ఉక్కపోత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాజస్థాన్, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం లేకపోవడంతో ఉక్కపోత, ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. తుపాను ప్రభావం తగ్గేవరకు అంటే నాలుగైదు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment