హుద్‌హుద్ తుపాను బారిన పడిన జిల్లా ఇంకా పూర్తిగా తేరుకోలేదు. నిలువ నీడకోల్పోయిన లక్షలాది మంది నేటికీ మొండిగోడల మధ్యే చలిని ఓర్చుకుంటూ పిల్లాపాపలతో జీవనపోరాటం సాగిస్తున్నారు. ప్రజల ఈతిబాధలు తమకేమి పట్టవన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానాలు.. సత్కారాలకు సిద్ధమవుతున్నారు. నగరవాసులు ఇంకాపూర్తి స్థాయిలో తేరుకోకుండానే కార్తీక వన మహోత్సవాలు.. బీచ్ సంబరాలు.. పుడ్‌ఫెస్టివల్స్ అంటూ నానా హంగామా చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
* కొలిక్కిరాని హుద్‌హుద్ నష్టం అంచనాలు
* బాధితులకు అందని పరిహారం
* బడుగు జీవులకు నేటికీ నిలువ నీడ కరువు
* నెలన్నరగా గంగపుత్రులకు ఉపాధి శూన్యం
* కార్తీక వనమహోత్సవాలు.. బీచ్ సంబరాలంటూ ప్రభుత్వం హంగామా
సాక్షి, విశాఖపట్నం: నగరంతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం ఈ పెనుతుపాను దె బ్బకు విలవిల్లాడిపోయింది. తుపాను మర్నాడే నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారంరోజుల పాటు మకాం వేసి యుద్ధప్రాతిపదికన సహాయ పునరావాసచర్యలు చేపట్టారు. బియ్యం, ఇతర నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు వారం పదిరోజుల్లోనే
నగరంలో విద్యుత్‌ను పునరుద్ధరించగలిగారు.
తాను ఉండ బట్టే సహాయ చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయంటూ ప్రజల్లో సీఎం ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పునరావాస చర్యలు నెమ్మదించాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ వెలుగులు విరజిమ్మక ప్రజలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నారు. ఇక 85వేల ఎకరాల్లో నేలకొరిగిన పంటలకు కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ, పంటనష్ట పరిహారం ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు అల్లాడిపోతున్నారు.
మరో పక్క విశాఖ నగరంతోపాటు ఉత్తరాంధ్రలో లక్షలాది మంది నిరుపేదల పూరిగుడెసెలు కుప్పకూలిపోయాయి. రేకులషెడ్లు, పెంకుటిళ్ల పైకప్పులు ఎగరిపోవడంతో కొంత మంది మొండిగోడల మధ్యే చలికి వణికిపోతూనే జీవనం సాగిస్తుంటే.. మరికొంతమంది టార్పాలిన్స్, ఫ్లెక్సీల మాటున తలదాచుకుంటున్నారు. కొండవాలుప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది ఇంకా మొండిగోడల మధ్యే జీవనం సాగిస్తున్నారు. గంగపుత్రుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది.
తుపానుకు వారం రోజుల ముందు నుంచి ఉపాధి కోల్పోయారు. వందలాది బోట్లు ధ్వంసం కావడంతో లక్షలాది మంది గంగ పుత్రులకు జీవనోపాధి లేకుండాపోయింది. అప్పోసప్పో చేసి బోట్లకు రిపేర్లు చేయించుకుని పదిరోజుల క్రితమే వేట సిద్ధమైనా బంగాళాఖాతంలో రోజుకో చోట వాయు గుండాలు.. అల్పపీడనాలు ఏర్పడడంతో మళ్లీ ఉపాధికి దూరమయ్యారు.
లెక్కతేలని నష్టం
ఇదంతా ఒక ఎత్తయితే ఎంతనష్టం జరిగిందో నేటికి లెక్కతేల్చలేకపోతున్నారు. 45 మంది చనిపోయినట్టు లెక్కతేల్చినా రాష్ర్టం తరపున 40 మంది కుటుంబాలకు రూ.5లక్షల వంతున పరిహారం అందజేశారు. మిగిలిన ఐదుగురికి ఐదు లక్షలతో పాటు మొత్తం 45 మంది కుటుంబాలకు కేంద్రం ప్రకటించిన రూ.2లక్షల సాయం నేటికీ అందలేదు. తొలుత లక్షా18వేలు..ఆ తర్వాత మరో 36వేల ఇళ్లు దెబ్బతిన్నట్టుగా లెక్కతేల్చిన అధికారులు వీటిలో కనీసం 10 వేల మందికి కూడా పరిహారం పంపిణీ చేయలేకపోయారు.
ఇక మత్స్యకారులకు జీవనోపాధి కింద ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున పంపిణీ చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ఏ ఒక్కరికి పంపిణీ చేయలేదు. ధ్వంసమైన బోట్లకు ఎలాంటి సాయం అందించలేదు. ఉచితం పేరుతో పంపిణీ చేసిన బియ్యంతో సహా నిత్యావసరాలు వందలాది టన్నులు పక్కదారి పట్టాయి. ఇలా తుపాను సహాయ, పునరావాస చర్యల్లో అడుగడుగునా నిర్లక్ష్యం.. అలక్ష్యంతో పాటు పెద్ద ఎత్తున చోటుచేసుకున్న అవినీతి.. అవకతవకలు కప్పిపుచ్చుకునేందుకు సర్కార్ సన్మానాలు..ఉత్సవాలతో హడావుడి చేస్తోంది.
అంతా నగరవాసులు పూర్తిగా సాధారణ జనజీవనంలోకి వచ్చేశారు. అంతా బ్రహ్మాండం అంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం నగరంలో వివిధ చోట్ల ఉత్సవాల నిర్వహణకు సిద్ధమయ్యారు. తుపాను తర్వాత నగరానికి వస్తున్న సీఎంను సత్కరిం చడంతో పాటు సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని సీఎంచే సత్కరిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఉత్సవాలు.. సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నగర వాసులు ఇంకా పూర్తి స్థాయిలో తేరుకోలేదు. ఇలాంటి తరుణంలో ఉత్సవాలేమిటంటూ మేధావులు, వివిధ రాజ కీయ పార్టీల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తేరుకోకుండా సంబరాలా?
Published Mon, Nov 17 2014 4:20 AM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM
Advertisement
Advertisement