వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే మురిసే చిన్నారి హృదయాలకు ప్రకృతి ఆత్మీయ నేస్తం. అలాంటి అందమైన, ఆత్మీయమైన ప్రకృతి ఎదుట విలయ విధ్వంసం కరాళనృత్యం చేస్తుంటే...
లిసిప్రియలాంటి చిన్నారులు ‘పాపం, పుణ్యం ప్రపంచ మార్గం’ అని ఊరుకోరు. ప్రకృతికి సంబంధించి మనం చేస్తున్న పాపం ఏదో, పుణ్యం ఏదో కళ్లకు కట్టేలా ప్రచారం చేస్తారు.
దుబాయ్‌లో జరిగిన ‘యునైటెడ్ నేషన్స్ క్లైమెట్ చేంజ్ కాన్ఫరెన్స్–2023’లో తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది మన దేశానికి చెందిన పన్నెండు సంవత్సరాల లిసిప్రియ కంగుజామ్. ‘శిలాజ ఇంధనాలను అంతం చేయండి... భవిష్యత్తును, భూగోళాన్ని కాపాడండి’ అంటూ నినదించింది. కొద్దిసేపు ప్రసంగించింది. ఆమె నిరసనను ప్రపంచ ప్రతినిధులు కొందరు చప్పట్లతో ఆమోదం పలికారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మణిపుర్‌కు చెందిన క్లైమెట్ యాక్టివిస్ట్ లిసిప్రియ గురించి....
లిసిప్రియ కంగ్‌జామ్ మణిపుర్‌లోని బషిక్‌హోంగ్‌లో జన్మించింది. తల్లిదండ్రుల ద్వారా, స్కూల్లో ఉపాధ్యాయుల ద్వారా విన్న పర్యావరణపాఠాలు ఈ చిన్నారి మనసుపై బలమైన ప్రభావాన్ని చూపాయి. పర్యావరణ సంరక్షణ కోసం తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది. ఏడు సంవత్సరాల వయసులోనే అందరూ ఆశ్చర్యపడేలా పర్యావరణ సంబంధిత విషయాలు మాట్లాడేది.
2018లో ప్రకృతి విధ్వంసంపై మంగోలియాలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో తండ్రితో కలిసి పాల్గొంది. ఈ సదస్సులో వక్తల ఉపన్యాసాల నుంచి ఎన్నో కొత్తవిషయాలు నేర్చుకుంది. ఈ సదస్సు ప్రియ జీవితాన్ని మార్చేసిన సదస్సు అని చెప్పవచ్చు. ఈ సదస్సు స్ఫూర్తితో ‘చైల్డ్ మూమెంట్’ అనే సంస్థను మొదలుపెట్టింది. మొక్కల పెంపకం వల్ల ప్రకృతికి జరిగే మేలు, ప్రకృతి విధ్వంసం వల్ల జరిగే నష్టాలు... మొదలైన వాటి గురించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో స్కూల్స్‌లో ప్రచారకార్యక్రమాలు విరివిగా నిర్వహించింది.
2019లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. ఇదే సంవత్సరం అంగోలా దేశంలో జరిగిన ఆఫ్రికన్ యూనియన్ సదస్సులో పాల్గొంది. ఈ సదస్సులో ఎంతోమంది దేశాధ్యక్షులతో పాటు ప్రియ ప్రసంగించడం విశేషం. చిన్నవయసులోనే ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు తెచ్చుకుంది లిసిప్రియ.
ప్రియకు డబ్బులను పొదుపు చేయడం అలవాటు. అవి తన భవిష్యత్ అవసరాలకు ఉద్దేశించి కాదు. సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం కోసం పొదుపు చేస్తుంటుంది. 2018లో కేరళ వరద బాధితులకు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి లక్షరూపాయలు విరాళంగా ఇచ్చింది. దిల్లీలోని వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని‘సర్వైవల్ కిట్ ఫర్ ది ఫ్యూచర్’అనే డివైజ్‌కు రూపకల్పన చేసింది.
ఈ జీరో బడ్జెట్ కిట్ వాయుకాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఎవరైనా, ఎక్కడైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని పంజాబ్ అసెంబ్లీలో లాంచ్ చేసింది ప్రియ. వాతావరణ మార్పులపై కార్యచరణ కోసం, మన దేశంలో క్లైమెట్ లా కోసం వందలాదిమందితో కలిసి దిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ప్రదర్శన నిర్వహించింది. ‘సందేశం ఇవ్వాలనుకోవడం లేదు. సమస్యను అర్థం చేసుకోమని చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను’ అంటుంది లిసిప్రియ.
యాక్ట్ నౌ
దుబాయ్‌లో జరిగిన క్లైమేట్ కాన్ఫరెన్స్–2023లో 190 దేశాల నుంచి 60,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారి ప్రియ ధైర్యంగా వేదిక మీదికి వచ్చి ‘అవర్ లీడర్స్ లై, పీపుల్ డై’ అని గట్టిగా అరిచింది. సదస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తరువాత ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ‘ఎవరు ఈ అమ్మాయి?’ అంటూ చాలామంది ఆరా తీశారు. చిన్న వయసు నుంచే పర్యావరణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న ప్రియ గురించి తెలుసుకొని ఆశ్చర్యానందాలకు గురయ్యారు.
శిలాజ ఇంధనాలను అంతం చేయండి... భవిష్యత్తును, భూగోళాన్ని కాపాడండి.
– లిసిప్రియ
నా నేరం ఏమిటి?
నిరసన తరువాత అధికారులు నన్ను 30 నిమిషాలకు పైగా నిర్బంధించారు. నేను చేసిన నేరం ఏమిటంటే పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణం అయిన శిలాజ ఇంధనాలను దశల వారీగా తొలగించమని అడగడం. నన్ను ‘కాప్ 28’లో లేకుండా చేశారు.
– లిసిప్రియ, యాక్టివిస్ట్
Comments
Please login to add a commentAdd a comment